Abn logo
Jul 22 2020 @ 03:43AM

టైర్లు.. బకెట్లతో..!

లాక్‌డౌన్‌ కారణంగా మూతపడ్డ క్రీడా శిక్షణ కేంద్రాల తాళాలు.. అన్‌లాక్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంకా తెరుచుకోలేదు. దీంతో స్టార్‌ క్రీడాకారులు ఇంట్లోనే అత్యాధునిక జిమ్‌లు ఏర్పాటు చేసుకొని ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నారు.  కానీ, ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న గ్రామీణ క్రీడాకారుల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. శిక్షణ కేంద్రాల నుంచి ఇళ్లకు చేరిన కొత్తలో ఇబ్బంది పడినా.. ఆ తర్వాత తమకు అందుబాటులో ఉన్న వనరులతోనే సాధనకు ఉపక్రమించారు. గ్రామాల్లో దొరికే పండ్లు, పాలనే డైట్‌గా తీసుకుంటున్న ఈ యువ అథ్లెట్లు..  వ్యవసాయ పనులు చేస్తూ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటున్నారు.


అందుబాటులో ఉన్న వనరులతో గ్రామీణ అథ్లెట్ల ప్రాక్టీస్‌


జొన్న రొట్టె, నేరేడు పండ్లు..

రైతు కూలీ బిడ్డయిన జీవాంజి దీప్తి స్వస్థలం వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామం. ఈ ఏడాది ఖేలో ఇండియా క్రీడల్లో 100, 200 మీటర్ల స్ర్పింట్‌లో పసిడి పతకాలు నెగ్గి గోల్డెన్‌ గాళ్‌గా పేరు తెచ్చుకొంది ఈ యువ అథ్లెట్‌. లాక్‌డౌన్‌తో నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమైన ఈ స్ర్పింటర్‌ గత్యంతరం లేక సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాల మైదానంలోని మట్టి నేలపైనే పరిగెడుతోంది. జిమ్‌ సదుపాయం లేకపోవడంతో ఫిట్‌నెస్‌ కాపాడుకోవడానికి ఒక ఇనుప రాడ్‌కు రెండు టైర్లు కట్టి వ్యాయామాలు చేస్తోంది. బాడీ స్ట్రెచింగ్‌ కోసం దగ్గర్లోని చెరువులో ఈత కొడుతోంది. సాయ్‌ సెంటర్లో పెట్టే డైట్‌ ఇంటి వద్ద దొరకదు కాబట్టి జొన్న రొట్టె, నేరేడు, జామ కాయలు వంటివి తింటున్నానని దీప్తి తెలిపింది. సింథటిక్‌ ట్రాక్‌పై సాధన అలవాటు కావడంతో సాయ్‌ సెంటర్లో మాదిరి తమ గ్రామంలో పూర్తిస్థాయిలో శిక్షణ కొనసాగించలేకపోతున్నానని.. సాయ్‌ కేంద్రం తెరిస్తే ఈ ఇబ్బందులు తప్పుతాయని అంటోంది దీప్తి. 


విరామం లేకుండా..

ఈ ఏడాది ఖేలో ఇండియా క్రీడల్లో హైజంప్‌, హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన అగసర నందిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెట్‌. మేడ్చల్‌ జిల్లా కాప్రాలో ఉండే నందిని లాక్‌డౌన్‌తో ఇంటినే ప్రాక్టీస్‌ ప్రాంగణంగా మార్చుకుంది. దగ్గర్లో ఎక్కడా జిమ్‌లు లేకపోవడంతో ఇంట్లోని బకెట్లలో ఇసుక, రాళ్లు నింపి వాటిని కట్టెకు తగిలించి వ్యాయామాలు చేస్తోంది. హర్డిల్స్‌ ప్రాక్టీస్‌కు ఇంట్లోని ఎతైన పీటలను అడ్డుగా పెట్టి సాధన చేస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఫిట్‌నెస్‌ కాపాడుకుంటున్నా, ఇది రెగ్యులర్‌ ప్రాక్టీ్‌సతో పోలిస్తే సరిపోదని అంటోంది నందిని. బరువు పెరగకుండా, సాధనకు విరామం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక.. ఇలా అందుబాటులో ఉన్నవాటితో ప్రాక్టీస్‌ చేస్తున్నానని నందిని చెప్పుకొచ్చింది.


ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నాం

అథ్లెట్లకు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. వారి పరిసరాల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండవు కాబట్టి ఉన్నవాటినే ఉపయోగించి చేసే వర్క్‌అవుట్లను సూచిస్తున్నాం. అన్‌లాక్‌డౌన్‌ ప్రక్రియలో భాగంగా పటియాల, బెంగుళూరు సాయ్‌ కేంద్రాలు తెరుచుకున్నాయి. ఇక, హైదరాబాద్‌ సాయ్‌ కేంద్రం తెరవాలని రాష్ట్ర సర్కార్‌కు విజ్ఞప్తి చేశాం. జాగ్రత్తలు తీసుకొని శిక్షణ కొనసాగించకపోతే ఇతర రాష్ట్రాల క్రీడాకారుల కంటే మన అథ్లెట్లు వెనకబడే ప్రమాదం ఉంది.

-నాగపురి రమేష్‌ (కోచ్‌)


 పొలం గట్లపై.. 

మహబూబ్‌నగర్‌ జిల్లా వెలికచర్ల గ్రామానికి చెందిన మహేశ్వరి హైదరాబాద్‌లోని సాయ్‌ అథ్లెటిక్‌ శిక్షణ కేంద్రంలో స్టీపుల్‌ చేజ్‌ క్రీడాకారిణి. ఖేలో ఇండియా యూనివర్సిటీ, అంతర్‌ విశ్వవిద్యాలయ పోటీల్లో స్టీపుల్‌ చేజ్‌ 3000 మీటర్ల విభాగంలో రజత పతకాలు సాధించింది. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు శ్రమిస్తోంది. లాక్‌డౌన్‌తో ఇంటిముఖం పట్టిన మహేశ్వరి దగ్గర్లో ఎలాంటి స్టేడియాలు, జిమ్‌ సదుపాయాలు లేకపోవడంతో ఫిట్‌నెస్‌ కాపాడుకోవడానికి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తోంది. నాగలితో భూమి దున్నడం, వ్యవసాయ పనిముట్లతో వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటోంది. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి రోజువారీ వ్యాయామాలు పూర్తి చేశాక హైదరాబాద్‌ సాయ్‌ శిక్షణ కేంద్రం వెబినార్‌లో ఇస్తున్న సూచనలకు అనుగుణంగా రెండు గంటలు పాటు సాధన చేస్తోంది. అయితే, దగ్గర్లో సింథటిక్‌ ట్రాక్‌  లేకపోవడంతో పొలం గట్లపైన, మట్టి రోడ్ల మీదనే పరిగెడుతోంది. శిక్షణ ఆపితే లయ దెబ్బతింటుందన్న కారణంతో కష్టమైనా అలాగే కసరత్తులు చేస్తోంది మహేశ్వరి. జొన్న రొట్టె, రాగి జావ, మొక్కజొన్న, అరటి, స్థానికంగా లభించే పండ్లనే డైట్‌గా తీసుకుంటున్నానని మహేశ్వరి తెలిపింది.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి - హైదరాబాద్‌)

Advertisement
Advertisement
Advertisement