Advertisement
Advertisement
Abn logo
Advertisement

గల్ఫ్‌లో కొలువుల సంక్షోభం.. ఆందోళనలో తెలుగు ప్రవాసీలు

ఒమన్‌లో ఉద్యోగాల జాతీయకరణ.. 

స్థానికులకు ఉపాధి కల్పన అవకాశాలు

ప్రవాసీల ఉద్యోగాల్లో కోత

విదేశీయుల నియామకంపై ఆంక్షలు


(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): అపార చమురు సంపద, అభివృద్ధిలో ఆకాశమే హద్దుగా ఉన్న గల్ఫ్‌ దేశాల్లో తెలుగు ప్రవాసీలకు కష్టమొచ్చిపడింది. ఉద్యోగాలు, వివిధ రంగాల్లో పనులు చేసుకుంటూ స్థిరపడిన ప్రవాసీలు.. ఇక తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు స్థానికులైన అరబ్బులు, అంత్యంత విద్యార్హతలు ఉన్నవారు, వీటన్నింటికి మించి ప్రభుత్వం నుంచి అందే రాయితీల కారణాన ఉద్యోగాలవైపు పెద్దగా శ్రద్ధ చూపలేదు. దీంతో భారతదేశం నుంచి గల్ఫ్‌ దేశాలకు వచ్చిన వారు సునాయసంగా ఉద్యోగాలు పొందడంతో పాటు కష్టపడి సంపాదించేవారు. కానీ ఇప్పుడు గల్ఫ్‌ దేశాల్లో ప్రత్యేకించి ఒమన్‌, సౌదీ అరేబియా దేశాల్లో పరిస్థితి క్రమేణా మారిపోతోంది. భారతీయులు చేస్తున్న తేలికపాటు రకమైన ఉద్యోగాలు తాము కూడా చేస్తామని స్థానిక యువతీయువకులు ముందుకొస్తున్నారు. 


విదేశీయులను తొలగించి తమకు ఆవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో 100ు ఉద్యోగాల జాతీయకరణ జరుగుతోంది. ప్రైవేట్‌ రంగంలోనూ పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులనూ క్రమేణా తొలగించడానికి ఈ రెండు దేశాలు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాయి. ఇటీవల అనేక నిబంధనలను ప్రవేశపెట్టాయి. దీంతో వేలాదిమంది తెలుగు ప్రవాసీ ఉద్యోగుల భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముకొంటున్నాయి. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లికి చెందిన రీటా సామ్యూల్‌ రుచిక ఒమన్‌ రాజధాని మస్కట్‌లో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తుండగా.. విధుల నుంచి ఆమెను తొలగించారు. వీసాను రెన్యూవల్‌ చేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. అదే విధంగా, కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన జహాందర్‌ అలీ కూడా 25 సంవత్సరాలుగా పనిచేస్తుండగా.. అతన్ని కూడా తీసేయడంతో తిరిగి సొంత ప్రాంతానికి వెళ్లిపోయారు. నిజామాబాద్‌ జిల్లా మక్లూరు మండలానికి చెందిన దేవయ్య, ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన గొల్లపల్లి ప్రణీతలది కూడా అదే పరిస్థితి. 


వీసా, లేబర్‌ కార్డు రుసుంను భారీగా పెంపు!

విదేశీయుల నియామకం కోసం ఇచ్చే వీసా, లేబర్‌ కార్డు రుసుంను భారీగా పెంచడంతో భారత్‌ లేదా ఇతర దేశాల నుంచి వచ్చే వారిని ఉద్యోగాల్లో నియమించుకోవడానికి ఒమన్‌లోని పైవ్రేటు సంస్థలకు ఇప్పుడు తలకుమించిన భారంగా మారుతోంది. ఒకవేళ పెద్దమొత్తంలో వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అడ్మినిస్ట్రేషన్‌, అకౌంటింగ్‌, సేల్స్‌, డ్రైవింగ్‌ విభాగాలలో దాదాపు విదేశీయుల భర్తీని ఒమన్‌ ప్రభుత్వం నిషేధించింది. అదేవిధంగా కీలకమైన ఈ రంగాలలో ఇప్పటి వరకు కొనసాగుతున్న విదేశీయుల తదుపరి లేబర్‌ కార్డులను, వీసాలను రెన్యూవల్‌ చేయబోమని స్పష్టం చేయడంతో కొన్ని వేలాదిమంది తెలుగు ప్రవాసీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మిగిలిన గల్ఫ్‌ దేశాల తరహా ఒమన్‌లోనూ తెలుగు ప్రవాసీలలో అత్యధికులు భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తుండగా, వారికి జాతీయకరణ ప్రమాదం లేనప్పటికీ.. కొన్నాళ్లుగా పెట్రోలు ధరలు పడిపోయి పనులు లేకపోవడంతో అనేక మంది తిరిగి స్వదేశానికి వెళ్లిపోతున్నారు.


తొలగిస్తే వెళ్లిపోవాల్సిందే! 

‘ఇది వాళ్ల దేశం. అవకాశం ఇచ్చారు కాబట్టి మేం ఉద్యోగం చేసుకుం టున్నాం. విధుల నుంచి తొలగిస్తే వెళ్లిపోవాల్సిందే. చేసేదేం లేదు’ అంటూ మస్కట్‌లోని భూసార పరీక్ష కేంద్రంలో పనిచేసే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సుంకరి రవి వ్యాఖ్యానించారు. సలాలలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే ఏపీలోని గుంటూరుకు చెందిన జి. సందీప్‌ కుమార్‌ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement