జీపు-బైక్‌ ఢీ: ముగ్గురికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-08-09T07:04:08+05:30 IST

రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల-లబ్బర్తి గ్రామాల మధ్య ప్రమాదకర మలుపు వద్ద జీపు, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

జీపు-బైక్‌ ఢీ: ముగ్గురికి తీవ్రగాయాలు

రాజవొమ్మంగి ఆగస్టు 8: రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల-లబ్బర్తి గ్రామాల మధ్య ప్రమాదకర మలుపు వద్ద జీపు, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. లాగరాయి గ్రామానికి చెందిన పుల్లి లక్ష్మమ రాజవొమ్మంగి ఎంపీపీ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహించి సోమవారం సాయంత్రం తన కుమారుడు పుల్లి ముని సిద్ధార్థతో కలిసి ద్విచక్ర వాహనంపై  స్వగ్రామానికి బయలుదేరారు. నెల్లిమెట్ల-లబ్బర్తి గ్రామాల మధ్యలో  మలుపు వద్ద ద్విచక్ర వాహనం ఎదురుగా అనంతగిరి నుంచి వస్తున్న అటవీ శాఖ జీపు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తల్లీకొడుకులుతో పాటు అనంతగిరి ఉపాధ్యాయురాలు మడకం బాలశ్రీ(31) తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు 108కి ఫోన్‌ చేసినా సుమారు గంట సేపటివరకు రాలేదు. దీంతో క్షతగాత్రులు రోడ్డుపైనే హాహాకారాలు చేశారు. రెండు ప్రైవేట్‌ వాహనాల్లో స్థానికులు రాజవొమ్మంగి ఆస్పత్రికి తీసుకెళ్లారు.    వైద్యాధికారి శ్రీదుర్గ  పుల్లి మునిసిద్ధార్థ, పుల్లి లక్ష్మమను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. .అయితే బాలశ్రీని రిఫర్‌ చేసినా తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ లేదు. జడ్డంగి ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌ తీసుకువచ్చి రాజమహేంద్రవరం తీసుకెళ్లింది. అయితే అంబులెన్స్‌లకు ఇంధనంకోసం ప్రభుత్వం ఇచ్చే కూపన్లు అయిపోవడంతో క్షతగాత్రుల కుటుంబ సభ్యుల డబ్బులతో అయిల్‌ కొట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఆస్పత్రిని సందర్శించిన ఎంపీపీ గోము వెంకటలక్ష్మి జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి రాజవొమ్మంగి ఆసుపత్రికి ఆదనపు వైద్యాధికారిని నియమించాలని కోరారు. ఆదివాసీ నాయకులు వంతు బాలకృష్ణ పలువురు అధికారులతో మాట్లాడారు. అంబులెన్స్‌ మరమ్మతులకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఆదివాసీ సంఘం తరపున అంబులెన్స్‌ మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. 


Updated Date - 2022-08-09T07:04:08+05:30 IST