ఆర్‌అండ్‌బీ స్థలాన్ని పరిశీలించిన జేసీ

ABN , First Publish Date - 2022-09-29T05:26:38+05:30 IST

కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డు ప్రక్కన ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పరిశీలించారు.

ఆర్‌అండ్‌బీ స్థలాన్ని పరిశీలించిన జేసీ
స్థలాన్ని పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

 కంబదూరు (కళ్యాణదుర్గం), సెప్టెంబరు 28 : కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డు  ప్రక్కన ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పరిశీలించారు. ‘మూడుకు పదకొండు’ అన్న శీర్షికన ఆంధ్రజ్యోతిలో మంగళవారం కథనం ప్రచురితం కావడంతో స్పందించారు. బుధవారం జేసీతో పాటు ఆర్డీవో నిషాంత్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశులు, తహసీల్దారు శంకరయ్య, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, వాస్తవ విషయాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణలో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి మూడు సెంట్లు కోల్పోయాడు. దీంతో బళ్లారి రోడ్డు పక్కనే ఉన్న 11 సెంట్లు ఆర్‌అండ్‌బీ స్థలాన్ని పరిహారం కింద అధికారులు ఇచ్చేం దుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అధికారులు అందరూ కలిసి ఆ రెండు చోట్ల స్థలాన్ని పరిశీలించి వాస్తవ విషయాలను స్థానిక అధికా రులను జాయింట్‌ కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంఘాల నాయకులందరూ కలిసి జాయింట్‌ కలెక్టర్‌తో ఇక్కడ జరిగే అన్యా యంపై వివరించారు. రోడ్డు వెడల్పుతో పూర్తిగా నష్టపోయిన బాధితులు చాలా మంది ఉన్నారని, అలాంటి వారందరినీ వదిలేసి, ఎక్కడో ఓ అధికార పార్టీ నాయకుడికి కోట్లు విలువ చేసే స్థలాన్ని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ స్థలాన్ని రద్దు చేయాలని కోరారు. పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. 


Updated Date - 2022-09-29T05:26:38+05:30 IST