ఉద్యోగులకు YS Jagan శఠగోపం.. తెరపైకి కొత్త ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2022-04-26T08:45:45+05:30 IST

అన్న వస్తాడు.. ఇచ్చిన హామీ ప్రకారం వారంలో రద్దు చేస్తాడని ఎదురుచూసిన 2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులకు సీఎం జగన్మోహన్‌రెడ్డి గట్టి షాకే ఇచ్చారు.

ఉద్యోగులకు YS Jagan శఠగోపం.. తెరపైకి కొత్త ప్రతిపాదనలు

  • సీపీఎస్‌ కాదు.. జీపీఎస్‌!
  • చివరి బేసిక్‌ పేపై 33.5% ఇస్తామని మెలిక
  • సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ
  • సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ
  • దీనికి అరగంట ముందే ఈ కమిటీ ఏర్పాటు
  • సీపీఎస్‌ సంఘాలకు ఆహ్వానమే లేదు
  • మంత్రులు బొత్స, సురేశ్‌ కూడా గైర్హాజరు
  • పాత పెన్షన్‌ కొనసాగింపు దుస్సాహసమే
  • రాబడులకు మించిన ఖర్చు: బుగ్గన
  • గ్యారెంటీ పింఛను స్కీం మేలని ప్రతిపాదన
  • ఉద్యోగుల ఆర్థిక భద్రతే లక్ష్యమన్న సజ్జల
  • 2031, 2041, 2100 వరకు ఎంతెంత 
  • భారమో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌
  • ఉద్యోగ నాయకుల తీవ్ర వ్యతిరేకత
  • పెన్షన్‌ మా హక్కు.. ప్రభుత్వ భిక్ష కాదు
  • గద్దెనెక్కిన వారంలో సీపీఎస్‌ రద్దుకు
  • నాటి జగన్‌ హామీ.. అమలు చేయాల్సిందే
  • ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల స్పష్టీకరణ


సీపీఎస్‌ రద్దుచేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేలిపోయింది. అధికారంలోకి వచ్చిన వారంలోగా ఈ విధానాన్ని రద్దుచేస్తానన్న జగన్మోహన్‌రెడ్డి.. పాత పెన్షన్‌ స్కీం పెనుభారమని మూడేళ్ల తర్వాత తీరిగ్గా చెబుతున్నారు. ఈ రెండింటి బదులు జీపీఎస్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. చివరి బేసిక్‌ పేపై 33.5 శాతాన్ని పెన్షన్‌గా ఖరారుచేస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదనలను ఉద్యోగ/ఉపాధ్యాయ సంఘాలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి.


అమరావతి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): అన్న వస్తాడు.. ఇచ్చిన హామీ ప్రకారం వారంలో రద్దు చేస్తాడని ఎదురుచూసిన 2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులకు సీఎం జగన్మోహన్‌రెడ్డి గట్టి షాకే ఇచ్చారు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ శఠగోపం పెట్టే ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) బదులు గ్యారెంటీ పెన్షన్‌  స్కీం(జీపీఎ్‌స)ను అమలు చేస్తామని ప్రతిపాదించారు. దీంతో బిత్తరపోవడం ఉద్యోగుల వంతైంది. సోమవారం అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి  అరగంట ముందే సీపీఎ్‌సపై ఈ మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం గమనార్హం. ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ సభ్యులు. కమిటీ సమావేశానికి మంత్రి బుగ్గన, సీఎస్‌, సజ్జల, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు. బొత్స, సురేశ్‌ రాలేదు. 


సీపీఎస్‌ సంఘాలకు అసలు ఆహ్వానమే పంపలేదు. పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) కొనసాగించడం ప్రపంచంలోనే దుస్సాహసంగా మారిందని, దీనిని కొనసాగిస్తే రాబడులకు మించిన ఖర్చవుతుందని బుగ్గన ఈ సందర్భంగా సెలవిచ్చినట్లు తెలిసింది. ఉద్యోగులకు సాఽధ్యమైనంత లబ్ధి చేకూర్చే విధంగా జీపీఎస్‌ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. పదవీ విరమణ తదుపరి ఉద్యోగులకు సాధ్యమైనంత ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు సజ్జల పేర్కొన్నారు. అంటే పాత, సీపీఎస్‌ పథకాలను పక్కనబెట్టి కొత్త పథకం అమలు చేస్తామని ఉద్యోగులకు సంకేతమిచ్చారన్న మాట.


పాత, కొత్త పథకాల సమన్వయంతో..

జీపీఎస్‌ గురించి ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఉద్యోగ/ఉపాధ్యాయ సంఘాల నేతలకు వివరించారు. సీపీఎస్‌ వల్ల ఉద్యోగులకు భద్రత లేదని.. మార్కెట్‌ రాబడులపై ఆధారపడి అమలవుతుందని తెలిపారు. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ.. ఓపీఎస్‌, సీపీఎ్‌సకు మధ్యేమార్గంగా జీపీఎస్‌ అమలు చేస్తామని వెల్లడించారు. సీపీఎస్‌ ఉద్యోగులకు ఓపీఎస్‌ అమలు చేస్తే... 2031, 2041, 2100 సంవత్సరాల వరకు ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో తెరమీద కాకిలెక్కలు వేసి చూపించారు. ఓపీఎస్‌ ఉద్యోగులకు చివరి బేసిక్‌ పే మీద 50 శాతం పెన్షన్‌ ఫిక్స్‌ అవుతుందని, అదే సీపీఎస్‌ ఉద్యోగులకు ఆఖరి బేసిక్‌ పే మీద 20 శాతం పెన్షన్‌ వస్తుందని, వీటికి మధ్యే మార్గంగా జీపీఎస్‌ ద్వారా చివరి బేసిక్‌ పే మీద 33.5 శాతం పెన్షన్‌ అమలు చేస్తామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని, మళ్లీ కలుద్దామని ఉద్యోగ సంఘాలను మంత్రుల కమిటీ కోరింది.


