మనిషి ఈ భూమి మీద పుట్టిన నాటి నుంచి బడి – గుడి – రాబడి అనే త్రివిధ లబ్ధిని పొందటానికి అనునిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ప్రపంచంలోని అన్ని ప్రాణులకు జననం– జీవనం – మరణం అనేవి సహజం. కానీ మానవుడికి మాత్రమే ప్రత్యేక అవసరాలు బడి – గుడి – రాబడి. మనిషి వీటిని సృష్టించుకున్నాడు. జీవితం మొత్తం వాటి కొరకు పోటీతత్వంతో పోరాడుతూనే ఉంటాడు. మున్ముందూ ఇది తప్పనిసరి. కుల మతాలు, బహుళ నాగరికతలు, ఆర్థిక అసమానతలు, సమాజాలు, దేశాల మధ్య పోరాటం అంతిమంగా ఈ మూడు అవసరాల మీద ఆధారపడి ఉంటది. అందరికీ ఈ మూడు అవసరాలు కనీస గౌరవప్రదమైన స్థాయిలో దక్కినప్పుడే మనం పదే పదే చెప్పే, ఆశించే సమసమాజం సిద్ధిస్తుంది. యాదృచ్ఛికమే కావచ్చు కానీ, హిందూ మతంలోని త్రి దేవతలు బడి – గుడి రాబడికి చిహ్నంగా ఉండే దేవతామూర్తులు. సరస్వతీ దేవి బడికి, పార్వతీ దేవి గుడికి, లక్ష్మీ దేవి రాబడికి ప్రతీకలు.
మనిషి మేధోసంపత్తికి మేత నందించేది బడి. పొట్టకు బువ్వ ఎంత అవసరమో, మెదడుకు బడి ద్వారా సంక్రమించే విద్య అనే మేత కూడా అంతే అవసరం. విద్య అనేది మానవజాతి మనుగడకు పెట్టుబడి లాంటిది. కత్తికి పదును పెట్టినట్లు, వజ్రానికి సానపెట్టి వన్నెతెచ్చినట్లు మనిషికి విద్యతో సానపెట్టితే మట్టిలో మాణిక్యాలు పుట్టుకు వస్తవి. ఆ మాణిక్యాలు ఆ సమాజానికి వన్నె తెస్తవి. ఈ రోజు శాస్త్రవేత్తలు, సాఫ్ట్వేర్ నిపుణులు, డాక్టర్లు, ఇతర మేధావి వర్గం భారత దేశానికి వన్నె తేవడమే కాకుండా, దండిగా డబ్బుకూడా తెచ్చిపెడుతున్నారు. అదీ, మనం బడికి పెట్టిన పెట్టుబడి. ఐఐటీ, ఎయిమ్స్, ఐఐఎం, కేంద్రీయ విశ్వ విద్యాలయాలు ఈ రోజు భారతదేశం సంపాదించిన కీర్తికి, కరెన్సీకి ముడి పదార్థాలు. భారతదేశంలోని విద్యావ్యవస్థ దాదాపు 60–70 శాతం ప్రైవేట్ రంగంలోనే పరిమితమయ్యింది. విద్యా వ్యాపారం విలువ దాదాపు 180 బిలియన్ డాలర్లు (రూ. 13,50,000 కోట్లు). అత్యధికంగా నల్ల ధనం పోగుబడడానికీ విద్యా సంస్థలు కేంద్ర బిందువుగా ఉంటున్నాయి. మొత్తం 950 విశ్వవిద్యాలయాలు ఉంటే, వాటిలో 356 ప్రైవేట్ యూనివర్సిటీలు, 120 డీమ్డ్ యూనివర్సిటీలు. మొత్తం వైద్యకళాశాలల సంఖ్య 562 అయితే వాటిలో 276 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. గత పదేళ్లలో ప్రాథమిక విద్యలోనూ, ఉన్నత విద్యారంగంలోనూ ప్రైవేట్ రంగం వేగంగా పురోగమిస్తోంది. కారణం అత్యధిక లాభాలు ఇచ్చేది విద్యా రంగమే కనుక. ఫలితం వజ్రాలకు సానపెట్టే బడులు కృత్రిమ వజ్రాలను తయారు చేసే కర్మాగారాలుగా మారిపోయాయి! ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలకు బడి మీద ఖర్చు బండరాయిలా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు ఉండవలసిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వ రంగం పూర్తిగా నాణ్యత కోల్పోతే, అంతిమంగా ప్రభుత్వ రంగ విద్య కుప్పకూలిపోతే, భారతదేశ అస్తిత్వానికి, ప్రగతికి విఘాతం ఏర్పడుతుంది. టెక్నాలజీ యుగంలో లక్ష్మీ పుత్రులు అందరూ అత్యధికంగా సరస్వతీ పుత్రులే. కనుక, బడికి ప్రతీక అయిన సరస్వతిని కనుమరుగు చేస్తే, ప్రతిభకు, నాణ్యతకు పేదరికం అడ్డంకిగా మారితే భారతదేశ భవిష్యత్తు ప్రశార్థకం అవుతుంది. సరస్వతీదేవికి పెద్దపీట వేయడం, నాణ్యమైన ప్రభుత్వ రంగ బడిని ఆటంకం లేకుండా నడిపించడం, ప్రైవేట్ రంగం కూడా నాణ్యతతో బాటు అందరికి అందుబాటులో ఉండేటట్లు చూడడం అందరి కర్తవ్యం. మరీ ముఖ్యంగా అది ప్రభుత్వాల ప్రాథమిక ధర్మం.
