దిగుబడి లేదు.. ధరా లేదు

ABN , First Publish Date - 2021-05-11T06:03:56+05:30 IST

మండలంలోని జీడిమామిడి తోటలు ఈ సంవత్సరం ఆశించిన దిగుబడి ఇవ్వలేదు. జనవరి, ఫిబ్రవరిల్లో పూతదశల్లో ఉన్న సమయాల్లో పొగమంచు ఎక్కువగా కురవడం వల్ల 50శాతం పూత దశలోనే మాడిపోయింది.

దిగుబడి లేదు.. ధరా లేదు

  • ఆందోళనలో  జీడిమామిడి రైతులు

కోరుకొండ, మే 10: మండలంలోని జీడిమామిడి తోటలు ఈ సంవత్సరం ఆశించిన దిగుబడి ఇవ్వలేదు. జనవరి, ఫిబ్రవరిల్లో పూతదశల్లో ఉన్న సమయాల్లో పొగమంచు ఎక్కువగా కురవడం వల్ల 50శాతం పూత దశలోనే మాడిపోయింది. అయితే క్రిమిసంహారక మందులు, పూత మందులు వంటివి వాడి మిగిలిన 50శాతం పూతను రైతులు రక్షించుకోగలిగారు. వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల ఈ సంవత్సరం జీడిమామిడి ఆశించిన దిగుబడి రాలేదు. ఎకరాకు 10కాటాల జీడిపిక్కలు రావాల్సి ఉండగా కనీసం రెండు మూడు కాటాలు కూడా అవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం జీడిపిక్కల ధర తగ్గిపోయింది. కాటా (60 కిలోలు) రూ.12వేలు వరకు ఉండేదని, ప్రస్తుతం రూ.8వేలకు కూడా కొనట్లేదని మండలంలోని మెట్ట గ్రామాలైన రాజవరం, కణుపూరు, గాదరాడ, నర్సాపురం, జంబుపట్నం, పశ్చిమ గోనగూడెం గ్రామాల రైతులు వాపోతున్నారు. ఎకరం జీడిమామిడి తోటను రైతుల వద్ద నుంచి ఒక సంవత్సరం జీడిపిక్కలు ఏరుకు నేందుకు రూ.15వేలు కొనుగోలు చేశామ న్నారు. ఆ తోట దుక్కిదున్నడానికి, ఎరువులు, పురుగు మందులకు రూ.6వేలు ఖర్చు అయిందన్నారు. గత ఆరు నెలలుగా కోతులు, కొండముచ్చుల నుంచి తోటలను  కాపాడు కోవడానికి కాపలా ఖర్చు ఎకరాకు మరో రూ.5వేలు చొప్పున... మొత్తంగా రూ.25వేలు వరకు ఖర్చు పెట్టామని రైతులు తెలిపారు. అయితే ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న దిగుబడులకు తోడు ధర కూడా తగ్గిపోవడంతో జీడిమామిడి రైతులు దారుణంగా నష్టపో యారు. ప్రభుత్వం జీడిపిక్కలకు సరైన ధర కల్పించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


Updated Date - 2021-05-11T06:03:56+05:30 IST