సద్రూప చైతన్యమే జ్ఞాన స్వరూపం

ABN , First Publish Date - 2020-09-01T09:35:16+05:30 IST

‘‘ఆత్మ(నేను)ను తెలియజేసే వేరొక చిత్‌ (జ్ఞానం) ఎక్కడ ఉంది? లేదు. కనుక ఉన్న ‘సత్‌’యే ‘చిత్‌’. అనగా.. ఉన్నదే జ్ఞానం. కనుక జ్ఞానంగా ఉన్న ఆ సద్వస్తువే నేను’’ అని దీని అర్థం. భగవాన్‌ రమణ మహర్షి

సద్రూప చైతన్యమే జ్ఞాన స్వరూపం

  • సత్వభాసికా చిత్క్వవేతరా
  • సత్తయహిచ్చిత్‌ చిత్త యాహ్యహం

‘‘ఆత్మ(నేను)ను తెలియజేసే వేరొక చిత్‌ (జ్ఞానం) ఎక్కడ ఉంది? లేదు. కనుక ఉన్న ‘సత్‌’యే ‘చిత్‌’. అనగా.. ఉన్నదే జ్ఞానం. కనుక జ్ఞానంగా ఉన్న ఆ సద్వస్తువే నేను’’ అని దీని అర్థం. భగవాన్‌ రమణ మహర్షి లోకానికి అందించిన 31 శ్లోకాల ‘ఉపదేశ సారం’లోని 23వ శ్లోకమిది. మనకు కలిగే అన్ని ఆలోచనలనూ మనసు తెలుసుకోగలుగుతున్నది. అంటే, అన్ని ఇదం భావనలనూ అహం భావన తెలుసుకుంటోంది. ఆ ‘అహం’ భావనను ‘నేను’ తెలుసుకుంటున్నాను. మరి ఈ ‘నేను’ను.. అనగా సద్రూప చైతన్యాన్ని తెలుసుకునేది ఎవరు? నిజంగా ‘సత్‌’ అయిన ఆత్మను తెలుసుకోవడానికి దానికన్నా వేరుగా మరొక జ్ఞానం (చిత్‌) ఉన్నట్లయితే ఈ జ్ఞానం  చేత ఆ సత్‌ రూప ఆత్మ పరిమితమైపోయినట్టే. పరిమితమైనది ఏదైనా నశిస్తుంది.


నశించే దాన్ని సత్‌ అని ఎలా అంటాం? ‘సత్‌’ అంటే ఎన్నటికీ నశించనిది. అన్ని కాలాల్లోనూ ఉండేది. ‘కాలత్రయే అపితిష్టతి ఇతి సత్‌’ అన్నారు. కనుక ‘సత్‌’ కన్నా వేరుగా ‘చిత్‌’ ఉండే అవకాశం లేదు. సత్తే చిత్తు అయి ఉండాలి. అదే సత్యం కనుకనే ‘సత్తయాహిచిత్‌’ అని రమణులు చెప్పారు. సద్రూపచైతన్యమే జ్ఞానస్వరూపం. ఆత్మలో సత్‌-చిత్‌-ఆనందం అని మూడు భాగాలు లేవు. అలా ఉంటే ఆత్మలో స్వగత భేదం ఉన్నట్లే. చెట్టులో కొమ్మలు, ఆకులు, పూలు, కాయలు ఉన్నట్టుగా ఆత్మలో సత్‌ చిత్‌ ఆనందం అనే మూడు అవయవాలు లేవు. ఆత్మ ఒక్కటే. సత్తే చిత్‌, చిత్తే ఆనందం. అంటే ఎల్లప్పుడూ ఉండే జ్ఞానస్వరూపమే, ఆనంద స్వరూపమే ఆత్మ అని భావం. అది తనను తాను ప్రకాశింపజేసుకోవట్లేదు. దాని స్వరూపమే ప్రకాశం. సూర్యుని ప్రకాశింపజేయడానికి వేరొక వెలుగు లేనట్లే.. ఆత్మను ప్రకాశింపజేయడానికి వేరొక ప్రకాశం లేదు. స్వసంవేద్యమై, స్వయం ప్రకాశమై ఉండే సత్తును తెలిపేందుకు వేరొక చిత్తు లేనే లేదు. చిత్తే నేను.. ‘చిత్తయాహ్యహం’.


నిజంగా ఒకదాన్ని మరొకటి తెలుసుకోవాలంటే ప్రయత్నం కావాలి. జ్ఞానం కావాలి. కానీ, తనను తాను తెలుసుకోవడానికి వేరే జ్ఞానం అక్కర్లేదు. ఉదాహరణకు.. ఇప్పుడు కరెంటు పోయింది. అందరూ అక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవడానికి దీపం కావాలి. కానీ, మనం ఉన్నామో లేదో తెలుసుకోవడానికి దీపం అక్కర్లేదు కదా! అలాగే.. నన్ను నేను తెలుసుకోవడానికి ఏ వెలుగూ, ఏ జ్ఞానమూ, ఏ ప్రయత్నమూ అక్కర్లేదు. అలాగని, ఆత్మను తెలుసుకోవడం అంత తేలిక కాదు. తనకు తానే ప్రమాణం గనుక ఆత్మను అనుభవం ద్వారానే గ్రహించాలి. 


దేవిశెట్టి చలపతిరావు, care@srichalapathirao.com

Updated Date - 2020-09-01T09:35:16+05:30 IST