గుడి అంటే కేవలం దేవాలయం, చర్చి, మసీదు కాదు. ఒక వ్యక్తి లేదా సమాజం సంస్కారం, సాంకేతికత, సుప్రవర్తన నేర్పించే ఒక వేదిక. ఉదాహరణకు జర్మనీ, జపాన్లలోని కార్మికులు, ఉద్యోగులు చీటికీ మాటికీ సెలవు తీసుకోరు. ఉద్యోగ జీవితంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని వారు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వారికి పని, బాధ్యతే పరమావధి, వృత్తే ధర్మం. మానవ సేవే మాధవ సేవ అనేదానికి గుడి ఒక పాఠశాల కావాలి. ఒక మనిషి జీవించే నియమావళి అయిన ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థాలను గుడిలో నేర్పించాలి. అన్ని మతాల ఉత్కృష్ట ధార్మిక భావాలను ఉగ్గుపాలతో నేర్పాలి. భగవద్గీత మరణసమయంలోనే లేదా మరణించిన తరువాత వినే ఒక పాట కాకుండా దాని పరమార్థాన్ని బాల్యంలోనే బోధిస్తే అటు ఆ వ్యక్తికీ, ఇటు సమాజానికీ మంచిది. హిందూయిజం వ్యాప్తికి నిరోధకమైన కుల, వర్ణ వ్యవస్థను ఛేదించటానికి సమ ధర్మం, సమ భావం నేర్పాలి. వర్ణాలు అనేవి కేవలం ప్రవృత్తిని బట్టి కానీ, జన్మను బట్టి కావు అని బోధించి, హిందూ మతంలో ఉన్న కొన్ని అనైతిక భావాలను రూపుమాపాలి. బాల్యం నుంచే కేవలం పుస్తకం, పరీక్షలే కాకుండా, పరిపూర్ణమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు గుడి వేదిక కావాలి. గుడి అంటే కేవలం ఆచారాలకే పరిమితం కాకుండా, దానిలో ఉన్న పరమార్థాన్ని నేర్పాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నాలుగు వేరు వేరు వర్ణాలు కాదు, ఒక మనిషికి ఉండవలసిన గుణాలు అని నేర్పాలి. బుద్ధిలో బ్రాహ్మణ, నిపుణతలో శూద్ర, లబ్ధిలో వైశ్య, శక్తిలో క్షత్రియ... ఇలా ఒక మనిషిలో ఉండవలసిన చతుర్గుణాలు అనే నిజాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా చెప్పాలి. మనుస్మృతి ఒక కల్పితమైన, గొప్ప హిందూ సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేసే కుటిల ప్రయత్నం అని తెలియచేసి, మానవ స్మృతిని బోధించాలి. అంతిమంగా గొప్ప భారతీయ సంస్కృతిని, అందులో ఉన్న శాస్త్ర పరిజ్ఞానాన్ని విశ్వవ్యాప్తికి గుడి వేదిక కావాలి కానీ, కేవలం ఆచారాలు, మూఢాచారాలకు వేదిక కాకూడదు. గుడి పరిపూర్ణమైన సమాజ నిర్మాణానికి బడి కావాలి. పార్వతి శక్తి స్వరూపిణి గనుక దేశంలోని యువజనులకు కనీసం కొన్ని వారాలు అయినా సైనిక శిక్షణ ఇవ్వాలి. అది వారు గర్వంగా, స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహించాలి. సర్వజనా సుఖినోభవ, వసుధైక కుటుంబకం అనేవి కేవలం శుభకామనలు మాత్రమే కాకుండా అనూచాన భారతీయ ధార్మిక విధానాలు. ఈ యథార్థాన్ని పాఠశాల స్థాయిలోనే నేర్పించాలి. ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలి. అందుకు గుడి వేదిక కావాలి.
