ఇకపై జియో నుంచి రీచార్జ్ రిమైండర్లు రావు.. యూపీఐ ఆటో ప్లే అందుబాటులోకి!

ABN , First Publish Date - 2022-01-08T01:25:02+05:30 IST

మనం వాడుతున్న మొబైల్ ప్లాన్ కాలపరిమితి ముగిసిపోవడానికి కొన్ని రోజుల ముందునుంచే వ్యాలిడిటీ ..

ఇకపై జియో నుంచి రీచార్జ్ రిమైండర్లు రావు.. యూపీఐ ఆటో ప్లే అందుబాటులోకి!

న్యూఢిల్లీ: మనం వాడుతున్న మొబైల్ ప్లాన్ కాలపరిమితి ముగిసిపోవడానికి కొన్ని రోజుల ముందునుంచే వ్యాలిడిటీ ముగిసిపోతోందని, రీచార్జ్ చేసుకోవాలంటూ మెసేజ్‌లు వెల్లువెత్తుతుంటాయి. వాటి బాధ భరించలేక రీచార్జ్ చేసుకోవడమే మేలనుకునే వారు ఎందరో. కొందరేమో కాలపరిమితి ముగిసినా వేర్వేరు కారణాల వల్ల రీచార్జ్ చేసుకోలేకపోతారు. అయితే, రిలయన్స్ జియో యూజర్లకు ఇప్పుడీ బాధ తప్పినట్టే. ఇందుకోసం యూపీఐ ఆటో డెబిట్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.


నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో జియో ఒప్పందం కుదుర్చుకుని ఈ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇలాంటి ఆప్షన్‌ను ప్రవేశపెట్టిన తొలి టెలికం కంపెనీగా జియో రికార్డులకెక్కింది. ఈ ఆప్షన్ రిలయన్స్ ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ వినియోగదారులు ఇద్దరికీ అందుబాటులో ఉంటుంది.


అసలేంటీ యూపీఐ ఆటో ప్లే? 

మై జియో యాప్ ద్వారా యూపీఐ ఆటో ప్లే సేవలను ఉపయోగించుకోవచ్చు. తమ టారిఫ్ ప్లాన్ రీచార్జ్ కోసం స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌తో ఆటో డెబిట్ ఫీచర్‌ను సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్లాన్ గడువు ముగియగానే మన ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయిపోతాయి. ఫలితంగా మన ప్లాన్ యాక్టివ్‌లోనే ఉంటుంది. నెలనెలా ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకునే బాధ కూడా తప్పుతుంది. అంతేకాదు, ఏ ప్లాన్ రీచార్జ్ చేసుకోవాలనే దానిని ముందే నిర్ణయించుకుని ఆ మేరకు సెట్ చేసుకోవచ్చు.గరిష్టంగా రూ.5,000 వరకు రీఛార్జ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు, యూపీఐ ఆటో ప్లే కోసం యూపీఐ పిన్‌ను ప్రతిసారి నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 


Updated Date - 2022-01-08T01:25:02+05:30 IST