Office-of-profit row: జార్ఖండ్ సీఎం సోరెన్‌కు భారీ షాక్!

ABN , First Publish Date - 2022-08-25T18:59:59+05:30 IST

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే

Office-of-profit row: జార్ఖండ్ సీఎం సోరెన్‌కు భారీ షాక్!

రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఆయన లాభదాయక పదవిని నిర్వహిస్తున్నందువల్ల ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించవచ్చునా? లేదా? అనే అంశంపై అభిప్రాయాన్ని తెలియజేయాలని గవర్నర్ రమేశ్ బయిస్ గతంలో భారత ఎన్నికల కమిషన్‌ (ECI)ని కోరారు. దీంతో తన అభిప్రాయాన్ని ఈసీఐ మంగళవారం గవర్నర్‌కు పంపించింది. ఈ నివేదిక రాజ్ భవన్‌కు బుధవారం చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో వ్యక్తిగత పర్యటనలో ఉన్న గవర్నర్ గురువారం తిరిగి జార్ఖండ్ చేరుకుంటారు. 


హేమంత్ సోరెన్ పేరు మీద ఓ గనుల తవ్వకం లీజు ఉందని, ఆయన లాభదాయక పదవిని నిర్వహిస్తున్నారని, ఆయనను శాసన సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈసీఐ నివేదికను గవర్నర్ కార్యాలయం పరిశీలించిన తర్వాత మాత్రమే వివరాలను వెల్లడించడానికి అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు. 


ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ పేరు మీద గనుల తవ్వకం లీజు ఉందని, ఆయన లాభదాయక పదవిని నిర్వహిస్తున్నారని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆరోపించారు. దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఫిబ్రవరి 11న గవర్నర్ రమేశ్ బయిస్‌ను కలిసి, ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ప్రకారం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరింది.   దీనిపై అభిప్రాయాన్ని తెలపాలని ఈసీఐని గవర్నర్ కోరారు. 


ఈసీఐ మొదట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చింది. సోరెన్‌కు మైనింగ్ లీజ్ మంజూరుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ పత్రాలన్నిటినీ పరిశీలించిన తర్వాత మే 2న సోరెన్‌కు నోటీసు ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఈసీఐ ధర్మాసనం సమక్షంలో బీజేపీ, సోరెన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సోరెన్ తరపు న్యాయవాదుల వాదనలు ఆగస్టు 12తో ముగిశాయి. బీజేపీ ఆగస్టు 18న ఓ రిజాయిండర్‌ను సమర్పించింది. 


ఇదిలావుండగా, ఓ టీవీ చానల్ చెప్తున్నదాని ప్రకారం, సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీఐ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం తన ఎమ్మెల్యేలను రాంచీకి పిలిచింది. గనుల మంత్రిత్వ శాఖను కూడా సోరెన్ నిర్వహిస్తున్నారు. ఆయన తనకు తానే మైనింగ్ లీజును మంజూరు చేసుకున్నారు. 


Updated Date - 2022-08-25T18:59:59+05:30 IST