Jun 23 2021 @ 00:53AM

సిని‘మా’ బరిలో జీవితా రాజశేఖర్‌!

సిని‘మా’ ఎన్నికల బరిలో ఈసారి ముక్కోణపు పోటీ (ప్రస్తుతానికి) ఏర్పడటం ఖాయమే! సెప్టెంబర్‌లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు ఇప్పటినుంచే నటీనటులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అధ్యక్ష పీఠం బరిలో ప్రకాశ్‌రాజ్‌, విష్ణు మంచుతో పాటు జీవితా రాజశేఖర్‌ కూడా నిలబడనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ‘మా’ కార్యదర్శిగా ఆమె కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు మద్దతుదారులు, సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. తాను ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. విష్ణు మంచు సైతం రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జీవితా రాజశేఖర్‌ సైతం బరిలో నిలబడాలని నిర్ణయించుకోవడం ఆసక్తికర పరిణామం. రెండు మూడు రోజుల్లో అధికారికంగా తన నిర్ణయాన్ని ఆమె వెల్లడించనున్నారని సమాచారం.