Jet Airwayకు లైన్‌క్లియర్.. త్వరలోనే సర్వీసులు పున:ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-21T00:44:38+05:30 IST

న్యూఢిల్లీ : దాదాపు మూడేళ్లపాటు ఎ‌యిర్‌పోర్టులకే పరిమితమైన జెట్ ఎయిర్‌వేస్(Jet airways) విమాన సర్వీసులు మళ్లీ అందుబాటులోకి రాబోతున్నాయి.

Jet Airwayకు లైన్‌క్లియర్.. త్వరలోనే సర్వీసులు పున:ప్రారంభం

న్యూఢిల్లీ : దాదాపు మూడేళ్లపాటు ఎ‌యిర్‌పోర్టులకే పరిమితమైన జెట్ ఎయిర్‌వేస్(Jet airways) విమాన సర్వీసులు మళ్లీ అందుబాటులోకి రాబోతున్నాయి. జెట్‌ఎయిర్‌వేస్ కమర్షియల్ విమాన సర్వీసుల పున:ప్రారంభానికి పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అనుమతుల ఇచ్చింది. డీజీసీఏ ప్రమాణాలను పాటిస్తూ సన్నాహక విమానాలు నడిపిన అనంతరం ఏఓసీ(ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్) లైసెన్స్ మంజూరు చేసింది. ఈ లైసెన్స్ దక్కాలంటే మొత్తం 5 ల్యాండింగ్ ఫ్లైట్స్ నడపాల్సి ఉంటుంది. విమానాల్లో డీజీసీఏ అధికారులు ప్రత్యక్షంగా ప్రయాణించి పరిశీలిస్తారు. జలాన్ - కల్రాక్ కన్సార్టియం సారధ్యంలోని జెట్ ఎయిర్‌వేస్  మే 15, 17 తేదీల్లో 5 సన్నాహక విమానాలను నడిపింది. ఈ సర్వీసులపై సంతృప్తి వ్యక్తం చేసిన డీజీసీఏ అధికారులు ఏఓసీ లైసెన్స్ జారీ చేయడంతో మళ్లీ విమానాలు నడిపేందుకు మార్గంసుగుమమైంది. ఈ ఏడాది జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో జెట్‌ఎయిర్‌వేస్ కమర్షియల్ ఫ్లైట్స్ కార్యకలాపాలు మొదలుకానున్నాయని జెట్‌ఎయిర్‌వేస్ ఈ సందర్భంగా తెలియజేసింది.


కాగా ఎయిర్‌లైన్స్ నిర్వహణకు అవసరమైన నగదును సమకూర్చుకోవడంలో ప్రమోటర్ నరేష్ గోయల్ విఫలమయ్యారు. ఫలితంగా 2019లో జెట్ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఏప్రిల్ 17, 2019లో చిట్టచివరి సర్వీసు నడిచింది. ఆ తర్వాత జూన్ 2019లో దివాళా ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం జలాన్- కల్రాక్ కన్సార్టియం ప్రమోటర్‌గా జెట్‌ఎయిర్‌వేస్ కార్యకలాపాలు పునరుద్ధరణ కాబోతున్నాయి. అక్టోబర్ 2020లో యూకేకి చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ కన్సార్టియం దాఖలు చేసిన రిసొల్యూషన్ ప్లాన్‌కు జెట్‌ఎయిర్‌వేస్‌ సీవోసీ (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్) అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-21T00:44:38+05:30 IST