5జీకి రెడీ!

ABN , First Publish Date - 2020-07-16T06:04:37+05:30 IST

భవిష్యత్‌ తరం టెలికాం సేవలు ‘5జీ’కి జియో సర్వసన్నద్ధమైనట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. హువే, నోకియా, ఎరిక్సన్‌ వంటి అంతర్జాతీయ...

5జీకి రెడీ!

  • మేడ్‌ ఇన్‌ ఇండియా సొల్యూషన్స్‌ 
  • అభివృద్ధి చేసిన రిలయన్స్‌ జియో
  • 43వ ఏజీఎంలో ప్రకటించిన ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ  

న్యూఢిల్లీ: భవిష్యత్‌ తరం టెలికాం సేవలు ‘5జీ’కి జియో సర్వసన్నద్ధమైనట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)  చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. హువే, నోకియా, ఎరిక్సన్‌ వంటి అంతర్జాతీయ టెలికాం నెట్‌వర్క్‌ టెక్నాలజీ దిగ్గజాలకు పోటీగా మేడ్‌ ఇన్‌ ఇండియా 5జీ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన వాటాదారుల 43వ వార్షిక సమావేశంలో తెలిపారు.

‘‘5జీ సేవలందించేందుకు అవసరమైన పూర్తి స్థాయి టెక్నాలజీ సొల్యూషన్స్‌ను జియో అభివృద్ధి చేసిందని ప్రకటించేందుకు గర్విస్తున్నా. భారత్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 5జీ సేవలను ప్రారంభించేందుకు ఇది దోహదపడుతుంది. దేశంలో 5జీ స్పెక్ట్రమ్‌ అందుబాటులోకి రాగానే ట్రయల్స్‌ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఏడాది క్షేత్రస్థాయి విస్తరణకూ రెడీ. జియో 5జీ టెక్నాలజీ సొల్యూషన్స్‌ సామర్థ్యం దేశీయంగా రుజువయ్యాక విదేశాల్లోని టెలికాం ఆపరేటర్లకూ ఎగుమతి చేస్తాం’’ అని అంబానీ అన్నారు. 


చౌక  స్మార్ట్‌ఫోన్ల తయారీకి గూగుల్‌తో జట్టు 

అందరికీ అందుబాటు ధరల్లో ఉండే స్మార్ట్‌ఫోన్ల అభివృద్ధి కోసం ఇంటర్నెట్‌ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో జట్టు కట్టినట్లు అంబానీ ప్రకటించారు. 5జీ సేవలకు సన్నద్ధమవుతున్న తరుణంలోనూ దేశంలో 35 కోట్ల మంది ఇంకా 2జీ ఫీచర్‌ ఫోన్లను వినియోగిస్తున్నారని, వీరిని స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియను శరవేగం చేయాలంటే చౌక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడం కీలకమన్నారు. ఇందుకోసం గూగుల్‌తో కలిసి ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు అంబానీ వెల్లడించారు. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా చౌక 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని జియో భావిస్తోంది. 


జియోమార్ట్‌లో ఎలక్ట్రానిక్స్‌, ఔషధాలు సైతం.. 

రిలయన్స్‌ ఇప్పటికే ఈ-కామర్స్‌ వ్యాపారంలోకీ ప్రవేశించింది. జియోమార్ట్‌ పేరుతో హైబ్రిడ్‌ (ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌) విధానంలో కిరాణా సరుకులు విక్రయిస్తోంది. ప్రస్తుతం కిరాణా సరుకులకే పరిమితమైన జియోమార్ట్‌ ద్వారా మున్ముందు ఎలకా్ట్రనిక్స్‌, ఔషధాలు, ఫ్యాషన్‌ ఉత్పత్తులను  విక్రయించనున్నట్లు వెల్లడించారు.  


‘రిటైల్‌’లోనూ వాటాల విక్రయాలు 

రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహాత్మక, ఆర్థిక ఇన్వెస్టర్లు అమితాసక్తి చూపుతున్నారని ముకేశ్‌ అంబానీ తెలిపారు. వచ్చే మరికొద్ది త్రైమాసికాల్లో ఈ విభాగంలోనూ వాటాలు విక్రయించనున్నామని అన్నారు. తద్వారా అంతర్జాతీయ కంపెనీలు, ఇన్వెస్టర్లను ఈ వ్యాపారంలో భాగస్వాములను చేసుకోనున్నట్లు చెప్పారు.  ప్రస్తుతం రిలయన్స్‌ రిటైల్‌ దేశవ్యాప్తంగా దాదాపు 12,000 స్టోర్లను నిర్వహిస్తోంది. అందులో మూడింట రెండోవంతు స్టోర్లు ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయి.


అరామ్కోతో ఒప్పందంలో జాప్యం

రిలయన్స్‌ ఇంధనం, పెట్రోకెమికల్‌ (ఓ2సీ) వ్యాపారంలో వాటాను సౌదీ అరామ్కోకు విక్రయించేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేకపోయామని అంబానీ అన్నారు. ఇంధన రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, కరోనా సంక్షోభంతో ఈ డీల్‌ జాప్యమైందన్నారు. షెడ్యూలు ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికే డీల్‌ పూర్తి కావాల్సింది. 


