Jul 26 2021 @ 18:49PM

Jayanthi: సావిత్రి కోపం మలుపు తిప్పింది!

బండపిల్లా ఏంటా నడక అన్నారు...

కె.విశ్వనాథ్‌ ప్రేమ గురువు

సావిత్రిగారే ఆరాధ్య నటి...


తల్లి, అక్క, వదిన ఈ తరహా పాత్రలు ఏదైనా గుర్తొచ్చే పేరు నటి జయంతి. ప్రతి వ్యక్తి జీవితానికీ  కొందరు స్ఫూర్తిగా నిలుస్తారు. కొందరి ప్రభావంతో ముందుకెళ్తుంటారు. అలాగే  తన కెరీర్‌ విజయవంతంగా ముందుకు సాగడానికి కారణమైన వ్యక్తులు తన తల్లి, కె.వి, రెడ్డి, కె.విశ్వనాథ్‌, ఎన్టీఆర్‌, సావిత్రి అని జయంతి చెప్పేవారు.


అమ్మే తొలి గురువు...

జయంతికి తొలి గురువు వాళ్ల అమ్మ సంతానలక్ష్మే. ఆవిడ ఆదర్శ భావాలు, సంస్కారం, ఇతరుల్ని ఆదరించే విధానం.. జయంతిని చిన్నతనంలోనే ఆకట్టుకొన్నాయి. వాటినే ఆమె ఫాలో అయ్యేవారు. అమ్మే తన తొలి గురువు అని జయంతి చెప్పేవారు. ‘కొడుకు పుడతాడని అమ్మ, నాన్న ఎదురుచూస్తుంటే నేను పుట్టాను. అందుకే నన్ను మగ పిల్లాడిలా పెంచారు’ అని నవ్వుతూ ఓసారి చెప్పారామె. చిన్నతనంలో  స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా కమలకుమారి (జయంతి అసలు పేరు) డాన్స్‌ ప్రోగ్రాం తప్పనిసరి. ఓసారి వార్షికోత్సవరంలో ‘మిస్సమ్మ’ సినిమాలో ‘బృందావనమది అందరిదీ’ పాటకు డాన్స్‌ చేశారు. . టీచర్లు మెచ్చుకున్నారు. కూతురి డాన్స్‌  చూసి  వాళ్లమ్మ తెగ మురిసిపోయింది.  నాట్యం నేర్పిస్తే ఇంకెంత బాగా చేస్తుందో అనుకుంది. వెంటనే మద్రాస్‌ తీసుకెళ్లి చంద్రకళ డాన్స్‌ స్కూల్లో చేర్చింది. ఆమె సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌కు చేస్తుండేవారు. ఓసారి కమలకుమారిని  షూటింగ్‌కు తీసుకెళ్తారు. సినిమా ప్రపంచాన్ని చూడడం ఆమెకు అదే మొదటిసారి. లైట్లు, కెమెరాలు, షాట్లు, డైలాగులు కొత్తగా అనిపించాయి. అక్కడే ఉన్న కన్నడ దర్శకుడు వై.ఆర్‌ స్వామి కమలకుమారిని గమనించారు.  ఆయన తీసే సినిమాలో ముగ్గురు కథానాయికలో ఓ పాత్ర కోసం ఆమెను అడిగారు. అప్పట్లో సినిమా వాళ్లంటే కాస్త చులకన భావం ఉండడంతో సంతానలక్ష్మి కాదనేశారు. . అయినా స్వామి ఊరుకోలేదు. పట్టుబట్టి నచ్చజెప్పి ఓకే చేశారు. ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత రెండో చిత్రం  ‘చంద్ర వళ్లియ తోట’తో నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. దాంతో అందరి  దృష్టిలో పడ్డారు జయంతి.


ఏంటమ్మా ఆ నడక అన్నారు

సినీ పరిశ్రమలో జయంతికి ఇద్దరు గురువులు ఉండేవారు. వారిలో  ఒకరు కె.వి.రెడ్డి. తెలుగులో ఆమె  నటించిన మొదటి చిత్రం ‘జగదేకవీరుని కథ’. అందులో  వరుణ దేవుడి కూతురి పాత్ర ఆమెది.  ఓ షాట్‌లో దేవకన్య ఆహార్యంతో వయ్యారంగా నడుచుకుంటూ రావాలి. జయంతి  మగరాయుడిలా  రావడంతో కె.వి.రెడ్డికి కోపం వచ్చి  కట్‌ చెప్పి ‘ఏంటమ్మా ఆ నడక?  చూడటానికి ముద్దుగా ఉన్నావు ఇలాగా నడిచేది’ అని విసుక్కున్నారు. ఎలా నడవాలో ఆయనే నడిచి చూపించారు. ఆ నడక చూస్తే ఆడవాళ్లు కూడా సిగ్గుపడాలి. నీళ్ల కొలనులో ఓ సీను చేసే సమయంలో జయంతికి  విపరీతంగా జ్వరం వచ్చింది. అప్పుడు ఆ నీళ్ల కొలనును కె.వి.రెడ్డి  వేడి నీళ్లతో నింపారు. ఆ సంఘటనతో ఆయనపై మరింత గౌరవం పెరిగింది. 


ప్రేమ గురువు ఆయనే...

