భారత్, పాక్ పరస్పర అంగీకారాన్ని స్వాగతిస్తున్నాం : పీడీపీ

ABN , First Publish Date - 2021-02-26T01:37:03+05:30 IST

కాల్పుల విషయంలో భారత్, పాక్ మధ్య కుదిరిన పరస్పర అంగీకారాన్ని పీపుల్స్ డెమోక్రెటిక్ పార్టీ (పీడీపీ) స్వాగతించింది

భారత్, పాక్ పరస్పర అంగీకారాన్ని స్వాగతిస్తున్నాం : పీడీపీ

శ్రీనగర్ : కాల్పుల విషయంలో భారత్, పాక్ మధ్య కుదిరిన పరస్పర అంగీకారాన్ని పీపుల్స్ డెమోక్రెటిక్ పార్టీ (పీడీపీ) స్వాగతించింది. ‘‘భారత్, పాక్ మధ్య కుదిరిన పరస్పర అంగీకారాన్ని మేము స్వాగతిస్తున్నాం. దీనిని ఆచరణలో చూపిస్తారని విశ్వసిస్తున్నాం. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణకు తామెప్పుడూ మద్దతుదారులమే.’’ అని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలా ఓ పరస్పర అంగీకారానికి రావడం ద్వారా ఎల్‌ఓసీ వెంట నివసించే ప్రజలకు, సరిహద్దు వద్ద నివసించే ప్రజలు తిరిగి సాధారణ జీవితాలను గడిపే అవకాశం ఉంటుందని పేర్కొంది. సరిహద్దుల్లో జరుగుతున్న హింస ఆగాలంటే చర్చలే ఏకైక పరిష్కారమని పీడీపీ నొక్కివక్కానించింది. 


భారత్, పాక్‌కు చెందిన ఇరు దేశాల బలగాలు గురువారం ఓ సంచలన నిర్ణయానికి వచ్చాయి. నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని పరస్పర అంగీకారానికి వచ్చాయి. ఈ మధ్య నియంత్రణ రేఖ వెంబడి తరుచూ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ‘‘ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడానికి, స్థిరమైన శాంతిని సాధించాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. హింసకు దారితీసే పరిస్థితుల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో డీజీఎస్‌ఎంవో స్థాయిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.’’ అని ఇరు దేశాల అధికారులు తెలిపారు. ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర అంగీకారం కుదిరినా సరే, నియంత్రణ రేఖ వెంబడి మాత్రం భారత్ బలగాలను మోహరించే ఉంచింది. అక్రమ చొరబాట్లను నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.  నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరపకూడదని ఇరు దేశాలు 2003 లో ఒప్పందాలు చేసుకున్నాయి. అయినా... తరుచూ ఈ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తూనే ఉంది. 

Updated Date - 2021-02-26T01:37:03+05:30 IST