JioBook: జియో మరో సంచలనం.. అతితక్కువ రేటుకే ల్యాప్‌టాప్.. ఈ నెలలోనే విడుదల..

ABN , First Publish Date - 2022-10-03T22:29:08+05:30 IST

టెలికాం సర్వీసులు, బడ్జెట్ 4జీ ఫోన్లతో దేశంలో సంచనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో (Reliance Jio) మరో సంచలనానికి తయారైంది.

JioBook: జియో మరో సంచలనం.. అతితక్కువ రేటుకే ల్యాప్‌టాప్.. ఈ నెలలోనే విడుదల..

ముంబై : టెలికం సర్వీసులు, బడ్జెట్ 4జీ ఫోన్లతో దేశంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో (Reliance Jio) మరో సంచలనానికి సిద్ధమైంది. తొలిసారి అత్యంత తక్కువ  ధరకే ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించేందుకు రెడీ అయ్యింది. ‘ జియోబుక్ ’ (JioBook) పేరిట ఈ నెల అక్టోబర్‌లోనే ల్యాప్‌టాప్‌లను విడుదల చేయబోతోంది. ఇందుకు సంబంధించి క్వాల్‌కామ్ (QCOM.O), మైక్రోసాఫ్ట్ (Microsoft)లతో జియో  భాగస్వామ్యం కుదుర్చుకుందని రాయిటర్స్ (Reuters) రిపోర్ట్ పేర్కొంది. తొలుత 4జీ సౌలభ్యమున్న జియోబుక్ ల్యాప్‌టప్‌లను అందుబాటులోకి తీసుకురానుందని, దీని ధర 184 డాలర్లుగా ఉండనుందని పేర్కొంది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.15 వేలుగా ఉండొచ్చని రిపోర్టు ప్రస్తావించింది.


కాగా జియో తొలుత 4జీ సౌలభ్యమున్న ల్యాప్‌టాప్‌లనే మార్కెట్లోకి తీసుకురానుందని, వచ్చేఏడాది 5జీ ఫోన్ ఆవిష్కరణ తర్వాత 5జీ వెర్షన్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుందని రిపోర్ట్ వెల్లడించింది. జియోబుక్ ల్యాప్‌టాప్‌లు తొలుత స్కూళ్లు, ప్రభుత్వ సంస్థలు వంటి సంస్థల కస్టమర్లకు అక్టోబర్ 2022లోనే అందుబాటులోకి వస్తాయి. మరో 3 నెలల్లోనే మిగతా కస్టమర్లు అందరికీ ల్యాప్‌టాప్‌లు లభ్యమవుతాయి.


ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు ఇవే..

జియోబుక్ ల్యాప్‌టాప్ ఆర్మ్ లిమిటెడ్ (Arm limited) టెక్నాలజీ ప్రాసెసర్ చిప్‌తో రానుంది. జియో ఓఎస్ (JioOS), విండోస్ ఓఎస్ (Windows OS)‌ల డ్యుయెల్ బూట్ సపోర్ట్‌పై పనిచేయనుంది. అదనపు యాప్స్ కోసం జియోస్టోర్ (JioStore), విండోస్ ఓస్ (Windows OS)ల నుంచి యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జియోబుక్ ల్యాప్‌టాప్‌ని భారత్‌లో ఫ్లెక్స్ (Flex) కంపెనీ ఉత్పత్తి చేయనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి పెద్ద సంఖ్యలో ఈ ల్యాప్‌టాప్‌లను విక్రయించాలని జియో యోచిస్తున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌ను అందించడంలో  జియోకి నిధుల కొరత కూడా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ ఇన్వెస్టర్లయిన కేకేఆర్ అండ్ కో, సిల్వర్ వంటి కంపెనీల నుంచి 2020లో ఏకంగా 22 బిలియన్ డాలర్ల మేర నిధులు సేకరించిన విషయం తెలిసిందే. 


కాగా ప్రస్తుతం మార్కెట్లో రూ.20 వేల లోపు లభ్యమయ్యే ల్యాప్‌టాప్‌లు ఉంటున్నా వాటిలో ఫీచర్లు పెద్దగా ఉండడం లేదు. కాబట్టి తక్కువ రేటు ల్యాప్‌టాప్ మార్కెట్‌లో జియోబుక్ ఆధిపత్యం కొనసాగించినా ఆశ్చర్యం లేదు. బడ్జెట్ ధరలో 4జీ ఫోన్లు ఆవిష్కరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే సంచలనం నమోదు చేసింది. ఇండియాలో రూ.10 వేల లోపు టాప్ సెల్లింగ్ ఫోన్లలో ఈ ఫోన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు తక్కువ రేటుకు ల్యాప్‌టాప్ కొనాలనుకునే భారతీయులే లక్ష్యంగా జియోబుక్‌ని జియో విడుదల చేయనుంది. యూజర్ల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో వేచిచూడాలి. 

Updated Date - 2022-10-03T22:29:08+05:30 IST