చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ

ABN , First Publish Date - 2022-10-03T04:37:34+05:30 IST

ఒకప్పుడు పాడి పెంపకం సిరులు కురిపించేది. నాలుగు ఆవులను మేపుకొని వాటి పాలను అమ్ముకుంటే నెలకు సరిపడా ఆదాయం వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. పశుగ్రాసం నుంచి దాణా వరకు అన్ని ధరలూ పెరిగిపోవడంతో పాడిరైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అప్పు చేసి ఇవన్నీ కొనిపెట్టినా పితికిన పాలకు గిట్టుబాటు ధర రావడంలేదు. ఫలితంగా పాడి సంపదను కబేళాలకు తరలిస్తున్నాడు.

చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ
గోపాలపెంటలో పాడిపశువులు

- పశువుల పెంపకంపై రైతుల అనాసక్తి
- ప్రభుత్వ ప్రోత్సాహం అంతంత మాత్రమే
- కబేళాలకు తరలుతున్న పాడి సంపద
(నరసన్నపేట)

ఒకప్పుడు పాడి పెంపకం సిరులు కురిపించేది. నాలుగు ఆవులను మేపుకొని వాటి పాలను అమ్ముకుంటే నెలకు సరిపడా ఆదాయం వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. పశుగ్రాసం నుంచి దాణా వరకు అన్ని ధరలూ పెరిగిపోవడంతో పాడిరైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అప్పు చేసి ఇవన్నీ కొనిపెట్టినా పితికిన పాలకు గిట్టుబాటు ధర రావడంలేదు. ఫలితంగా పాడి సంపదను కబేళాలకు తరలిస్తున్నాడు. 2018 పశుగణన ప్రకారం జిల్లాలో 1,34361 గేదెలు, 2,74,768 ఆవులు ఉండేవి. వీటిద్వారా రోజుకు సరాసరి 6,13,400 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటి సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ప్రతిచోటా పాడి అభివృద్ధి 5 శాతానికి పైగా  పడిపోయింది. నాలుగు పశువుల దాణా కోసం రోజుకు రూ.400 వరకు ఖర్చు చేయాలి. వీటి సంరక్షణకు ఇద్దరు మనుషులు ఉండాలి. వీరికి రోజుకు రూ.400 చెల్లించాలి. ఈ లెక్కన నాలుగు పశువుల పెంపకానికి రోజుకు 800 రూపాయలు ఖర్చు అవుతోంది. అయితే,  పెట్టుబడి, వాటికి చేస్తున్న చాకిరితో పోల్చితే వచ్చే ఆదాయం చాలా తక్కువుగా ఉంటుందని పాడి రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ ఫలితంగా ఎండుగడ్డి కొరత ఏర్పడింది. పచ్చిక బైళ్లు సైతం కరువయ్యాయి. దీంతో కేవలం పశుదాణా మీదే రైతులు ఆధార పడుతున్నారు. పశుదాణా, ఖర్చు, పాలకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉండడంతో పాడి పెంపకంపై రైతులకు ఆసక్తి సన్నగిల్లుతోంది. పాడిపశువులను నమ్ముకునే కన్నా.. కూలి పనికి వెళితే మంచిదని కొంతమంది రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
 
రోజంతా చాకిరీ
నాలుగు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే నాలుగు పాడి ఆవులు వస్తున్నాయి. వీటిని మేపడానికి, చాకిరీ చేయడానికి ఇద్దరు మనుషులు రోజంతా పనిచేయాలి. ఈ ఆవుల ద్వారా రోజుకి రూ.800 ఆదాయం వస్తుంది. ఇందులో దాణా రూ.400, ఇద్దరు మనుషులకు కూలీ రూ.400 పోతుంది. ఇక పాడి రైతులకు ఇంకేం మిగులుతుంది. బయట కూలికి వెళితే రూ.300 వరకూ వస్తాయి.
 - వెలమల రమణమ్మ, పాడిరైతు, జమ్ము

పాల ధర పెంచాలి  
పాలధర లీటరు రూ.60 వరకూ పెంచాలి. పాలశీతల కేంద్రాలకు వెళ్లినప్పుడు సాంద్రత తక్కువుగా ఉందన్న పేరుతో రూ.28 నుంచి రూ.35 మధ్య ఇస్తున్నారు. నేను నాలుగు ఆవులను పెంచుతున్నాను. ఇందులో చూడి సమయంలో రెండు పశువులు పాలివ్వడం ఆపేస్తాయి. ఇలాంటి సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. పాడిరైతులకు బ్యాంకులు ప్రత్యేక రుణాలు ఇవ్వాలి.
- ముద్దాడ అప్పలనాయుడు, పాడిరైతు, కోమర్తి 

ప్రోత్సహకాలు అందజేస్తున్నాం  
ప్రభుత్వం ద్వారా పాడి రైతులకు పశుదాణాతో పాటు ఇతర ప్రోత్సహకాలను అందజేస్తున్నాం. సబ్సిడీపై పశువులను కొనుగోలు చేసేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందిస్తున్నాం.
- రాజగోపాల్‌, ఏడీ, పశుసంవర్ధక శాఖ, నరసన్నపేట

 

Updated Date - 2022-10-03T04:37:34+05:30 IST