12 ఏళ్ల క్రితం మహిళ మాయం... ఇప్పుడు కుటుంబ సభ్యులను ఎలా కలుసుకున్నదంటే....

ABN , First Publish Date - 2021-09-05T17:35:19+05:30 IST

జార్ఖండ్‌కు చెందిన ఒక మహిళ 12 ఏళ్ల క్రితం...

12 ఏళ్ల క్రితం మహిళ మాయం... ఇప్పుడు కుటుంబ సభ్యులను ఎలా కలుసుకున్నదంటే....

రాంచీ: జార్ఖండ్‌కు చెందిన ఒక మహిళ 12 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో మాయమయ్యింది. ఇప్పుడు నేపాల్‌లో  కనిపించింది. తమ జీవితంలో ఎప్పుడైనా సరే ఆమెను చూస్తామనే నమ్మకం కోల్పోయిన కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆమెను చూసి, భావోద్వేగానికి లోనయ్యారు. జార్ఖండ్ ప్రభుత్వం చొరవతో ఆమె స్వస్థలానికి చేరుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జార్ఖండ్‌లోని లోహర్‌దాగ్ జిల్లాకు చెందిన ఎత్బరియా అనే మహిళ యూపీలో తన తండ్రితో పాటు ఇటుకల బట్టీలో పనిచేసేది. 


12 ఏళ్ల క్రితం ఆమె మాయమయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎత్బరియా గురించి ఎన్ని ప్రాంతాల్లో గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే ఆమె యూపీ నుంచి హరియాణా వెళ్లింది. అక్కడి నుంచి నేపాల్ కు వెళ్లిపోయింది. ఇది జరిగిన 12 ఏళ్ల అనంతరం ఒక ట్వీట్ ద్వారా ఆమె నేపాల్‌లోని ఒక ఆశ్రమంలో ఉంటున్నట్లు రాంచీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి, ఆమెను ఇక్కడకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అలాగే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎత్బరియా తన తల్లితో మాట్లాడింది. తల్లి కూడా తమ కుమార్తెను గుర్తించింది. ఫలితంగా ఆమెను అధికారులు నేపాల్ నుంచి ముందుగా ఢిల్లీకి తీసుకువచ్చారు. తరువాత ఆమెను రాంచీకి తీసుకువచ్చారు. కొంతకాలం క్రితం ఎత్బరియా తండ్రి మరణించాడు. ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆమె కూడా 12 ఏళ్ల తరువాత తన కుటుంబాన్ని కలుసుకున్నందుకు భావోద్వేగానికి లోనయ్యింది.

Updated Date - 2021-09-05T17:35:19+05:30 IST