పోలవరంపై ఝలక్‌!.. రాష్ట్రానికిచ్చిన 320 కోట్లు వెనక్కి!

ABN , First Publish Date - 2022-01-19T07:52:15+05:30 IST

పోలవరంపై ఝలక్‌!.. రాష్ట్రానికిచ్చిన 320 కోట్లు వెనక్కి!

పోలవరంపై ఝలక్‌!.. రాష్ట్రానికిచ్చిన 320 కోట్లు వెనక్కి!

పనులు చేయనందుకే రీయింబర్స్‌ సొమ్ము వాపస్‌

కొద్ది రోజుల కిందే ఆ మొత్తం ఇస్తున్నట్లు ప్రకటన

ఏ ఖాతాలో వేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రశ్న

తన ఖాతా నంబరు ఇచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ

2-3 రోజుల్లో ఇంకో 390 కోట్లు వస్తాయని అంచనా

ఇంతలోనే పిడుగులాంటి వార్త!


పోలవరం ప్రాజెక్టు నిధులపై రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం మరో ఝలక్‌ ఇచ్చింది. రీయింబర్స్‌మెంట్‌ కింద గతంలో మంజూరు చేసిన రూ.320 కోట్లను వెనక్కి తీసేసుకుంది. లక్ష్యాల మేరకు ప్రాజెక్టు పనులు పూర్తిచేయనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


అమరావతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రం వ్యయం చేసిన రూ.733 కోట్లను రీయింబర్స్‌ చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా కేంద్రానికి రాష్ట్ర జల వనరుల శాఖ బిల్లులు పంపింది. ఇందులో తొలివిడతగా రూ.320 కోట్లు విడుదల చేస్తున్నామని రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నిధులు ఏ ఖాతాలో జమ చేయాలో చెప్పాలని కోరింది. వెంటనే రాష్ట్ర ఆర్థిక శాఖ ఖాతా వివరాలను పంపింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో.. మరో రూ.390 కోట్లను కూడా విడుదల చేస్తున్నట్లుగా కేంద్ర జలశక్తి శాఖ నుంచి సంకేతాలు వచ్చాయి. మరో 2-3 రోజుల్లో ఆ మొత్తం కూడా ఖజానాలో జమ అవుతాయని అనుకుంటుండగా.. రాష్ట్ర జల వనరుల శాఖకు కేంద్రం నుంచి పిడుగులాంటి సమాచారం అనధికారికంగా చేరింది. తాము గతంలో విడుదల చేసిన రూ.320 కోట్లను రాష్ట్ర ఖజానాకు జమ చేయడం లేదనేది దాని సారాంశమని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు కారణాలను కూడా కేంద్రం వివరించినట్లు తెలిపాయి. ‘పోలవరం ప్రాజెక్టును లక్ష్యం మేరకు 2022 నాటికి పూర్తి చేయలేకపోతున్నారు. ఈ ఏడాది ఖరీ్‌ఫకు కూడా గోదావరి జలాలను సాగుకు అందించలేని పరిస్థితి. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను 45.72 మీటర్ల కాంటూరు వరకు (గరిష్ఠ నీటి నిల్వ 194 టీఎంసీలు) పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకపోయారు. కాంక్రీట్‌ పనులు లక్ష్యాల మేరకు పూర్తి చేయలేకపోయారు’ అని కొన్ని ప్రధాన కారణాలను చూపినట్లు తెలిసింది. వీటన్నిటికీ సవివర.. సమగ్ర సంజాయిషీ ఇవ్వాలని జల వనరుల శాఖకు కేంద్రం సూచించింది.


ఆది నుంచీ దోబూచులే..

పోలవరం నిధుల విషయంలో కేంద్రం మొదటి నుంచీ రాష్ట్రంతో దోబూచులాడుతూనే ఉంది. సకాలంలో నిధులు విడుదల చేయకుండా రకరకాల కొర్రీలు వేస్తోంది. తాజాగా లక్ష్యం మేరకు పనులు జరగడం లేదని.. నిర్మాణ పనుల్లో అంతులేని జాప్యం జరుగుతోందని కొత్త వాదన తెరపైకి తెచ్చిందని.. విడుదల చేసిన రూ.320 కోట్లను వాపస్‌ తీసుకుందని ప్రభుత్వ వర్గాలు వాపోతున్నాయి. పైగా ఈ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాలో కాకుండా తన ఖాతాలో వేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ చెప్పడం కూడా కేంద్ర నిర్ణయానికి ఓ కారణమై ఉండొచ్చని అంచనా.

Updated Date - 2022-01-19T07:52:15+05:30 IST