రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాతో కెరీర్ మొదటుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కారు జె.డి.చక్రవర్తి. హీరోగా, విలన్‌గా, వైవిధ్యమైన పాత్రలతో అలరించారు. మనీ, రక్షణ, వన్ బై టూ, అనగనగా ఒక రోజు, గులాబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, సత్య, ప్రేమకు వేళాయెరా వంటి చిత్రాలతో తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ‘ఎంఎంఓఎఫ్’ అనే థ్రిల్లర్‌తో ఆకట్టుకున్నారు. దర్శకుడిగా ’హోమం’, ‘సిద్థం’ లాంటి చిత్రాలు తెరకెక్కించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర ప్రాజెక్ట్‌ల గురించి వెల్లడించారు. ప్రస్తుతం జేడీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ, బిజీగా ఉన్నారు. హిందీలో ఏక్ విలన్ – 2, ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమా, మరో థ్రిల్లర్ చిత్రం చేస్తున్నారు. దీనికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. సోనీ, ప్రైమ్ కలిసి నిర్మిస్తున్న ఓ హిందీ వెబ్ సిరీస్‌లో కూడా ఆయన నటిస్తున్నారు. తమిళ్లో సింగం ఫిలిం ప్రొడక్షన్ రూపొందించనున్న ‘కర్రీ’లో కీలక పాత్ర పోషిస్తున్నారు జెడీ చక్రవర్తి. ఈ సినిమాలో శశి కుమార్ హీరోగా నటిస్తున్నారు. ‘పట్టరాయ్’ అనే మరో తమిళ సినిమాలో భాగమయ్యారు. ఇవి కాకుండా కన్నడలో రెండు సినిమాల్లో జెడీ చక్రవర్తి నటిస్తున్నారు. అందులో ఒకటి జోగి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రేమ్’ కాగా మరొకటి థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ WHO చేస్తున్నారు. తెలుగులో ‘బ్రేకింగ్ న్యూస్’, ‘ది కేస్’ సినిమాలు చేస్తున్నారు. మలయాళంలోనూ పలు చిత్రాలు కమిట్ అయ్యారు జేడీ!