‘క్యాలెండరు’ కనికట్టు!

ABN , First Publish Date - 2021-06-19T08:32:33+05:30 IST

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇది ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం’ అంటూ గొప్పగా ప్రకటించుకొంది. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉంది

‘క్యాలెండరు’ కనికట్టు!

జాక్‌పాట్‌ కొట్టాలనుకొన్న నిరుద్యోగులు.. జాబ్‌ క్యాలెండర్‌ తీరుతో ఆశలన్నీ ఫట్‌

గుర్తించిన పోస్టులే 24 వేలు.. క్యాలెండర్‌లో చూపినవి 10 వేలపైచిలుకు

గ్రూప్‌ 1,2లో ఉన్న ఖాళీలు 36యేనట.. 25 వేల టీచరు పోస్టుల్లో ఏ ఒక్కటీ లేదు


సర్కారువారి ‘జాబ్‌ క్యాలెండర్‌’తో నిజంగానే రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగులు జాక్‌పాట్‌ కొడతారా? లేక ఈ జాబ్‌ ప్రకటనా ఫట్టేనా? ప్రభుత్వ విభాగాల్లో గుర్తించిన పోస్టులు అసలెన్ని? అందులో ‘కొత్త’వి ఎన్ని? ఈ క్యాలెండర్‌లో పదివేలకుపైగా పోస్టులను ప్రకటించారు. ఒక్క డిగ్రీ, వర్సిటీల్లోనే దాదాపు రెండువేల బోధనా పోస్టులు గుర్తించారు. అయితే, ఆ పోస్టుల కోసం ఇప్పటికే ఇచ్చిన పలు నోటిఫికేషన్లు కోర్టు చిక్కుల్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 1,238 బ్యాక్‌లాగ్‌ పోస్టులనూ ‘క్యాలెండరు’లో కలిపేశారు. విద్యుత్తు రంగంలో గతప్రభుత్వం 2019లో భర్తీ చేసిన 639 ఇంజనీరింగ్‌ పోస్టులను సైతం ‘ఖాతా’లో పడేసుకొన్నారు. 25 వేల టీచర్‌ పోస్టుల కోసం వేసే నోటిఫికేషన్‌ కోసం డీఎస్సీలు ఎదురుచూస్తున్నారు. కానీ వీరికి ఒక్క పోస్టూ చూపించలేదు. ఇక మిగతాశాఖల్లో అంతా అరకొరే. ఏతావాతా ఈ  కరోనా సమయంలో ఆరోగ్య విభాగంలో గుర్తించిన ఐదు వేలకుపైగా ఖాళీ పోస్టులొక్కటే కొంతలో కొంత ఊరట! 


రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో 24 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గత సీఎస్‌ నీలం సాహ్ని హయాంలోనే గుర్తించారు. దాదాపు 50 వేలకుపైగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు దీనికి అదనం. వాస్తవ పరిస్థితి ఇదికాగా, కేవలం 10,143 పోస్టులనే 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను జాబ్‌ క్యాలెండర్‌లో గుర్తించారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇది ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం’ అంటూ గొప్పగా ప్రకటించుకొంది. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉంది. మొత్తం తొమ్మిది కేటగిరీలుగా పోస్టులను ప్రభుత్వం విభజించింది. అందులో ఎస్సీ, ఎస్టీ,  లకు సంబంధించిన బ్యాక్‌లాగ్‌ పోస్టులు 1,238 ఉన్నాయి. ఇవేమీ కొత్తగా ఇస్తున్న పోస్టులు కావు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్‌-1, 2 సర్వీసె్‌సలో 907 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు అందులో 36 పోస్టులనే భర్తీ చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో జనరల్‌ డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారే సింహభాగం ఉంటారు. వీరు ఏపీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్‌-1,2,3 సర్వీసెస్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలమంది డిగ్రీ, పీజీ అర్హత కలిగిన నిరుద్యోగులు ఉంటారు. మరి వీరి కొలువుల కోసం ప్రభుత్వం ఏమి ఆలోచన చేసింది ? అన్న ప్రశ్నకు సమాధానం కరువైంది. వీరి భవిష్యత్తు గురించి పట్టించుకోలేదని జాబ్‌ క్యాలెండర్‌ను బట్టి స్పష్టమవుతోంది. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో 7,740 ఖాళీలు ఉండగా..ఇప్పుడు కేవలం 450 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తామని క్యాలెండర్‌లో ప్రకటించారు. క్యాలెండర్‌లోని పోస్టులను చూస్తే .. ఆరోగ్య విభాగంలోని ఖాళీలే సింహభాగం ఉన్నట్లు తెలుస్తోంది. పారామెడికల్‌ పోస్టులు, నర్సుల పోస్టులు ఒకింత ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.  ఇవన్నీ సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారికే ప్రత్యేకించిన ఉద్యోగాలు. సాధారణ డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన వారికి ఈ కొలువులకు అసలు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉండదన్న మాట. డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఆ తర్వాత నెట్‌/సెట్‌ అర్హతలను కలిగిఉన్నవారికి 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు మాత్రమే ప్రకటిచారు. ఇక్కడ కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉన్న ఖాళీలకు, క్యాలెండర్‌లో పేర్కొన్న ఖాళీలకు మధ్య పొంతన లేదు. 


పోస్టుల్లో కిరికిరి

రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో 2వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇస్తామని జాబ్‌ క్యాలెండర్‌లో ప్రభుత్వం తెలిపింది. కానీ ఈ ఖాళీల సంఖ్యపై స్పష్టత లేదు. వర్సిటీల్లో పోస్టులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రేషనలైజ్‌ చేయలేదు. గత నోటిఫికేషన్ల తాలూకు కోర్టు కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.  అయినా జాబ్‌ క్యాలెండర్‌లో మాత్రం రెండువేలఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొనడం గమనార్హం. హైకోర్టులో ఉన్న కేసులు కొలిక్కి రాకుండానే  కొత్త నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం మంజూరుచేసిన బోధన పోస్టులు 3,259. అందులో దాదాపు 63 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వం 2015 ఆగస్టు 10న ప్రొఫెసర్‌ సీవీ రాఘవులు నేతృత్వంలో నియమించిన రేషనలైజేషన్‌ కమిటీ అదే సంవత్సరం అక్టోబరు 30న నివేదిన ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా.. ఖాళీగా ఉన్న 1,711 అధ్యాపక పోస్టులకు గాను .. మొత్తం 1,385 బోధన పోస్టుల (1,104 పోస్టులు మొదటి విడత, 281 పోస్టులు రెండో విడత)భర్తీకి అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ వర్సిటీలవారీగా 2017 జూన్‌ 30న జీ.వో 28-41 వరకు మంజూరు చేసింది. ఈ మేరకు వర్సిటీలు 2017 డిసెంబరు, 2018 జనవరిలో నోటిఫికేషన్లు జారీచేశాయి. భర్తీకి గుర్తించిన 1385 పోస్టుల్లో 1,110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు , 186 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 99 ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. 


ఈ ఉద్యోగాల కోసం 24,074 మంది అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్నారు. వర్సిటీల పాలకమండళ్లు తీర్మానం చేసి దరఖాస్తుచేసిన అభ్యర్థులకు ఏపీపీఎస్సీ ద్వారా అర్హత పరీక్షను నిర్వహించాలని కోరాయి. దాదాపు 65పై చిలుకు సబ్జెక్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ 2018 ఏప్రిల్‌ 9 నుంచి 14 వరకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ను నిర్వహించి ఆగస్టులో పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 24,074 మంది అభ్యర్థులకు గాను 3,436 మంది అర్హత సాధించారు. క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించడానికి సన్నద్ధమయ్యాయి. 2019 జనవరిలో అంబేడ్కర్‌ వర్సిటీ, రాయలసీమ వర్సిటీ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి సంబంధిత అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపించినప్పటికీ అర్ధంతరంగా వాటిని రద్దు చేశారు. మరోవైపు, వర్సిటీలు దాదాపు 25 మంది ప్రొఫెసర్లను 2019 జనవరిలో నియమించుకున్నాయి.కొన్ని వర్సిటీలు అసోసియేట్‌, బ్యాక్‌లాగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి వాటి ఫలితాలను పెండింగ్‌లో పెట్టాయి. ఇంతలో వర్సిటీల్లో కాంట్రాక్టు మరియు గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఏపీపీఎస్సీ స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో క్వాలిఫై కాని వారు, రోస్టరు, అర్హతా పరీక్ష, ఎస్టీ రిజర్వేషన్‌ తదితర అంశాలు సరిగ్గా లేవన్న కారణాలతో మరి కొందరు దాదాపు 30 కేసులు హైకోర్టులో వేశారు. ఈ కేసుల్లో దేనికీ స్టే రాలేదు. స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు పలుమార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి ఇంటర్వ్యూలు నిర్వహించమని కోరినా ఫలితం లేకుండా పోయింది. 2021 మార్చి 5న హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పునిస్తూ... గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నింటినీ రద్దు చేశారు. దీనిపై క్వాలిఫైడ్‌ అభ్యర్థులు డివిజన్‌ బెంచ్‌కి అప్పీల్‌ చేయగా .. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుమీద స్టే విధించి, ప్రొఫెసర్లను సర్వీసులో కొనసాగించాలని, ఎటువంటి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వరాదని ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఉద్యోగాల భర్తీ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. 


ఇంజనీరింగ్‌కు మొండిచెయ్యి..

బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ తదితర ఇంజనీరింగ్‌ కోర్సులు చేసి చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. కానీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో ఒక్కఖాళీని కూడా క్యాలెండర్‌లో చూపలేదు. ఇక ప్రభుత్వ రంగ పాఠశాలల్లో .. గురుకులాలతోకలిపితే 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ క్యాలెండర్‌లో డీఎస్సీ ప్రస్తావనే లేదు. మంజూరైన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులు 86 వేల వరకు ఉండగా .. ఇందులోనే దాదాపు 16 వేల పోస్టులు ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం 2018లో ఏపీజెన్కో, ఏపీ ట్రాన్‌స్కో విభాగాల్లోని 639 ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌  ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌ తాలూకు పోస్టులను 2019లో భర్తీ చేశారు. వీటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం తమఖాతాలో వేసుకుంటోంది. అలాగే గత ప్రభుత్వం ఇంజనీరింగ్‌ సర్వీసె్‌సలో 190 పోస్టులను మంజూరు చేయగా.. జగన్‌ ప్రభుత్వం వాటి భర్తీ విస్మరించింది. 2020 జనవరి ఫస్ట్‌  కల్లా కొత్త రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించి ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ విడుదల చేస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతే కాదు ఇకపై ప్రతి సంవత్సరం ఇదే విధానం ఉంటుందని కూడా గతంలో  చెప్పారు. కానీ రెండేళ్ల తర్వాత గానీ ఈ విషయం గుర్తుకు రాలేదు.

Updated Date - 2021-06-19T08:32:33+05:30 IST