2021లో ఓ2సీ వ్యాపార విభజన 

భాగస్వామ్య అవకాశాల కోసం రిలయన్స్‌ తన ఆయిల్‌ టు కెమికల్‌ (ఓ2సీ) వ్యాపారాన్ని విభజించి ప్రత్యేక సంస్థగా నిర్వహించబోతోంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో ఈ ప్రక్రియ పూర్తికానుందని అంబానీ వెల్లడించారు. 


2035 నాటికి కర్బన రహితం!

ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు శుద్ధి కాంప్లెక్స్‌ను నిర్వహిస్తోన్న రిలయన్స్‌.. వాహన ఇంధనాన్ని ఎలక్ట్రిసిటీ, హైడ్రోజన్‌తో భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 2035 నాటికి కర్బన రహిత (కార్బన్‌ జీరో) కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అంబానీ ప్రకటించారు. ‘‘కంపెనీ ముడి చమురు, సహజ వాయువు వినియోగాన్ని కొనసాగించనున్నప్పటికీ.. బొగ్గు పులుసు వాయువు (కార్బన్‌ డయాక్సైడ్‌)ను విలువైన రసాయనాలు, ఇతర మెటీరియల్‌ బిల్డింగ్‌ బ్లాక్స్‌గా మార్చే ఆధునిక సాంకేతికతను ఉపయోగించనుంద’’ని అంబానీ తెలిపారు.


‘జియో’లో గూగుల్‌ రూ.33,373 కోట్ల పెట్టుబడి

జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.7 శాతం వాటాను రూ.33,373 కోట్లకు కొనుగోలు చేసేందుకు  గూగుల్‌ అంగీకరించింది. ‘‘జియో ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా గూగుల్‌ను స్వాగతిస్తున్నా. ఇక్కడితో జియో ప్లాట్‌ఫామ్స్‌ నిధుల సేకరణ ప్రక్రియ పూర్తయింద’’ని అంబానీ తెలిపారు. ఇకపై కంపెనీ భాగస్వామ్యాలు మాత్రమే కుదుర్చుకోనుందన్నారు. ఆర్‌ఐఎల్‌కు చెందిన డిజిటల్‌  సేవల విభా గం జియో ప్లాట్‌ఫామ్స్‌లో  ఇప్పటివరకు 32.84 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1,52,055.45 కోట్లు సమీకరించింది. గడిచిన 12 వారాల్లో ఇప్పటివరకు జియోలో 13 దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. తాజాగా ఈ జాబితాలో గూగుల్‌ కూడా చేరింది.


జియోగ్లాస్‌ ఆవిష్కరణ 

రిలయన్స్‌ జియో తాజాగా వర్చువల్‌ రియాల్టీ గ్యాడ్జెట్‌ ‘జియోగ్లా్‌స’ను ఆవిష్కరించింది. కన్వీనియెంట్‌ కేబుల్‌తో కూడిన జియోగ్లా్‌సను మీ స్మార్ట్‌ఫోన్‌కు అటాచ్‌ చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ కావచ్చు. ఇన్‌ బిల్ట్‌ ఆడియో సిస్టమ్‌తో కూడిన జియో గ్లాస్‌తో మీ ఫోన్‌లో స్టోర్‌ చేసుకున్న కాంటాక్ట్‌ నంబర్స్‌కు వాయిస్‌ కమాండ్‌ ద్వారా కాల్‌ చేయవచ్చు. దీంట్లోని 25 యాప్స్‌ అగ్మెంటెడ్‌ రియాల్టీ వీడియో మీటింగ్స్‌కు సపోర్ట్‌ చేస్తాయి. తద్వారా ఇంట్లో కూర్చునే మీ ఆఫీసులో జరిగే మీటింగ్‌లో జాయిన్‌ కావచ్చు. మీ సహోద్యోగులతో చాటింగ్‌ చేస్తూనే ప్రజెంటేషన్లను సైతం షేర్‌ చేసుకోవచ్చు. 3డీ వర్చువల్‌ క్లాస్‌ రూమ్స్‌లోనూ ఉపయోగించవచ్చు. 


జియోమీట్‌ 50 లక్షల డౌన్‌లోడ్లు 

దేశంలో తొలి క్లౌడ్‌ ఆధారిత వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌  జియోమీట్‌ అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 50 లక్షల డౌన్‌లోడ్లు జరిగాయి. అమెరికన్‌ వీడియో యాప్‌ జూమ్‌కు పోటీగా జియో దీన్ని ప్రవేశపెట్టింది. 


ప్రపంచంలో అతిపెద్ద వర్చువల్‌ ఏజీఎం 

కరోనా సంక్షోభం నేపథ్యంలో రిలయన్స్‌ తొలిసారిగా వాటాదారుల వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎం) వర్చువల్‌గా నిర్వహించింది. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వర్చువల్‌ ఏజీఎం ఇదే. ఏకంగా 48 దేశాల్లోని 550 నగరాల్లో ఉన్న 3.2 లక్షల మంది వాటాదారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రిలయన్స్‌కు 26 లక్షల మంది వాటాదారులున్నారు. 

Updated Date - 2020-07-16T06:04:37+05:30 IST