‘జగదేశవీరుని కథ’ తర్వాత జయంతికి బాగా ఇష్టమైన సినిమా ‘సుమంగళి’. అందులో శోభనం రాత్రి పాటలో నటించారు.  ఆ పాట చిత్రీకరణలో భాగంగా శోభన్‌బాబు తన మీద చేయి వేయగానే పులకరించి మత్తు కళ్లతో, శృంగార రసం ఒలికించేలా చూడాలి. జయంతికి  ఎలా నటించాలో అర్థం కాక.. అలా చూస్తూ ఉండిపోయారు.  దాంతో ఆ సినిమాకు  అసోసియేట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తున్న కె.విశ్వనాథ్‌ ఆమె  దగ్గరకు వెళ్లి  ‘ఏయ్‌.. బండపిల్లా.. ఏంటి అలా నిల్చుంటావ్‌? అబ్బాయి చేయి ఒంటిమీద పడగానే ఎలా పులకరించాలో తెలీదా?’ అన్నారు. ‘నాకు తెలియదు సర్‌’ అనడంతో ఆయనే  జయంతికి  నటనకు సంబంధించిన అంశాలు నేర్పించారు. అందుకే ఆయనను తన  ప్రేమ గురువుగా భావించేవారు జయంతి.  


ఎస్వీఆర్‌తో పోటీగా...

‘భానుమతి, సావిత్రి, ఎస్వీరంగారావుతో స్ర్కీన్‌ పంచుకుంటే చాలనే ఆశ జయంతిలో  ఎక్కువగా ఉండేది.  ఎస్వీఆర్‌తో  ‘సంసారం సాగరం’లో నటించారు. ఆయనకంటే బాగా నటించాలని సెట్‌లో పోటీ పడేవారు. అలాగే  కృష్ణ, కృష్ణంరాజు, కాంతారావులతో ఎన్నో చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజుతో  ఆమె నటించిన   చివరి సినిమా ‘విధాత’. కృష్ణ విషయానికి వేస్త ఆయనతో కలిసి నటించిన ‘రక్తసంబంధం’, ‘మాయదారి మల్లిగాడు’, ‘కుమార్‌రాజా’  తన  హృదయానికి చేరువైన సినిమాలు అని చెప్పారు.  ‘మాయదారి మల్లిగాడు’ సినిమాలోని ‘మల్లెపందిరి నీడలోనే జాబిల్లి’ పాట వింటే ఇప్పటికీ  కన్నీళ్లు వచ్చేస్తుంటాయి’’ అని జయంతి ఓ సందర్భంలో తెలిపారు. 


సావిత్రి కోపం మలుపు తిప్పింది...

జయంతి ఆరాధించే  నటి సావిత్రి. ఆమెతో జరిగిన ఓ సంఘటన గురించి జయంతి పదేవదే  చెప్పేవారు. అదేమిటంటే..  ఏ భాషలో నటించినా డబ్బింగ్‌ తనే చెప్పడం జయంతికి అలవాటు.  అలా ఒకసారి  ఓ తమిళ సినిమా అవకాశం వచ్చింది.  తనకు తమిళం రాదని మొదట తిరస్కరించారు జయంతి.  మేం మేనేజ్‌ చేస్తాం అని దర్శకుడు ఆమెను ఒప్పించారు. అందులో సావిత్రి హీరోయిన్‌. చిన్న చిన్న డైలాగులు చెప్పగలిగినా  తమిళం రాక పెద్ద డైలాగ్‌ చెప్పడానికి జయంతి తడబడ్డారు.  అంతే సావిత్రికి  కోపం వచ్చేసింది. డైరెక్టర్‌ను పిలిచి ‘భాష రాని వాళ్లను ఎందుకు పెట్టుకుంటారు?  వాళ్లతో అందరికీ ఇబ్బందులు వస్తాయి’ అని చెప్పేసరికి జయంతికి  ఏడుపు ఒకటే తక్కువ. ఇంతలో అసోసియేట్‌ డైరెక్టర్‌ వచ్చి  కో డైరెక్టర్‌ ‘షాట్‌ రెడీ’  అన్నారు. ‘నేను ఈ సినిమా చేయడం లేదు.  తమిళం వచ్చాకే తమిళ సినిమాలు చేస్తాను. నా వల్ల మీకేమైనా నష్టం వాటిల్లితే... చెప్పండి పరిహారం చెల్లిస్తాను’ అని చెప్పి కోపంగా సెట్‌లోంచి బయటకు వచ్చేశారు.  ఆ తర్వాత తమిళ టీచర్‌ను పెట్టుకుని  పట్టుదలతో ఆ  భాష నేర్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు  ఓ కన్నడ సినిమా కోసం సావితి బెంగుళూరు వచ్చారు. అందులో జయంతి హీరోయిన్‌ని.  సావిత్రిని కలసి ఆమె కాళ్లకు నమస్కరించారు జయంతి.  ఆమె  లేవదీసి ‘జయంతి ఇక్కడ నువ్వు పెద్ద హీరోయిన్‌ అని విన్నాను. నువ్వు నా కాళ్ల మీద పడడం ఏంటి?’ అని అడిగారు. . ‘మీరు నా ఆరాధ్య నటి. మీ వల్లే నాకు తమిళం వచ్చింది. నేను తమిళ సినిమాలు కూడా చేస్తున్నా’ అని చెప్పగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి..