జేసీ నాగిరెడ్డి ప్రాజెక్ట్‌ పైపులు మాయం

ABN , First Publish Date - 2022-07-07T06:08:25+05:30 IST

గండికోట ప్రాజెక్టు నుంచి ముచ్చుకోట అడవుల మీదుగా జిల్లాకు నీటిని తీసుకురావాలని భావించారు. లక్షలాది మంది గొంతు తడిపేందుకు జేసీ నాగిరెడ్డి పేరిట పదేళ్ల క్రితం పనులు మొదలు పెట్టారు.

జేసీ నాగిరెడ్డి ప్రాజెక్ట్‌ పైపులు మాయం
ముచ్చుకోట కొండల్లో అనంతపురం -తాడిపత్రి హైవే పక్కన వేసిన పైపులైన(ఫైల్‌)

ముచ్చుకోట రహస్యం

దిమ్మెలు ధ్వంసం చేసి.. గుట్టుగా తరలింపు

భారీ యంత్రాలు, వాహనాలతోనే సాధ్యం

పదేళ్ల క్రితం రూ.504 కోట్లతో పనులు

ఒక్కో పైపు విలువ రూ.లక్ష పైమాటే

రెండు కి.మీ. మేర కనిపించని పైపులు


గండికోట ప్రాజెక్టు నుంచి ముచ్చుకోట అడవుల మీదుగా జిల్లాకు నీటిని తీసుకురావాలని భావించారు. లక్షలాది మంది గొంతు తడిపేందుకు జేసీ నాగిరెడ్డి పేరిట పదేళ్ల క్రితం పనులు మొదలు పెట్టారు. అతికష్టమ్మీద అటవీశాఖ అనుమతి పొంది, ముచ్చుకోటలో భారీ పైపులు ఏర్పాటు చేయించారు. నిధుల కొరత, ఇతర కారణాలతో పనులు నెమ్మదించాయి. ఇదే అదనుగా ఎవరో మాయ చేశారు. ముచ్చుకోటలో ఏర్పాటైన ఖరీదైన భారీ పైపులను దర్జాగా తరలించారు. దీని వెనుక ఎవరున్నారు..? ఏమిటా రహస్యం..? ఎంతమేర పైప్‌లైన వేశారు అని అడిగితే.. కొందరు అధికారులు తెలియదన్నారు. కనీసం పైపులు మాయమైన విషయమైనా వారికి తెలుసా..?

- తాడిపత్రి

                    జేసీ నాగిరెడ్డి ప్రాజెక్టు పైపులు మాయమయ్యాయి. ఏవో చిన్నపాటి కుళాయి పైపులేమో.. చేతిలో పట్టుకుని వెళ్లిపోయుంటారు అనుకోకండి. కడప జిల్లా సింహాద్రిపురం దగ్గర ఉండే గండికోట ప్రాజెక్ట్‌ నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, గుంతకల్లు మున్సిపాలిటీలు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన పైపులు అవి. అత్యంత ప్రతిష్టాత్మకంగా, రూ.504 కోట్లతో జేసీ నాగిరెడ్డి ప్రాజెక్ట్‌ను చేపట్టారు. వివిధ కారణాలతో ఈ పనులు పదేళ్లుగా కొనసాగుతున్నాయి. ఇంతలోనే రూ.లక్షల విలువైన భారీ పైపులు మాయమయ్యాయి. దాదాపు రెండు కి.మీ.కు పైగా వేసిన పైపులైన ఆనవాళ్లే లేకుండాపోయాయి. ఈ విషయం అధికారులకు కూడా తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిందే.


భారీ యంత్రాలతోనే సాధ్యం..

జేసీ నాగిరెడ్డి ప్రాజెక్టు పైపులైనను తరలించాలంటే ఆషామాషీ కాదు. భారీ యంత్రాలతోనే వాటిని కదిలించడం సాధ్యం. పైపుల కింద వేసిన సిమెంట్‌ దిమ్మెలను పగలగొట్టి మరీ ఎత్తుకెళ్లారు. పెద్దపెద్ద సిమెంట్‌ దిమ్మెలను పగలగొట్టడానికీ భారీ యంత్రాలు కావాల్సిందే. అక్కడి నుంచి పైపులను ఎత్తుకువెళ్లేందుకు లారీలు అవసరమవుతాయి. ఈ తతంగం మొత్తం ఒకటిరెండు రోజుల్లో పూర్తి చేయలేరు. కనీసం వారం రోజులు పడుతుంది. అయినా అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. అలాగని ఎక్కడో మారుమూల ప్రాంతంలో పైపులు మాయం కాలేదు. అనంతపురం-తాడిపత్రి హైవే పక్కన, ముచ్చుకోట కొండల్లో వేసిన పైపులైన అది. నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. అయినా వాటిని మాయం చేశారంటే పెద్దల హస్తం ఉంటుందని, అధికారుల హస్తం కూడా ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల సహకారం లేనిదే భారీ పైపులను అంత దర్జాగా ఎత్తుకెళ్లడం అసాధ్యం.


అంతా రాయే..

పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అడవిలో భూమిపొర అంతా రాయే. రాయిని బ్లాస్ట్‌చేసి పైపులైన ఏర్పాటు చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. దీంతో అప్పట్లో కాంట్రాక్టర్‌ పైపులైనను భూమిలోపల కాకుండా, పైన కాంక్రీట్‌ దిమ్మెల మీద ఏర్పాటు చేశారు. ముచ్చుకోట కొండల్లో పైపులైన వేసేందుకు అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అనుమతుల్లో ఎంతో జాప్యం జరిగింది. అప్పటి మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి చొరవ కారణంగా ఆలస్యంగానైనా అనుమతులు వచ్చాయి. ముచ్చుకోట అటవీ ప్రాంతం ప్రారంభంలో ఏర్పాటు చేసిన సంపు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు అనుగుణంగా సిమెంట్‌ దిమ్మెలను ఏర్పాటు చేసి, వాటిపైన పైపులను కూర్చొబెట్టారు. ముచ్చుకోట కొండల్లోని రోడ్డుపక్కన ఈ పైప్‌లైనను వేశారు. ఈ పైప్‌లైన ద్వారా ధర్మవరం ప్రాంతానికి నీటిని అందించేందుకు అప్పట్లో అంచనాలు తయారు చేశారు. 




ఒక్కొక్క పైపు రూ.లక్ష పైనే..

ముచ్చుకోట కనుమల్లో మాయమైన పైపులు ఖరీదైనవి.  పదేళ్ల క్రితం పైపులైన వేసే సమయంలో ఒక్కొక్క పైపు విలువ రూ.లక్ష పైమాటే. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం వాటి విలువ రెట్టింపు ఉంటుంది. ఈ పైపులను కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్‌ వద్ద ఐహెచపీ తయారు చేస్తోంది. వీటిసైజు పొడవు మూడు మీటర్లు, వెడల్పు 1.2 మీటర్లు.  పైకి సిమెంట్‌ పైపులా కనిపించినా, లోపల అత్యంత కఠినమైన, మందమైన ఇనుప రేకు, పైన ఇనుప జాలరీ ఉంటాయి. ఈ పైపుల పైభాగంలో సిమెంట్‌ కలర్‌ కెమికల్‌ పూత పూస్తారు. ఖరీదైన ఈ పైపులను చిన్నాచితక కాంట్రాక్టర్లు కొనుగోలు చేయరు. రూ.వందల కోట్ల పనులు చేసే కాంట్రాక్టర్లు బల్క్‌గా కొనుగోలు చేస్తారు. అలాంటి వారికోసమే కంపెనీలు తయారు చేసి అమ్ముతుంటాయి. మొత్తం ఎన్ని పైపులు మాయమయ్యాయో.. ఎవరు ఎత్తుకువెళ్లారో.. వాటి విలువ ఎంతో.. అధికారులు తేల్చాల్సి ఉంది.

Updated Date - 2022-07-07T06:08:25+05:30 IST