Apr 21 2021 @ 00:47AM

పవన్‌తో జేబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా!

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా వచ్చే ఏడాది ఓ సినిమా నిర్మించనున్నట్టు ‘చిత్రజ్యోతి’కి నిర్మాత జె. పుల్లారావు వెల్లడించారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె. భగవాన్‌తో కలిసి ఆయన చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘పవన్‌ కల్యాణ్‌గారితో సినిమా చేయాలనేది మా కల. కొన్నేళ్లుగా ఆ అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నాం. మంచి కథ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పవన్‌ చేస్తున్న చిత్రాలు పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది పక్కాగా చేస్తాం’’ అని జె. పుల్లారావు చెప్పారు. సాయితేజ్‌ కథానాయకుడిగా దేవ కట్టా దర్శకత్వంలో నిర్మించిన ‘రిపబ్లిక్‌’ విడుదల ముందుగా ప్రకటించినట్టు జూన్‌ 4న కాకుండా వాయిదా పడే అవకాశం ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్‌’ ఇటీవలే విడుదలైంది. థియేటర్లలో ఆడుతోంది. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, మలయాళ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌లో ఆయన నటిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఓ సినిమా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో మరో సినిమా అంగీకరించారు. ఆ చిత్రాల తర్వాత జేబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.