జీవన్ముక్తుడు!

ABN , First Publish Date - 2020-09-16T06:56:18+05:30 IST

ఎండుగడ్డి వంటి కోరికలను కాల్చేది ఆత్మజ్ఞానం. అది జ్ఞానాగ్ని. కాలిపోగా మిగిలే బూడిదే సమాధి. వాచామౌనం మౌనమూ కాదు, సమాధీ కాదు.

జీవన్ముక్తుడు!

ఎండుగడ్డి వంటి కోరికలను కాల్చేది ఆత్మజ్ఞానం. అది జ్ఞానాగ్ని. కాలిపోగా మిగిలే బూడిదే సమాధి. వాచామౌనం మౌనమూ కాదు, సమాధీ కాదు. దృశ్యమాన ప్రపంచాన్ని చైతన్యమయంగా చూడగలగటమే బ్రహ్మానందస్థితి. అన్నివేళలా ప్రశాంత, ప్రసన్న స్థితిలో నిలకడ చెందినవాడే యోగి. అతడికి కూడటం, వీడటం అంటూ ఉండదు. అతడిది ఏమీ అంటని ఆకాశం వంటి స్థితి!


ఉపనిషత్‌ భావనలో.. అంటే బ్రహ్మ భావనలో నిలకడ చెంది, నిధి ధ్యాసనంలో హృదయాన్ని బ్రహ్మమయం చేసుకున్న జీవన్ముక్తుడికి, సంసార దుఃఖం అంటదు. నిరంతర చింతన అహవినాశానికి దారితీసి శుద్ధాత్మను స్థిరం చేస్తుంది. అది అభినయం నుండి అనుభవం వైపు నడిపిస్తుంది.

వజ్రం లోపలి కాంతి లాగా జ్ఞాని హృదయం కూడా కాంతిమయంగానే ఉంటుంది. అది నిశ్చల దీపకళిక. నిద్రలో అణగిన మనసువలె, జ్ఞాని కార్యకలాపాలు ఆత్మనిష్ఠలోనే కుదురుకొని ఉంటాయి. యోగులు లోకసంబంధ కార్యాలను అద్వయ స్థితిలో ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిర్వర్తిస్తుంటారు.


కోరికలు లేనివాడు మేరు గంభీరుడు, ముల్లోకాలను గడ్డిపోచలో నిలుపుకోగల ధీమంతుడు. ఖాళీకుండ లోపల, వెలుపల ఎట్లా శూన్యమో, నీటమునిగిన కుండ వెలుపలా లోపలా ఎట్లా పూర్ణమో, జీవన్ముక్తుడూ అంతే. ఇష్టాయిష్టాలు ఎరుగని జ్ఞాని, ప్రపంచ వ్యవహారాలను సాక్షిగా నిర్వహిస్తాడు. ప్రపంచంలోనూ, దేహంలోనూ ఉన్నా జ్ఞాని జీవన్ముక్తుడే!

అహం వీడిన ధ్యానాతీతమైన స్థితే జీవన్ముక్తుడిది. ఆప్తమిత్ర బేధం లేక, దృష్టి బేధం లేక అంతటా అన్నిటా సమ్యక్‌ దృష్టితో ఆనందధామంగా ఎవరు జీవిస్తుంటారో వారే జీవన్ముక్తులు. బంధన కానీ ముక్తిగానీ ఎరుగనిది జీవన్ముక్త స్థితి.




ముక్తి లోకాతీతమూ, దేహాతీతమూ కాదు. అది (ముక్తి) ఇక్కడే ఉన్నది అనుకోవటంలోనే అంతా ఇమిడి ఉన్నది. కోరికలే బంధన. వాటిని వదులుకోవటమే ముక్తి. జీవాత్మ పరమాత్మకంటె భిన్నం కాదు. ఆ ఎరుకే జీవన్ముక్త స్థితి. తన కంటే వేరుగా మరొక వస్తువేదీ లేదనే నిశ్చలస్థితే, జీవన్ముక్తుడిది. మనసు తనను తానే బంధించుకుంటుంది. తనను తానే విడిపించుకున్నప్పుడు ముక్తిని అనుభవిస్తున్నది. అదే ఆనందతారక స్థితి.

- వీఎ్‌సఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త


Updated Date - 2020-09-16T06:56:18+05:30 IST