వెలుగుల జిగేల్‌

ABN , First Publish Date - 2021-08-01T05:57:24+05:30 IST

మిరుమిట్లు గొలిపే కాంతులతో..

వెలుగుల జిగేల్‌
బంగారు వర్ణంలో యాదాద్రి ఆలయం

అందమైన పద్మాలు, సీతాకోక చిలుక డిజైన్లతో విద్యుద్దీపాలంకరణ

ఆధ్యాత్మిక శిల్పకళాఖండాలకు అధునాతన కాంతులు

సుమారు రూ.3.5కోట్ల వ్యయంతో కొనసాగుతున్న పనులు

గంటల దీపాలు, 125 కమలం దీపాలు ఏర్పాటు 

చూసేందుకు చూడముచ్చటగా యాదాద్రీశుడి సన్నిధి


యాదాద్రి టౌన్‌: మిరుమిట్లు గొలిపే కాంతులతో యాదాద్రి దివ్యక్షేత్రం వెలుగులీనుతోంది. కాకతీయుల కాలం నాటి నిర్మాణాలు, చోళులు, శ్రీకృష్ణదేవరాయల శిల్పకళా సౌందర్యరీతులకు విద్యుదీపాలంకరణను జోడిస్తున్నారు. దీంతో ఇల వైకుంఠపురంలా యాదాద్రీశుడి సన్నిధి దర్శనమిస్తోంది. దేశంలో మరెక్కడా లేని విద్యుత్‌ దీపాలను ఇక్కడ అమర్చుతుండటంతో చూసేందుకు చూడముచ్చటగా కనిపిస్తోంది. ప్రధాన ఆలయంలో పద్మాల దీపాలు, అష్టభుజి ప్రాకార మండపాలు, సప్తరాజగోపురాలకు ఏర్పాటు చేసిన లైటింగ్‌ కనీవినీ ఎరుగనిరీతిలో కనువిందు చేస్తోంది. బెంగళూరుకు చెందిన లైటింగ్‌ టెక్నాలజీ సంస్థ రూ.3.5 కోట్లతో వివిధ రీతుల్లో విద్యుత్‌ దీపాలను తయారుచేసి అందిస్తుండగా, విద్యుత్‌ అలంకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 


అధునాతన విద్యుద్దీపకాంతులతో యాదాద్రీశుడి సన్నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కాకతీయులు, చోళులు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శిల్పకళా సౌందర్యరీతులతో చేపట్టిన యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు కృష్ణరాతి శిలా నిర్మాణాలతో తుదిదశకు చేరాయి. అంతర్జాతీయ ఆధ్యాత్మిక, పర్యాటక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దివ్యక్షేత్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు వైటీడీఏ సంకల్పించింది. ఈక్రమంలో సుమారు రూ.3.5కోట్లతో బెంగళూరుకు చెందిన లైటింగ్‌ టెక్నాలజీ సంస్థకు విద్యుద్దీకరణ పనులను అప్పగించింది. ఇటీవల పలుమార్లు యాదాద్రి ప్రధానాలయం, అష్టభుజి ప్రాకార మండపాల విద్యుద్దీకరణ పనులు నిర్వహిస్తూ లైటింగ్‌ ట్రయల్‌ నిర్వహించింది. జూన్‌ 21వ తేదీన రాత్రివేళలో సీఎం కేసీఆర్‌ యాదాద్రిక్షేత్రాన్ని సందర్శించిన నేపథ్యంలో పలు సూచనలు చేశారు. దేశంలో మరెక్కడాలేని విధంగా అద్భుత కృష్ణరాతి శిలాఖండాలకు వెలుగులు వెదజల్లేలా విద్యుద్దీకరణ పనులు చేపట్టాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.


ఈక్రమంలో సీఎం సూచనల మేరకు యాదాద్రి ఆలయ ఆర్కిటెక్‌ ఆనందసాయి, లైటింగ్‌ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు, ఈఈ వూడెపు రామారావు ఆధ్వర్యంలో యాదాద్రిక్షేత్రంలో వినూత్నరీతిలో లైటింగ్‌ ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధంచేశారు. ప్రధానాలయం, అష్టభుజిప్రాకార మండపంలో అమర్చే విద్యుద్దీకరణ ముసాయిదా ప్లాన్లకు సాంకేతిక కమిటీ అనుమతులు తెలపడంతో ప్రతిపాదిత సంస్థ లైటింగ్‌ అమర్చే పనులు నిర్వహిస్తోంది. 


