జీవితం క్షణభంగురమే కానీ..

ABN , First Publish Date - 2020-11-19T09:54:22+05:30 IST

జీవితం మూడు నాళ్ల ముచ్చటే అని గ్రహించని మనిషి, శాశ్వతంగా ఉంటాననుకుంటూ సుఖ సంతోషాలు, ఆడంబరాల్లో మునిగి తేలుతుంటాడు. కానీ మృత్యువు తన తలపైనే కాచుకు కూర్చున్నదని తెలుసుకోలేడు.

జీవితం క్షణభంగురమే కానీ..

కబీరా థోడా జీవనా మాండై బహుత్‌ మండాణ్‌

సబ్‌ హీ ఊ భా మెల్హి గయా రావు రంక్‌ సుల్తాన్‌


జీవితం మూడు నాళ్ల ముచ్చటే అని గ్రహించని మనిషి, శాశ్వతంగా ఉంటాననుకుంటూ సుఖ సంతోషాలు, ఆడంబరాల్లో మునిగి తేలుతుంటాడు. కానీ మృత్యువు తన తలపైనే కాచుకు కూర్చున్నదని తెలుసుకోలేడు. ఈ భూమ్మీదికి వచ్చిన పేదవాడైనా మహారాజైనా ఏదో ఓ రోజు పోయేవాడే కాబట్టి నలుగురు మెచ్చే నాలుగు మంచి పనులు చేసి పరమాత్ముని కృపకు పాత్రుడు కావాలంటారు మహాత్మా కబీరుదాసు. మానవ జీవితం.. బుద్బుదప్రాయం, క్షణభంగురం. ప్రతి ఒక్కరు ఇది తెలుసుకొని అందుకు తగ్గట్లు మసులుకోవాలన్నదే ఈ దోహాలోని సందేశం. పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అయినా మన కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తూనే ఉండాలి. ‘‘జీవితం అనిత్యం, అశాశ్వతం. అట్టి దాని గురించి దుఃఖిస్తూ భీరువు కాకూడదు. నీ ముందున్న కర్తవ్యాలను మరిచిపోకూడదు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తుండాలి’’ అని కృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా సకల మానవాళికీ బోధించాడు.


ఆ భగవానుడి మాటలు నేటి మానవులందరికీదారి దీపాలు. ‘‘నీకు ధనముందని, నీవారున్నారని, యౌవ్వనంలో ఉన్నావని, అధికారంలో ఉన్నానని గర్వపడకు. ఇవన్నీ కాలగమనంలో కొట్టుకుపోయేవే! ఉన్నంతకాలం ఆ భగవంతుడి పరమ పదాన్ని సేవిస్తూ నిజకర్తవ్యాన్ని నెరవేరుస్తూ శాశ్వత ఆనందాన్ని అనుభవించు’’ అని ఆదిశంకరులు ‘భజగోవిందం’లో సూచించారు. జీవితం బుద్బుదప్రాయమే అయినప్పటికీ.. బతుకు బాటలో ఎదురయ్యే కష్టాలకు భయపడి యముని పిలుపు కంటే ముందే తిరిగిరాని లోకాలకు బయలుదేర ప్రయత్నించడం మహాపాపం. ఊపిరి ఉన్నంతవరకూ యుద్ధభూమిలోని వీరుని వలె ధైర్యంతో పోరాడాలి. అప్పుడే జీవితానికి సార్థకత. ‘‘క్షణభంగురమైన జీవితంలో ఈ శరీరం ఒక అద్దె ఇల్లు. దీన్ని పరిశుభ్రంగా ఉంచుకొని భగవంతుణ్ని చేరాలి’’ అంటారు షిర్డీ సాయిబాబా. కొందరిలో నిద్రాణంగా ఉన్న జ్ఞానాన్ని మేలుకొలిపినప్పుడు వారు మహాత్ములై జీవితాన్ని అర్థవంతంగా చేసుకొని పరమాత్మున్ని చేరేందుకు కృషి చేస్తారనడానికి తులసీదాసు అనే భక్త కవే గొప్ప ఉదాహరణ. సంత్‌ తులసీదాసు పూర్వాశ్రమంలో భార్యాలోలుడు. ఒకరోజు ఆయన తన స్నేహితులతో విహారయాత్రకు వెళ్లినప్పుడు.. ఆయన భార్య రత్నావళి తన పుట్టింటికి వెళ్తుంది. ఇంటికి తిరిగొచ్చిన తులసీదాసు భార్య పుట్టింటికి వెళ్లిన సంగతి తెలుసుకుని  హోరున కురుస్తున్న వర్షాన్ని లెక్కచేయకుండా వాగులూ వంకలు దాటుతూ అర్ధరాత్రి వేళ భార్యను చేరుతాడు.


ఆ సమయంలో భర్తను చూసిన రత్నావళి.. ‘‘క్షణభంగురమైన ఈ శరీరం మీది మోహంతో నా చెంతకు చేరావు. ఇదే మమకారం భగవాణుడైన శ్రీరాముని మీద చూపితే నీ జీవితం ధన్యమవుతుంది కదా!’’ అంటుంది. ఆయన జ్ఞాన నేత్రం తెరుచుకుందేమో, వెనుతిరిగి చూడకుండా కాశీ వెళ్లిపోయాడు. వేదవేదాంగాలు అభ్యసించి ప్రజల భాషలో ‘‘రామ్‌ చరిత్‌ మానస్‌’’ పేరుతో రామాయణాన్ని రాసి అపర వాల్మీకిగా చరితార్థుడయ్యాడు.


                                                                               పరికిపండ్ల సారంగపాణి, 9849630290

Updated Date - 2020-11-19T09:54:22+05:30 IST