సదా స్మరణీయుడు జయశంకర్‌!

ABN , First Publish Date - 2020-08-07T06:56:02+05:30 IST

తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తన జీవితాంతం కృషి చేశారని, ఆయన సదా స్మరణీయుడని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ కొనియాడారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా గురువారం ఆయనను

సదా స్మరణీయుడు జయశంకర్‌!

  • సీఎం నివాళి.. తెలంగాణ భవన్‌లో జయంతి


హైదరాబాద్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తన జీవితాంతం కృషి చేశారని, ఆయన సదా స్మరణీయుడని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ కొనియాడారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా గురువారం ఆయనను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. జయశంకర్‌ ఆశించిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించడమే ఆయన ఆశయమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ప్రజాకవి కాళోజి నారాయణరావు చెప్పినట్టుగా.. జీవితాంతం తెలంగాణ కోసమే తపించిన మహామనిషి ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని మంత్రి హరీశ్‌ ట్వీట్‌ చేశారు. హోం మంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ, మంత్రులు సత్యవతి రాథోడ్‌, నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివా్‌సరెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ నేతలు జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అలాగే, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమ, ఏసీబీ డీజీ డా.జె.పూర్ణ చంద్రరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి తదితరులు జయశంకర్‌ చిత్ర పటానికి నివాళులర్పించారు. 

 జాగృతి గీతాన్ని ఆవిష్కరించిన కవిత

తెలంగాణ ఉద్యమ దిక్సూచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం పరితపించిన మహనీయుడు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి కార్యాలయంలో కవిత ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రత్యేక గీతాన్ని ఆమె ఆవిష్కరించారు. 


తొలిసారి రాజ్‌భవన్‌లో... 

జయశంకర్‌ జయంతి సందర్భంగా తొలిసారిగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు గవర్నర్‌  తమిళిసై  నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారి జయశంకర్‌ జయంతిని రాజ్‌భవన్‌లో నిర్వహించారు.

Updated Date - 2020-08-07T06:56:02+05:30 IST