జన హృదయాల్లో సదా జయశంకర్‌!

ABN , First Publish Date - 2021-08-06T08:46:20+05:30 IST

తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నికుడు, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌, తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచి ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

జన హృదయాల్లో సదా జయశంకర్‌!

ఆయన ఆశయాలను నెరవేరుస్తున్నాం

ఉద్యమం కోసం జీవితాన్నే అర్పించారు

తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళి.. నేడు జయశంకర్‌ 88వ జయంతి 


హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నికుడు, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌, తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచి ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం (ఆగస్టు 6) జయశంకర్‌ జయంతి సందర్భంగా తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగపూరిత సేవలను సీఎం స్మరించుకున్నారు. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే స్వయం పాలిత తెలంగాణ రాష్ట్రమని జయశంకర్‌ తెలిపారని, ఆయన ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సాధించిన ఏడేళ్లలోనే సాగునీరు, వ్యవసాయం వంటి రంగాల్లో మౌలిక వసతులను కల్పించామన్నారు. అదే పద్ధతిలో సకల జనుల సమున్నతాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


మిషన్‌ కాకతీయ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు, రైతుబంధు నుంచి దళితబంధు వరకు అనేక వినూత్న పథకాలను అమలు చేస్తోందన్నారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో దళితులు అభివృద్ధి చెంది, ఆత్మగౌరవంతో నిలబడేలా తోడ్పాటునందిస్తోందని చెప్పారు. బంగారు తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, జయశంకర్‌ కలలుగన్న తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.  కాగా జయశంకర్‌ సార్‌ 88వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే ప్రతి ఏటా ఆయన జయంతిని నిర్వహిస్తుండటం అనవాయితీగా వస్తోంది.

Updated Date - 2021-08-06T08:46:20+05:30 IST