తమ్ముడూ కేటీఆర్.. నువ్వు చెప్పిందే కరెక్ట్.. కట్టుబడి ఉండు : జేసీ ప్రభాకర్

ABN , First Publish Date - 2022-05-02T20:52:21+05:30 IST

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

తమ్ముడూ కేటీఆర్.. నువ్వు చెప్పిందే కరెక్ట్.. కట్టుబడి ఉండు : జేసీ ప్రభాకర్

అనంతపురం : తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఒక్క ఆంధ్రాలోనే కాదు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇందుకు ఏపీకి చెందిన పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ కౌంటర్‌లు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సోమవారం నాడు తాడిపత్రిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ‘తమ్ముడూ కేటీఆర్.. నువ్వు చెప్పింది కరెక్ట్.. ఆ కామెంట్స్‌కు కట్టుబడి ఉండు. ఎందుకనీ.. మళ్లీ స్లిప్ ఆప్ ద టంగ్ అంటావ్..?.. కేటీఆర్‌ చెప్పింది అక్షర సత్యమే. కేటీఆర్‌లో లోపల ఆవేశం ఉంది.. ఉన్నమాట అంటే ఏమీ కాదు.. రోడ్లు, కరెంటు లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయిపోయింది. రోడ్లు బాగలేకపోవడంతో ఖరీదైన వాహనాల్లో కాకుండా జీపుల్లో తిరగాల్సి వస్తోంది. బహుశా కేటీఆర్.. బయపడి కాదు బాగుండదని మాట మార్చాడు అంతే. తెలంగాణలో ఉండే షర్మిల విమర్శిస్తే ఈయనకు కుతకుత అనదా..?’ అని జేసీ వ్యాఖ్యానించారు.


పార్టీ మార్పుపై క్లారిటీ..

అంతటితో ఆగని ఆయన.. గతంలో జరిగిన బస్సుల వ్యవహారంపై కూడా మాట్లాడారు. ‘ఊత పదం నీ అమ్మా అన్నానని .. ఈ రోజుకు నన్ను ఇప్పటికీ వదిలిపెట్టలేదు.. మాకు సంబంధించిన బస్సులు, లారీలు కూడా తిరగనివ్వలేదు’ అని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. గత కొన్ని రోజులుగా జేసీ ఫ్యామిలీ పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తునే పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రెస్‌మీట్ వేదికగా దీనిపైనా కూడా క్లారిటీ ఇచ్చేశారాయన. ‘ అవును.. బీజేపీ వాళ్లు మా ఇంటికొచ్చారు.. నేను వాళ్లింటికి వెళ్లలేదు. ఐదు పార్టీల పెద్దలు నాకు టిక్కెట్ ఇస్తారు.. అయినా సరే నాకేమీ వద్దు..’ అని జేసీ చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-05-02T20:52:21+05:30 IST