అనంతపురం అర్బన, జనవరి 27: భారత రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రూ.1.75 కోట్ల ప్రాజెక్టును జేఎనటీయూకి గురువారం అప్పజెప్పింది. ప్రకృతి సహజ రబ్బరును రహదారుల నిర్మాణంలో ఉపయోగించే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అప్పగించింది. ఈ ప్రాజెక్టుపై పరిశోధనలు చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయించారు. వీసీ రంగ జనార్దన ఆధ్వర్యంలో పరిశోధనలు నిర్వహించనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్, రిజిస్ర్టార్ శశిధర్ ముఖ్య పరిశోధకుడిగా, పీఆర్ భానుమూర్తి ముఖ్య సలహాదారుడిగా వ్యవహరించనున్నారు. విశ్వవిద్యాలయం అంటేనే పరిశోధనలకు నిలయం. జేనటీయూలో అలాంటి ప్రక్రియలకు దాదాపుగా స్వస్తిపలికారు. తమకెందుకు లేనిపోని తలనొప్పి అంటూ అధ్యాపకులు ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకోవడంలేదు. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలుగా వర్సిటీ పరిధిలో ప్రాజెక్టులు చేప్టడం లేదు. వెరసి జేఎనటీయూలో పరిశోధనలు కనుమరుగయ్యాయి. తాజాగా భారత రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రూ.1.75 కోట్ల ప్రాజెక్టుతో పరిశోధనలు మళ్లీ పురుడు పోసుకోనున్నాయి. వర్శిటీ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు పెద్దదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.