పురుషార్థాలలో ముఖ్యమైనది అర్థ అంటే రాబడి. ఒక వ్యక్తి తన గృహస్థ బాధ్యతలు నెరవేర్చాలన్నా, ఒక సామజిక బాధ్యత నెరవేర్చాలన్నా, లేదా తన అవసరాలు తీరాలన్నా రాబడి అవసరం. అందుకు బడి, గుడిలో నేర్చుకున్న పాఠాలు రాబడికి దారులు. రాబడి అందరికి ఉండాలి. సమాన అవకాశాలు కాకున్నా సమతుల్యత ఉండాలి. ప్రతి కుటుంబం గౌరవంగా జీవించటానికి అవసరం అయిన ఆర్థిక పాలన ఉండాలి. కొందరే సంపద మొత్తం పొందే విధంగా ఉన్న ఏ విధానం అయినా ఒక చట్ట వ్యతిరేక చర్యగా భావించాలి. పనికి గౌరవం కల్పించాలి. సంపద కల్పించే అన్ని అవకాశాలతో పేద, మధ్య తరగతికి మొదటి అవకాశం కల్పించాలి. మహత్ ధన – మహత్ దమన అన్నట్లు, ఒక్కరి దగ్గర సంపద అమితంగా ఉంటే అది ఇతరుల అవకాశాలు కబళించే అవకాశం ఉంది గనుక, ఆర్థిక విధానాలు వాటిని అరికట్టేలా ఉండాలి. ఉదాహరణకు తెలంగాణలోని 69 కుబేరుల దగ్గర అధికారిక లెక్కల ప్రకారం రూ. 4 లక్షల కోట్ల ఆస్తి ఉంది. ఈ సంపద అనధికారంగా రూ. 8 లక్షల కోట్లు ఉండవచ్చు. అది తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల మంది ఏడాది సంపాదనతో సరిసమానం. అలానే కరోనా మహమ్మారి ముసుగులో ఒక కంపెనీ 1200 కోట్ల నల్ల ధనాన్ని మూటగట్టుకున్నట్టు ఆదాయ పన్ను శాఖ దాడుల్లో వెల్లడయింది. దీన్ని బట్టి అవినీతి, ఆర్థిక అసమానతలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. విదేశాలలో ఉన్న వారసత్వ పన్ను లాంటి అభ్యుదయ ఆర్థిక విధానాలు అమలు చేయాలి. ప్రతిభకు పట్టం కడుతూనే, ప్రకృతి వనరులు అన్నిటినీ కొందరు మాత్రమే కైవసం చేసుకోకుండా అరికట్టాలి. అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న మోనోపోలీ ఆక్ట్ లాంటివి అమలు చేసి సరస్వతీ పుత్రులకు పెద్దపీట వేయాలి. ప్రజల రాబడి పెరిగినప్పుడు, దేశం రాబడి పెరుగుతుంది, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఒక శక్తిమంత దేశంగా ఎదుగుతుంది. అంతిమంగా లక్ష్మి, సరస్వతి, పార్వతి కేవలం పూజించే మూర్తులే కాదు, బడి, గుడి, రాబడికి ప్రతీకలు. కనుక బడి, గుడి, రాబడి సర్వజనులకు అందుబాటులో ఉండేటట్లు మన నడవడి, పరిపాలన ఉండాలి. భారతదేశ రాజకీయ నాయకత్వం ఫ్యూడల్ ఆలోచనా విధానాలకు స్వస్తి చెప్పాలి. రాజ్యాంగ ప్రవేశిక నిర్దేశించుకున్న లక్ష్యాలను మన నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి. కుల మతాలకు, ఓటు బ్యాంకు ఆధారిత సిద్ధాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలు అందరి ఆర్థిక ప్రగతికి దోహదపడేలా ఒక ‘కామన్ మినిమమ్ మేనిఫెస్టో’ రూపకల్పనకు చర్చ జరగాలి. రాజకీయ వ్యవస్థ కూడా ప్రస్తుతమున్న ప్రత్యక్ష ‘ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్’లా కాకుండా పాలసీ ఆధారిత పరోక్ష ఎన్నికలను అనుసరించాలి. రాజకీయ అవసరాల నిమిత్తం విధానాల రూపకల్పన ఆవశ్యకతను దూరం చేసేలా సమాంతర ఆలోచనలు, పటిష్ఠ కార్యాచరణకు పూనుకోవాలి. బడి, గుడి, రాబడి అనే త్రిసూత్ర వ్యూహంతో జాతి నిర్మాణం జరగాలి. భారతదేశం అంతిమంగా ఒక విశ్వవ్యాప్త విజ్ఞాన, ధార్మిక, ఆర్థిక శక్తిగా ఎదగాలి.
డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