జెమీమా జిగేల్‌

ABN , First Publish Date - 2022-10-02T09:29:42+05:30 IST

టాపార్డర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 76) చెలరేగి టీ20 కెరీర్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది.

జెమీమా జిగేల్‌

శ్రీలంకపై భారత్‌ గెలుపు

ఆసియా కప్‌లో హర్మన్‌ సేన బోణీ

సిల్హెట్‌ (బంగ్లాదేశ్‌): టాపార్డర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 76) చెలరేగి టీ20 కెరీర్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. జెమీమాకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (30 బంతుల్లో 33) తోడవడంతో ఆసియా కప్‌లో భారత్‌ బోణీ చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 41 పరుగులతో శ్రీలంకపై గెలి చింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 150/6 స్కోరు చేసింది. హేమలత (13 నాటౌట్‌) చివర్లో వేగంగా ఆడింది. ఒషాడీ రణసింఘే 3 వికెట్లు తీసింది. ఛేదనలో లంక 18.2 ఓవర్లలో 109 రన్స్‌కు కుప్పకూలింది. హాసినీ పెరెరా (30), హర్షిత (26) మాత్రమే రాణించారు. హేమలత మూడు, పూజా వస్త్రాకర్‌, దీప్తిశర్మ రెండేసి వికెట్లు సాధించారు. జెమీమా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది.


రోడ్రిగ్స్‌, కౌర్‌ కలిసి..:

టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. వైస్‌కెప్టెన్‌ స్మృతి మంధాన (10) తొలి వికెట్‌గా అవుటవగా..మరో ఓపెనర్‌ షఫాలీ (6) వైఫల్యాల బాటను కొనసాగించింది. దాంతో భారత్‌ 23/2తో కష్టాల్లో పడింది. ఈదశలో రోడ్రిగ్స్‌, హర్మన్‌ జట్టును ఆదుకొన్నారు. ముఖ్యంగా జెమీమా గ్రౌండ్‌ నలువైపులా ముచ్చటైన షాట్లతో అలరించి 38 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 71 బంతుల్లో 92 రన్స్‌ జోడించి సాగుతున్న తరుణంలో కౌర్‌ స్టంపౌటైంది. అంతకుముందు ఓవర్లో లైఫ్‌ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయిన హర్మన్‌.. 16వ ఓవర్లో రణసింఘే బౌలింగ్‌లో నిష్క్రమించింది. ఇక డెత్‌ ఓవర్లో సత్తాచాటిన లంక బౌలర్లు వరుస వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు.  


వెంటవెంటనే..:

తొలి ఓవర్లో 13 పరుగులతో ఛేదనను లంక వేగంగా ఆరంభించింది. కానీ ఆ ఊపును కొనసాగించలేక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చమరి (5) వికెట్‌ తీసి ఆల్‌రౌండర్‌ దీప్తి భారత్‌కు బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత షెహానీ (9), హర్షిత రనౌట్‌గా వెనుదిరిగారు. దీంతో కావాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయి ఒత్తిడిలో పడిన లంక 61/5తో ఓటమికి చేరువైంది. కానీ సంజీవని (5), రణసింఘే (11) తోడుగా  హసినీ పెరెరా కాసేపు బౌలర్లను నిలువరించింది. అయితే హేమలత టెయిలెండర్లను పెవిలియన్‌ చేర్చి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు తెరదించింది. 


బంగ్లాదేశ్‌ విజయం:

ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 9 వికెట్లతో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది.


సంక్షిప్తస్కోర్లు 

భారత్‌:

20 ఓవర్లలో 150/6 (జెమీమా 76, కౌర్‌ 33, రణసింఘే 3/32).

శ్రీలంక:

18.2 ఓవర్లలో 109 (హాసినీ 30, హేమలత 3/15, పూజా వస్త్రాకర్‌ 2/12, దీప్తిశర్మ 2/15).

Updated Date - 2022-10-02T09:29:42+05:30 IST