మోదీ, హిందూ దేవుళ్ళపై విమర్శలు.. జార్జ్‌ పొన్నయ్య అరెస్టు

ABN , First Publish Date - 2021-07-25T13:50:42+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, హిందూ దేవుళ్లను కించపరిచేలా విమర్శలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మతబోధకుడు జార్జ్‌ పొన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. కన్ని

మోదీ, హిందూ దేవుళ్ళపై విమర్శలు.. జార్జ్‌ పొన్నయ్య అరెస్టు

          - మత బోధకుడికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన


చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, హిందూ దేవుళ్లను కించపరిచేలా విమర్శలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మతబోధకుడు జార్జ్‌ పొన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. కన్నియాకుమారి జిల్లా అరు మనై ప్రాంతంలోని క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 18న ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో జార్జ్‌ పొన్నయ్య ప్రసంగిస్తూ... హిందూ దేవుళ్ళను, ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాను కించపరిచేలా విమర్శలు చేశారు. రాష్ట్రంలో క్రైస్తవులను మభ్య పుచ్చి ఏమార్చి డీఎంకే అధికారంలోకి వచ్చిం దని, ఓ బీజేపీ శాసనసభ్యుడి గురించి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగి జార్జ్‌ పొన్నయ్య, క్రైస్తవసంఘం కార్యదర్శి స్టీపన్‌ సహా ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.ఈనేపథ్యంలో జార్జ్‌ పొన్నయ్య శనివారం వేకువజామున మదురై మీదుగా చెన్నైకి కారులో పారిపోతున్నారని అందిన సమాచారం మేరకు కరుప్పాయూరని ప్రాంతం లో వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు పొన్నయ్యన్‌ బృందాన్ని అదుపులోకి తీసుకున్నా రు. ఆయన్ని మదురైకి తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


చెన్నైలో బీజేపీ రాస్తారోకో

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కన్నియా కుమారి జిల్లాకు చెందిన ఫాదర్‌ జార్జ్‌ పొన్నయ్యను అరెస్టు చేయాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ నేతలు చెన్నైలో మూడుచోట్ల ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్థానిక తిరువొత్తియూరు టోల్‌గేట్‌ ప్రాంతంలో బీజేపీ జిల్లా శాఖ నాయకుడు కృష్ణకుమార్‌ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రదాన కార్యదర్శి జయగణేష్‌ తదితరులు రాస్తారోకో జరిపారు. దీనితో అరగంట సేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. ఇదేవిధంగా న్యూవాషర్‌మెన్‌పేట టోల్‌గేట్‌ వద్ద బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బీజేపీ యువజన విభాగం నాయకుడు త్యాగ రాజన్‌, హరికృష్ణన్‌, సెల్వకుమార్‌, జాలర్ల విభాగం నాయకుడు సంతోష్‌ సహా వందమంది ఆందోళనలో పాల్గొన్నారు. విల్లివాక్కంలో నిర్వహించిన ధర్నాకు పార్టీ సీనియర్‌ నేత చక్రవర్తి నాయకత్వం వహించారు. పార్టీ నాయకులు డాల్ఫిన్‌ శ్రీధరన్‌, పాల్‌ కనకరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T13:50:42+05:30 IST