Abn logo
Sep 25 2021 @ 16:40PM

మరో నినాదాన్ని తెరపైకి తెచ్చిన జేసీ దివాకర్‌రెడ్డి... ఏపీలో సరికొత్త చర్చ

హైదరాబాద్: జేసీ దివాకర్ రెడ్డి పేరు పరిచయం అక్కరలేని నేత. ఉమ్మడి ఆంధ్రప్రేదశ్ నుంచి సంచనల రాజకీయాలు చేయడంలో దిట్ట.. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేసిన జేసీ.. రాష్ట్ర విభజనతో రాజకీయ ప్రభావం కోల్పోతున్నారు. అలాంటి జేసీ తెలంగాణ అసెంబ్లీకి వచ్చి తన పాత మిత్రులతో సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. తన హాట్‌ హాట్‌ కామెంట్లతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఇరకాటంలో పడేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చిన మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి..లాబీలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.


రాయల తెలంగాణ కావాలని జైపాల్ రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదన్నారు. తమ సొంత రాష్ట్రంలో రాజకీయాలు బాగాలేవని, సమాజం కూడా బాగాలేదని జేసీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సీఎల్పీ కార్యాలయంలో వెళ్లి కాంగ్రెస్ నేతలతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తానని జేసీ హాట్‌ కామెంట్‌ చేశారు. విభజన సమయంలో తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయామన్నారు. 


అయితే గతంలో ఓసారి అసెంబ్లీకి వచ్చిన సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కాసేపు ముచ్చటించారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో జేసీ సరదాగా మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు గురించి తన అభిప్రాయాలను ఆ నేతలతో జేసీ మొహమాటం లేకుండా మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గురించి కూడా స్పందించారు. టీడీపీ నేతగా ఉండి జేసీ కాంగ్రెస్ ను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అందుకే ఈసారి జేపీ సహజ స్వభావానికి భిన్నంగా తమ సొంత రాష్ట్రం ఏపీ రాజకీయాలపై మాట్లాడారు.


మొత్తానికి జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి తన హాట్‌ కామెంట్లతో ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించారు. మరోసారి రాయల తెలంగాణ నినాదాన్ని తెరపైకి తీసుకురావడంతో..ఇటు తెలంగాణలో అటు ఏపీలో జేసీ కామెంట్లు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. 

ఇవి కూడా చదవండిImage Caption