అంతకంతకూ పెరుగుతూ పోతున్న అమెజాన్ సీఈఓ సంపద

ABN , First Publish Date - 2020-07-03T01:22:09+05:30 IST

కరోనా మహమ్మారి గత మూడు నెలలుగా ప్రపంచాన్ని ఏ విధంగా కుదిపేస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు.

అంతకంతకూ పెరుగుతూ పోతున్న అమెజాన్ సీఈఓ సంపద

వాషింగ్టన్: కరోనా మహమ్మారి గత మూడు నెలలుగా ప్రపంచాన్ని ఏ విధంగా కుదిపేస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రపంచం మొత్తం స్తంభించిపోవడంతో వ్యాపారాలన్ని మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కుబేరులు వేల కోట్ల నష్టాన్ని చవిచూశారు. అయితే.. ప్రముఖ ఈ-కామర్స్, క్లౌడ్ సర్వీసెస్ సంస్థ అమెజాన్‌కు మాత్రం కరోనా కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ కుబేరుల సంపద మొత్తం తగ్గుతూ పోతోంటే.. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంపద మాత్రం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. బుధవారం అమెజాన్ షేర్ ధర 4.4 శాతం పెరగడంతో ఆయన సంపద 171 బిలియన్ డాలర్లకు చేరింది. చాలా కాలం నుంచి ప్రపంచ అత్యంత ధనవంతుడి స్థానంలో ఆయనే కొనసాగుతున్నారు. 2018 సెప్టెంబర్ 4 నాటికి జెఫ్ బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఆ సమయంలో ఆయన తన భార్య మెకంజీ బెజోస్‌కు విడాకులు ఇవ్వడంతో.. అమెజాన్‌లో 4 శాతం వాటా ఆమెకు వెళ్లిపోయింది. దీంతో జెఫో బెజోస్ నికర ఆస్తుల విలువ దాదాపు 50 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. భారీ మొత్తం తన మాజీ భార్యకు వెళ్లినప్పటికి.. 2018లో ఉన్న సంపదను కూడా దాటేసి జెఫ్ బెజోస్ ఇప్పుడు కొత్త చరిత్ర సృష్టించారు. 


మరోపక్క్ జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ బెజోస్ నికర ఆస్తుల విలువ కూడా 56.9 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆమె ప్రపంచంలోనే రెండో అత్యంత ధనిక మహిళగా ఉన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 56.7 బిలియన్ డాలర్లు పెరిగిందంటే.. కరోనా ప్రభావం ఆయనకు అనుకూలంగా మారిందని చెప్పక తప్పదు. అయితే.. జెఫ్ బెజోస్ ఆదాయం మొత్తం కేవలం ఈ-కామర్స్ వ్యాపారం నుంచి మాత్రమే రావడం లేదు. జెఫ్ బెజోస్‌కు క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం కూడా ఉంది. ఆ వ్యాపారం కూడా ఆయనకు వందల కోట్ల లాభాన్ని తెచ్చుపెడుతోంది. కరోనా కారణంగా ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితం కావడంతో.. ఆ వ్యాపారం ఒక్కసారిగా భారీ లాభాలను తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. కాగా.. అమెజాన్‌తో పాటు అమెరికాలోని ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజం టెస్లా సంస్థ కూడా కరోనా సమయంలో లాభాలను చూసింది. టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ నికర ఆస్తుల విలువ ఈ ఏడాది 25.8 బిలియన్ డాలర్లు పెరిగింది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులుగా ఉన్న వారంతా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచంలోని టాప్ 500 మంది కుబేరుల నికర ఆస్తుల విలువ ఈ ఏడాది ప్రారంభంలో 5.91 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం అది 5.93 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

Updated Date - 2020-07-03T01:22:09+05:30 IST