- మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ బెయిల్ పిటిషన్ తోసివేత
అడయార్(చెన్నై): అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వం ఉద్యోగం పేరుతో రూ.3 కోట్ల మేరకు వసూలు చేసి, పలువురిని మోసగించినట్టు వచ్చిన ఆరోపణల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈయన గత ప్రభుత్వంలో పాడిపరిశ్రమల శాఖామంత్రిగా ఉన్న సమయంలో ఆవిన్తో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తానని నమ్మించి రూ.3 కోట్ల మేర ముడుపులు పుచ్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ బాధితులకు ఉపాధి కల్పించకపోగా తిరిగి డబ్బు కూడా చెల్లించలేదు. దీంతో విజయ్ నల్లతంబి, రవీంద్రన్ అనే బాధితుల ఫిర్యాదు మేరకు విరుదునగర్ జిల్లా క్రైమ్ విభాగం పోలీసులు మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ, ఎన్.బాబూరాయ్, వి.ఎస్.బలరామన్, ఎస్కే. ముత్తుపాండ్యన్ తదితరులపై కేసులు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ రాజేంద్ర బాలాజీ తోపాటు మిగిలిన వారు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. వీరు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో నల్లతంబిపై అనేక ఆరోపణ లున్నాయి. పైగా ఇపుడు తమ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేశారు అని పేర్కొన్నారు. దీంతో విజయ్ నల్లతంబి కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు న్యాయమూర్తి ఎం.నిర్మల్ కుమార్ విచారణకు వచ్చాయి. ఆ సమయంలో రాజేంద్ర బాలాజీ తరపున హాజరైన న్యాయవాది వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ నిరాపరాధి. అసలు నిందితుడు విజయ్ నల్లతంబినే. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదు. పైగా కేసు విచారణకు పూర్తిగా సహకరిం చేందుకు సిద్ధం అని కోర్టుకు తెలిపారు. అయితే, పోలీసుల తరపున హాజరైన అడ్వకేట్ వాదిస్తూ అనేక మంది బాధితుల వద్ద రూ.3 కోట్ల మేరకు వసూలు చేసి, మోసం చేశారు. ఈ కేసులో 23 మంది సాక్షులను విచారించాం. రాజేంద్ర బాలాజీకి పీఏగా ఉన్న బలరామన్ ద్వారానే ఈ నగదు బట్వాడా జరిగింది. విజయ్ నల్లతంబిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉంది. మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీకి వ్యతిరేకంగా అనేక ఆధారాలున్నాయి. అందువల్ల ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నిర్మల్ కుమార్... ఈ కేసులో నేరం చేసినట్టుగా పలు ఆధారాలున్నాయి. అందువల్ల రాజేంద్ర బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతున్నట్టు వెల్లడించారు. అయితే, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు రెండు వారాల అవకాశం ఇవ్వాలని కోరగా, ఉపాధి కల్పన పేరుతో మోసాలకు పాల్పడే కేసుల్లో శిక్షలను నిలిపివేసే అవకాశం లేదని పేర్కొంటూ ఆయన వినతిని తోసిపుచ్చారు.
ఏ క్షణమైనా అరెస్టు
మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ పపెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో పాటు పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో మాజీ మంత్రిని ఏ క్షణమైనా విరుదునగర్ జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. గతంలో తన బంగళా వెలుపల అన్నాడీఎంకే కార్యకర్తలపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికితోడు పార్టీలోనూ అంతర్గతంగా ఆయనపై తీవ్ర అసంతృప్తి ఉంది. ఇపుడు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తోసివేయడంతో రాజేంద్ర బాలాజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి