‘అంత్యక్రియల’పై.. భయాందోళనలు తొలగించేందుకు.. ఈ జేసీ ఏం చేశారో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-08-03T12:46:52+05:30 IST

కరోనా వైరస్‌తో చనిపోయిన వ్యక్తుల మృతదేహాల అంత్యక్రియలపై..

‘అంత్యక్రియల’పై.. భయాందోళనలు తొలగించేందుకు.. ఈ జేసీ ఏం చేశారో తెలిస్తే..

గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌తో చనిపోయిన వ్యక్తుల మృతదేహాల అంత్యక్రియలపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు, అపోహలు తొలగించేందుకు జాయింట్ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైరస్‌తో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన వ్యక్తి(57) కరోనాతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉండటంతో అంతిమ సంస్కారాలకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో వారి అనుమతితో అమ్మ ఛారిటబుల్ ట్రస్టు, మహాప్రస్థానం సేవా సమితిలు అంత్యక్రియలను ఏర్పాటు చేశాయి. బొంగరాలబీడు శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జేసీ దినేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 


కొవిడ్-19తో చనిపోయిన వ్యక్తి మృతదేహంలో ఆరు నుంచి ఏడు గంటలకు మించి వైరస్ ఉండదన్నారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పూర్తిగా స్ప్రే చేసి, బ్యాగ్‌లలో ప్యాక్ చేసి మృతదేహాలను అందించడం జరుగుతుందన్నారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహం పట్టుకొని అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చన్నారు. పాజిటివ్ వ్యక్తి మృతదేహం సమీపం నుంచి చూసే వాళ్లు మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తే వైరస్ సోకదన్నారు. పాజిటివ్ వ్యక్తుల అంత్యక్రియలను తమ శ్మశానవాటికల్లో చేయొద్దని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అడ్డు పడుతున్నారని చెప్పారు.


చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించకపోవడం మానవత్వానికే మచ్చగా మిగులుతుందన్నారు. అందుకే తాను స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అమ్మ ఛారిటబుల్ ట్రస్టు శేఖర్, మహాప్రస్థానం సేవా సమితిలను జేసీ అభినందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్డీవో భాస్కర్ రెడ్డి, కొవిడ్-19 మృతదేహాల మేనేజ్‌మెంట్ నోడల్ ఆఫీసర్ రమేష్ నాయుడు, తహసీల్దార్ శ్రీకాంత్, నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-03T12:46:52+05:30 IST