జిన్నా‌ను పొగిడిన జేడీయూ ఎమ్మెల్సీ.. పాక్ పొమ్మన్న బీజేపీ

ABN , First Publish Date - 2021-11-13T22:31:43+05:30 IST

పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా పేరు ఇప్పుడు భారత రాజకీయాల్లో చక్కర్లు..

జిన్నా‌ను పొగిడిన జేడీయూ ఎమ్మెల్సీ.. పాక్ పొమ్మన్న బీజేపీ

పాట్నా: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా పేరు ఇప్పుడు భారత రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సుహల్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ తర్వాత ఇప్పుడు జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) వంతు వచ్చినట్టుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఖలీద్ అన్వర్ తాజాగా జిన్నాను గొప్ప దేశభక్తుడిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భగ్గుమన్న బీజేపీ నేతలు.. ఆయనను పాకిస్థాన్ పొమ్మంటూ కౌంటర్ ఇచ్చారు.


''జిన్నా గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు. దేశ స్వాతంత్ర్యం కోసం చాలా కష్టపడ్డారు. అందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. దేశాన్ని విభజించి పాకిస్థాన్ ఏర్పాటు చేశారు. అందుకు ఆయనను విమర్శించడం సరికాదు'' అని ఖలీద్ అన్వర్ అన్నారు. జిన్నాపై తన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని, తమ పార్టీ అభిప్రాయం కూడా అదేనని కూడా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు చేస్తూ, టెర్రరిజాన్ని వేర్వేరు అద్దాల్లో చూడటమే దేశ విభజనకు కారణమన్నారు. దేశ విభజన విషయంలో జిన్నాతో పాటు కాంగ్రెస్‌కు కూడా బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాని కావడం కోసమే పండిట్ నెహ్రూ సైతం దేశ విభజనకు ముందుకెళ్లారని ఆరోపించారు. ''ఉగ్రవాదానికి రంగులుండవు. కాషాయమా, ఆకుపచ్చా అనేది ఉండదు. కాంగ్రెస్ ఆలోచనా విధానం వల్లే దేశ విభజన జరిగింది. విభజనకు కాంగ్రెస్‌తో పాటు జిన్నా పాత్రా ఉంది. నెహ్రూ తలచుకుని ఉంటే విభజనను ఆపి ఉండేవారే. కానీ, ప్రధాని కావడం కోసం ఆయన ఆ పని చేయలేదు''అని ఖలీద్ అన్వర్ అన్నారు.


బీజేపీ ఖండన...

ఖలీద్ అన్వర్ వ్యాఖ్యలపై నితీష్ క్యాబినెట్‌లో బీజేపీ మంత్రి సమ్రాట్ చౌదరి మండిపడ్డారు. ఇప్పటికీ ఎవరైనా జిన్నాను పొగడాలనుకుంటే వారి కోసం పాకిస్థాన్ తలుపులు తెరిచే ఉంటాయని, వాళ్లు అక్కడకు వెళ్లిపోవచ్చని, పాకిస్థాన్‌కు కూడా వారికి సాదర స్వాగతం పలుకుతుదని అన్నారు. ఇక్కడ ఉండాలనుకుంటే భరత మాతకు, గాంధీజీకి జై చెప్పాలన్నారు.

Updated Date - 2021-11-13T22:31:43+05:30 IST