భారత్‌ శుభారంభం

ABN , First Publish Date - 2022-06-24T09:16:34+05:30 IST

పునరాగమనంలో జెమీమా రోడ్రిగ్స్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. స్పిన్నర్లు తిప్పేయడంతో..

భారత్‌ శుభారంభం

ఆదుకున్న జెమీమా

34 పరుగులతో గెలుపు

శ్రీలంకతో తొలి టీ20

దంబుల్లా: పునరాగమనంలో జెమీమా రోడ్రిగ్స్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. స్పిన్నర్లు తిప్పేయడంతో.. ఓ మాదిరి లక్ష్యాన్ని భారత మహిళల జట్టు అద్భుతంగా కాపాడుకొంది. గురువారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 34 పరుగుల తేడాతో నెగ్గింది. మూడు టీ20ల సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో నిలిచింది.


తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. జెమీమా టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షఫాలీ వర్మ (31), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (22) రాణించారు.  రణవీర 3, రణసింఘే 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 104/5 స్కోరు మాత్రమే చేసింది. కవిష దిలారి (47 నాటౌట్‌) ఒంటరి పోరాటం వృథా అయింది. రాధా యాదవ్‌ 2... దీప్తి, షఫాలీ, పూజ తలో వికెట్‌ దక్కించుకున్నారు. జెమీమా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది. 


దెబ్బకొట్టిన రాధ..:

ఛేదన ఆరంభంలోనే ఓపెనర్‌ విష్మి గుణరత్నె (1)ను దీప్తి అవుట్‌ చేసి దెబ్బ కొట్టింది. కానీ, కెప్టెన్‌ చమరి ఆటపట్టు (16), హర్షిత (10) జాగ్రత్తగా ఆడుతూ ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, ఏడో ఓవర్‌లో వీరిద్దరినీ రాధ అవుట్‌ చేయడంతో.. లంక 27/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి 5 ఓవర్లలో 78 పరుగులు కావాల్సి ఉండగా.. హర్మన్‌, రాధ బౌలింగ్‌లో కవిష బౌండ్రీలతో ఎదురుదాడి చేసింది. అయితే, అప్పటికే సాధించాల్సిన నెట్‌ రన్‌రేట్‌ పెరిగిపోవడంతో ఏమీ చేయలేక పోయింది. నీలాక్షి (8), కాంచన (11) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 


స్మృతి విఫలం..:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్‌ తడబడుతూనే సాగింది. నాలుగో ఓవర్‌లో ఓపెనర్‌ స్మృతి మంధాన (1), మేఘన (0)ను వరుస బంతుల్లో అవుట్‌ చేసిన ఒషాడ.. టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది. తర్వాత షఫాలీ, హర్మన్‌ వరుస ఓవర్లలో నిష్క్రమించడంతో టీమిండియా 58/4తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో సమయోచితంగా ఆడిన జెమీమా.. రిచా (11), పూజ (14) అండతో టీమ్‌స్కోరును సెంచరీ దాటించింది. ఆ తర్వాత దీప్తి (17 నాటౌట్‌)తో కలసి ఏడో వికెట్‌కు 32 పరుగులు జోడించిన రోడ్రిగ్స్‌.. జట్టుకు గౌరవప్రద స్కోరునందించింది. కవిష వేసిన ఆఖరి ఓవర్‌లో దీప్తి హ్యాట్రిక్‌ బౌండ్రీలు బాదగా.. జెమీమా సిక్స్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది. 

Updated Date - 2022-06-24T09:16:34+05:30 IST