జగన్‌.. జాబ్‌ ఎక్కడ?

ABN , First Publish Date - 2022-07-28T04:19:29+05:30 IST

‘రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ అమలు కావడం లేదు’ అంటూ తెలుగు యువత ఆందోళన బాట పట్టారు. బుధవారం టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట, పాతపట్నం ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి.. జాబ్‌ ఎక్కడ అని తెలుగు యువత నాయకులు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

జగన్‌.. జాబ్‌ ఎక్కడ?
ఇచ్ఛాపురం : ఎర్రన్న కూడలిలో నినాదాలు చేస్తున్న టీడీపీ నాయకులు

జిల్లాలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు
టెక్కలిలో దున్నపోతు మెడలో జగన్‌ ఫొటోతో ఊరేగింపు
జాబ్‌ క్యాలెండర్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌
(టెక్కలి/ ఇచ్ఛాపురం/ పలాస/ నరసన్నపేట/ పాతపట్నం, జూలై 27)

‘రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ అమలు కావడం లేదు’ అంటూ తెలుగు యువత ఆందోళన బాట పట్టారు. బుధవారం టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట, పాతపట్నం ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి.. జాబ్‌ ఎక్కడ అని తెలుగు యువత నాయకులు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
టెక్కలిలో ఓ దున్నపోతు మెడలో సీఎం జగన్‌ చిత్రపటాన్ని వేలాడదీసి.. వినూత్న నిరసన చేపట్టారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు ఆధ్వర్యంలో టెక్కలి, సంతబొమ్మాళి, నందిగాం, కోటబొమ్మాళి మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.   దున్నపోతు మెడలో సీఎం జగన్‌ ఫొటోను వేలాడదీసి ఊరేగించారు. జగన్‌ మామా.. జాబ్‌ ఏదీ అంటూ వ్యంగ్యంగా నినాదాలు చేశారు. దారిలో కారు తుడుస్తూ, చెప్పులు కుడుతూ, ఇస్త్రీ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసునాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జనవరిలో జాబ్‌క్యాలెండర్‌ ఉంటుందని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నీరుగార్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిరసన ర్యాలీ నేపథ్యంలో టెక్కలి ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు సిబ్బందితో సహా అక్కడకు చేరుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ ఎలా చేస్తారని.. స్టేషన్‌కు రావాలని తెలుగు యువత నాయకులకు ఎస్‌ఐ సూచించారు. తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నామని, పోలీసుస్టేషన్‌కు ఎందుకు రావాలని యువత ప్రశ్నించారు. దీంతో పోలీసులు, తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదం నెలకొంది. కొద్దిసేపటి అనంతరం టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, కోళ్ల కామేసు, భానుప్రకాష్‌, తూలుగు మహేష్‌, అప్పిని వెంకటేష్‌, కోళ్ల లవకుమార్‌, రెయ్యి ప్రీతీష్‌, దల్లి ప్రసాద్‌రెడ్డి, మదన్‌గౌడ్‌, జీరు వెంకటరెడ్డి ఉన్నారు.

- ఇచ్ఛాపురంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జయదేవ్‌ ఆధ్వర్యంలో యువకులు, నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్‌ జంక్షన్‌ ఎర్రన్న కూడలిలో నిరసన తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీ ద్రోహి జగన్‌రెడ్డి.. ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్‌ కూడలిలో మానవహారం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ యువకులు పల్లీలు, పకోడి, పండ్లు అమ్ముతూ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు  కాళ్ల ధర్మారావు, నందికి జాని తదితరులు పాల్గొన్నారు.

- పలాసలో తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ర్యాలీలో భాగంగా జీడి కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వజ్జ బాబూరావు మాట్లాడుతూ.. అర్ధంలేని జాబ్‌ క్యాలెండర్‌తో నిరుద్యోగ యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. జాబు రావాలంటే చంద్రబాబు రావాలని, జాబ్‌ నిరుద్యోగులను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటు వేస్తే.. మరోసారి ప్రజలు రోడ్డుపై పడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్‌, మాజీ వైస్‌చైర్మన్‌ గురిటి సూర్యనారాయణ, జిల్లా వాణిజ్యవిభాగం అధ్యక్షుడు టంకాల రవిశంకర్‌గుప్తా, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.
 
- నరసన్నపేటలో తెలుగు యువత, తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి పాతబస్టాండ్‌, కాలేజీరోడ్డు మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉపాధి కావాలంటే.. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా ఉపాధ్యాక్షులు బెవర శివప్రసాద్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు సూరపునాని. మెండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- పాతపట్నంలో టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ హయాంలో యువతకు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. కోర్టు కూడలి వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పైల లక్ష్మయ్య, తెలుగు యువత పాల్గొన్నారు.  

 
 

Updated Date - 2022-07-28T04:19:29+05:30 IST