బటర్‌ఫ్లై (సీతాకోక చిలుక) విద్యుత్‌ దీపకాంతులు

ఆలయ పరిసరాల్లో బటర్‌ఫ్లై (సీతాకోక చిలుక ఆకారంలో) దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయం, పుష్కరిణి, ఈవో క్యాంపు కార్యాలయంతోపాటు ఆలయ పరిసరాల్లో 400 కాంతివంతమైన బటర్‌ఫ్లై విద్యుత్‌ దీప స్థంభాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా విద్యుద్దీపాలు యాదాద్రిక్షేత్ర సందర్శనకు విచ్చేసే యాత్రాజనుల్లో ఆధ్యాత్మిక, భక్తిభావాలను కలిగింపజేసే విధంగా శంకు, చక్ర, తిరునామాలను దీపస్థంభాలను ప్రత్యేకంగా రూపొందించారు.


ఆళ్వార్‌ విగ్రహాలకూ లైటింగ్‌ 

ప్రధానాలయ ముఖమండపంలోని 12 మంది ఆళ్వార్‌ విగ్రహాలకు గంటల ఆకారంలోని దీపాలను అమర్చనున్నా రు. సుమారు 16 గంట దీపాలు ప్రధానాలయ ముఖమంపంలో అమర్చనున్నారు. అష్టభుజి ప్రాకార మండపాల్లో కమలం ఆకృతిలోని దీపాలను ఏర్పాటుకు వైటీడీఏ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అష్టభుజి ప్రాకార మండపంలో కమలం ఆకృతిలోని దీపాలను అమర్చే పనులు కొనసాగుతున్నాయి. ప్రాకార మండపం, ప్రధానాలయంలో సుమారు 125కమలం ఆకృతిలోని దీపాలు అమర్చనున్నారు.


దేశంలో మరెక్కడా లేని విధంగా..

దేశంలో మరెక్కడా లేని విధంగా యాదాద్రిలోనే మొట్టమొదటిసారిగా ప్రధానాలయంలోని ఆళ్వార్‌ పిల్లర్లపై గంటా దీపాలు, మండపాలలో కమలం ఆకారంలోని దీపాలు అమర్చే పనులు కొనసాగుతున్నాయి. ప్రధానాలయ ముఖమండపంలోని గర్భాలయ ద్వారంపై అమర్చిన ప్రహ్లాద చరిత క్షేత్ర సందర్శనకు విచ్చేసే భక్తులకు రాత్రి వేళల్లోనూ కనిపించే విధంగా అధునాతన పరిజ్ఞానంతో ప్రత్యేక రీతిలో లైటింగ్‌ అమర్చనున్నారు. ప్రధానాలయ ముఖ మండపంలోని స్లాబ్‌కు అమర్చిన పద్మాలకు విద్యుద్దీపాలు, శాండిలియర్‌ను అమర్చారు. అష్టభుజి ప్రాకార మండపాలు, సప్తరాజగోపురాలను సైతం విద్యుద్దీపకాంతులతో వెలుగులు విరజిమ్మేలా అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రధానాలయ ప్రహరీ, శివాలయ ప్రహరీ, విష్ణు పుష్కరిణి, ఈవో క్యాంపు కార్యాలయం, వీవీఐపీ కాటేజ్‌తోపాటు ఆలయ తిరువీధుల్లో లైటింగ్‌ ఏర్పాట్లు పనులు కొనసాగుతున్నాయి.


శివాలయ ప్రహరీపై  

శివాలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో విద్యుద్దీకరణ పనులను వైటీడీఏ అధికారులు వేగిరంచేశారు. శివాలయం చుట్టూ ప్రహరీని సైతం లోహపు దిమ్మెలతో నిర్మిస్తున్నారు. ఈలోహపు దిమ్మెలపై ఆధ్యాత్మికతను తెలియజేసే విధంగా లైటింగ్‌ ఏర్పాట్లు చేయనున్నారు. శైవాగమ సంప్రదాయాన్ని తెలిపే విధంగా పరమశివుడి త్రిశూలం, విభూది ధారణలో పరమశివుడి మూడో కన్ను, పద్మాలను ఈ ల్యాంపులలో పొందుపరిచారు. శివాలయ ప్రహరీలో సుమారు 25కు పైగా ఈ తరహా దీపాలను అమర్చనున్నారు. 

Updated Date - 2021-08-01T05:57:24+05:30 IST