ఈ ప్రతిపాదనలు చూశాక ఆయా సంఘాల నేతలు కంగుతిన్నారు. గద్దెనెక్కిన వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తానని జగన్‌ ప్రతిపక్ష నేతగా నాడు హామీ ఇచ్చి... మూడేళ్ల తర్వాత తీరిగ్గా ఇంకో స్కీం ముందుకు తేవడంపై విస్మయానికి లోనయ్యారు. ‘2100వ సంవత్సరానికి ఎవరు ఉంటామో, ఎవరు పోతామో ఎవరికి ఎరుక? ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరించాలని కోరితే ఇవేం ప్రతిపాదనలు’ అని విస్తుపోయారు. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కమిటీకి తేల్చిచెప్పారు. పైగా తెరపై లెక్కలు చూసి అభిప్రాయాలు ఎలా చెబుతామని ప్రశ్నించారు. ప్రతిపాదనల ప్రతులు ఇవ్వాలని.. వాటిని పరిశీలించి అప్పుడు చెబుతామని స్పష్టం చేశారు. పెన్షన్‌ తమ హక్కు అని.. భిక్ష కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోవైపు.. జీపీఎస్‌ అనే పదాన్ని కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రభుత్వం.. దానిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఈ పథకంలో ఓపీఎస్‌లా డీఏలు, ఈహెచ్‌ఎ్‌స, తదితర ప్రయోజనాలు వర్తిస్తాయో లేదో చెప్పలేదు. 


సాగదీతకే సమావేశాలు...

ప్రభుత్వం పీఆర్‌సీ వ్యవహారంలో మాదిరిగానే సీపీఎస్‌ రద్దునూ అటకెక్కించే ఆట ఆరంభించిందని ఉద్యోగులు అంటున్నారు. పీఆర్‌సీపైనా సాగదీసి చివరికి ఐఆర్‌ కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చి మోసగించారని.. ఇప్పుడు సీపీఎస్‌ రద్దు బదులు కొత్త ప్రతిపాదనలతో చర్చలు, సమావేశాలంటూ ఇంకొంత కాలం సాగదీసి.. చివరకు ఆర్థిక భారం నెపంతో కొత్త స్కీం అమలు చేస్తారేమోనని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, సీపీఎస్‌ ఉద్యోగులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీకి కాలపరిమితి లేకపోవడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఇప్పటికే పీఆర్‌సీపై సహచర ఉద్యోగుల్లో తలెత్తుకోలేని పరిస్థితి తమకు వచ్చిందని.. సీపీఎస్‌పై కూడా ప్రభుత్వం ఇలాగే చేస్తే ఉద్యోగుల్లోకి వెళ్లే పరిస్థితి ఉండదని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ అమలుకు పూనుకున్నాయని.. భారం పడదని ఆ రాష్ట్రాలు చెబుతోంటే.. జగన్‌ ప్రభుత్వం భారమనడం వింతగా ఉందని చెబుతున్నారు.


బకాయిలు, అడ్వాన్సులపై దాటవేత

మంత్రుల కమిటీ భేటీలో.. పీఆర్‌సీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఎరియర్లు, డీఏ బకాయిల నుంచి ఐఆర్‌ రికవరీ చేయబోమంటూ జీవో, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఈ ఎల్‌ సరెండర్లు, ఎన్‌క్యా్‌షమెంట్లు, లోన్లు అడ్వాన్సులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్ల గురించి ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించారు. వాటిపై తర్వాత మాట్లాడదామంటూ అధికారులు దాటేశారని వారు చెబుతున్నారు.


ఆనాడు చంద్రబాబు చెప్పిందే..!

జీపీఎ్‌సపై జగన్‌ సర్కారు ఇచ్చిన ప్రజెంటేషన్‌ చూసి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు విస్మయానికి లోనయ్యారు. జీపీఎస్‌ అంటే వారికి అర్థం కాక కాదు.. మూడేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీపీఎస్‌ రద్దు చేయాలంటూ ఉద్యోగులు ఆందోళన చేశారు. చంద్రబాబు వాళ్లను చర్చలకు పిలిచారు. సీపీఎస్‌ రద్దు చేస్తే భవిష్యత్‌లో రాష్ట్రానికి విపరీతమైన నష్టం కలుగుతుంది కాబట్టి దానిని రద్దు చేయలేమని వారికి స్పష్టం చేశారు. దాని బదులు అదనపు ప్రయోజనాలు కల్పించేలా జీపీఎస్‌ విధానం అమలు చేస్తామని వివరించారు. అయితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి.. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని అప్పటికే హామీ ఇచ్చారు. అది నమ్మిన ఉద్యోగులు ఆ రోజు చంద్రబాబు చెప్పిన జీపీఎస్‌ విధానంపై వినేందుకు కూడా ఆసక్తి చూపలేదు. చర్చల నుంచి లేచి వచ్చేశారు. మళ్లీ చర్చలకు వెళ్లలేదు కూడా. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం సీపీఎస్‌ రద్దుకు మూడేళ్ల పాటు ఊరించి ఊరించి.. మళ్లీ అదే చంద్రబాబు ప్రతిపాదించిన జీపీఎస్‌ను తెరపైకి తేవడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో చంద్రబాబు ఇంతకంటే మంచి ప్రతిపాదనలే తమ ముందు పెట్టారని.. అయినా తాము సీపీఎస్‌ రద్దుకే పట్టుబట్టి వాటిని వినేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.

Updated Date - 2022-04-26T08:45:45+05:30 IST