జేసీబీ ఆపరేటర్‌ మృతి

ABN , First Publish Date - 2020-08-02T09:50:02+05:30 IST

తన కుమారుడిని హత్య చేశారంటూ భట్టిప్రోలు మండలం వెల్లటూరు వీఆర్‌ఏ చీకటి నాగమల్లేశ్వరరావు తన బంధువులతో కలిసి ..

జేసీబీ ఆపరేటర్‌ మృతి

హత్య చేశారంటున్న తండ్రి

లారీకింద పడ్డారంటున్న జేసీబీ ఓనర్‌ 

పోలీస్‌ స్టేషన్‌ వద్ద హైడ్రామా 


రేపల్లె, ఆగస్టు 1: తన కుమారుడిని హత్య చేశారంటూ భట్టిప్రోలు మండలం వెల్లటూరు వీఆర్‌ఏ చీకటి నాగమల్లేశ్వరరావు తన బంధువులతో కలిసి శనివారం రేపల్లె పోలీస్‌స్టేషన్‌ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. తండ్రి, బంధువుల కథనం ప్రకారం.. వెల్లటూరుకు చెందిన జేసీబీ ఆపరేటర్‌ అయిన చీకటి మనోహర్‌బాబు(30) పట్టణంలోని 18వ వార్డులో పేదలకు ప్రభుత్వం అందించే నివేశనస్థలాల మెరక పనులు చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో డ్యూటీకి వెళ్లాడు. శనివారం రోజు ఉదయం ఏడు గంటలకు జేసీబీ ఓనర్‌ మధు ఫోన్‌ చేసి మనోహర్‌బాబు లారీ కిందపడ్డాడని తండ్రికి తెలిపారు. ఘటనాస్థలానికి వెళ్లి చూడగా జేసీబీ, లారీ ఉందని, పక్కనే రక్తపు మరకలు ఉన్నాయని, తన కుమారుడు లేడని నాగమల్లేశ్వరరావు చెప్పారు. 


ప్రభుత్వ వైద్యశాల శవాగారం వద్ద మృతదేహం ఉందని తెలిసి అక్కడి వెళ్లామన్నారు.  అక్కడ వర్క్‌చేస్తున్న వర్కర్స్‌, సూపర్‌వైజర్స్‌, కాంట్రాక్టర్‌ పెదబుజ్జి, మొవ్వ శ్రీనివాసరావు మద్యం సేవించిన తన కుమారుడితో ఘర్షణపడి కొట్టి హత్య చేసినట్లు తెలిసిందన్నారు. వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అక్కడికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి పోలీస్‌లతో చర్చించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పట్టణ సీఐ సాంబశివరావుకు సూచించారు. సీఐ ఎస్‌సాంబశివరావు మాట్లాడుతూ మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-08-02T09:50:02+05:30 IST