Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

జీ హుజూర్ ఐఏఎస్‌లు

twitter-iconwatsapp-iconfb-icon
జీ హుజూర్ ఐఏఎస్‌లు

గల్ఫ్ దేశాలలో ప్రవాసాంధ్ర మహిళలు, ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా వారు రేయింబవళ్ళు కష్టపడి ఆర్జిస్తున్న డబ్బుతో సమానంగా కోనసీమ గ్రామాలలో కూలీలుగా పని చేస్తున్నవారూ సంపాదిస్తున్నారు. మరి ఇక్కడి మహిళలు జీవనోపాధి కోసం ఎడారి దేశాలకు ఎందుకు వెళుతున్నారని ఆ జిల్లా కలెక్టర్‌గా ఉన్న యువ ఐఏఎస్ అధికారి ఒకరు మథనపడ్డారు. ఈ ఆలోచనతోనే గ్రామీణ ప్రాంత ఉపాధి పనులపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ అమలులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఆర్. సుబ్రమణ్యమే ఆ ఆదర్శ ఐఏఎస్ అధికారి. అదే విధంగా రాష్ట్రంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ రంగాలలో అనుపమాన కృషి చేసిన కె.సుజాత రావు ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శిగా దేశ ప్రజలకు అవిస్మరణీయమైన సేవల నందించారు. ప్రస్తుతం విశ్రాంత జీవితంలో ఉన్న ఆమె సూచనలకు ఆరోగ్యభద్రతా రంగ ప్రముఖులు ఇప్పటికీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తారు.


జిల్లా కలెక్టర్లుగా సుబ్రమణ్యం, సుజాతరావు ఇరువురూ తెలుగునాట విశేష ప్రజాభిమానానికి పాత్రులయ్యారు. ఎస్ఆర్ శంకరన్ తమకు ఆదర్శమూర్తి అని వారిరువురూ అంటారు. ఐఏఎస్ అధికారిగా క్షేత్రస్థాయిలో గానీ లేదా విధాన రూపకల్పనలో గానీ ప్రజాసంక్షేమ సాధనలో ఏ రకమైన పాత్ర పోషించవచ్చో ఆదర్శప్రాయంగా నిరూపించిన మహానుభావుడు శంకరన్. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల హృదయాలలో ఏ విధంగా చిరస్మరణీయుడుగా ఉంటాడో సివిల్ సర్వీస్‌కు ఎంపికయిన యువతీ యువకులకు శిక్షణ కాలంలో శంకరన్‌ను ఒక ఉదాహరణగా చెబుతారు.


కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా 1971లో గ్రామీణాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం నుంచి విదేశీ చెల్లింపుల సంక్షోభ పరిష్కార మార్గాల వరకు వైవి రెడ్డి జాతీయస్థాయిలో తనకంటూ సమర్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా కూడా దేశానికి ఆయన సమున్నత సేవల నందించారు. మరో ఐఏయస్ అధికారి దువ్వూరి సుబ్బారావు. విశాఖపట్టణం, ఖమ్మం జిల్లాల కలెక్టర్ మొదలు రిజర్వుబ్యాంకు గవర్నర్ పదవి వరకు ఆయనది ఒక సుదీర్ఘ, సార్థక ప్రస్థానం. పోడు భూముల సమస్య పరిష్కారం ద్వారా గిరిజన సంక్షేమం కోసం కృషి చేయడం మొదలు అంతర్జాతీయ ద్రవ్యనిధి రుణాలు అవసరం లేదంటూ ఖరాఖండిగా చెప్పడం దాకా ఆయన తన కార్యదక్షతను చాటారు. ప్రజాదరణ కల్గిన ఎన్టీఆర్‌తో 1987లో నేరుగా ఢీ కొనడానికి సాహసించిన ఐఏయస్ అధికారి ఎవియస్ రెడ్డి, ఆ తర్వాత డెప్యుటేషన్‌పై విదేశాలలో కూడ కొంత కాలం పని చేసి దౌత్యవేత్తల కంటె మిన్న అని నిరూపించుకున్నారు. జి.పి.రావు, ఉర్మిళా సుబ్బారావు (దువ్వూరి సుబ్బారావు సతీమణి), ఏ.వియస్.రెడ్డి, గుల్జార్, ఆశామూర్తి, టి.విజయ కుమార్ వంటి అనేకమంది యువ ఐఏఎస్ అధికారులు సబ్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లుగా తాము పని చేసిన ప్రాంతాలలో ఒక ప్రత్యేక ముద్ర వేశారు. 


ఐఏఎస్ అధికారులు అంటే సమర్ధంగా, నిజాయితీగా పని చేసే జిల్లా కలెక్టర్లుగా ఒకప్పుడు పేరు. సిఫార్సులు చేయడానికి మంత్రులు కూడ సంకోచించే వారు. జిల్లా పరిషత్తు సమావేశాలలో గానీ లేదా సమీక్షల సందర్భంగా గానీ కలెక్టర్ల దృష్టికి ప్రధాన సమస్యలు తీసుకోరావడానికి ప్రజాప్రతినిధులు ప్రయత్నించేవారు. ఆ రకమైన ఘనకీర్తి కల్గిన ఐఏఎస్‌ల వ్యవస్థ క్రమేణా రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మగా మారుతూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. భూముల విలువ ఎక్కువ ఉన్న జిల్లాలలో ఒక్క డెరైక్ట్ రిక్రూట్ ఐఏఎస్ లేకపోవడం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో చాటుతోంది. ఇటీవల సమీకృత జిల్లా కలెక్టర్ల ప్రాంగణాల ప్రారంభోత్సవ సందర్భంగా ఇద్దరు జిల్లా కలెక్టర్లు (ఇద్దరూ కూడ ఐఏఎస్‌కు ప్రమోట్ అయినవారే కానీ నేరుగా రిక్రూట్ అయిన వారు కాదనేది గమనార్హం) తెలంగాణ ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశారు! ఆ ఇరువురిలో ఒకరు, ఇప్పుడు నేరుగా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ నిమిత్తం టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. 


రాజకీయాలపై ఆసక్తి ఉంటే నేరుగా ప్రజా జీవనంలోకి ప్రవేశించడంలో తప్పేమీ లేదు, ఢిల్లీలో యశ్వంత్ సిన్హా, ప్రస్తుత కేంద్ర మంత్రి కె.జె. అల్ఫోన్స్ నుంచి హైదరాబాద్‌లో జయప్రకాశ్ నారాయణ్ దాకా అనేక మంది ఐఏయస్ అధికారులు ప్రభుత్వ సర్వీస్‌కు రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్నారు. అయితే వీరెవరూ ఉద్యోగకాలంలో తమ హోదా హుందాతనాన్ని తగ్గించలేదు. 


ఇత్తడి బిళ్లా, ఎర్రటి పట్టా, తెల్లటి టోపీ ధరించే బంట్రోతు కలెక్టర్ కు జీ హుజుర్ అంటే సూటు బూటు వేసుకునే కలెక్టర్లు అధికారంలో ఉన్న నాయకులకు జీ హుజూర్ అంటున్నారు!

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.