ఎన్నాళ్లీ నాన్చుడు!

ABN , First Publish Date - 2022-08-09T06:34:40+05:30 IST

కోట్లాది డిపాజిట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన జయలక్ష్మి సొసైటీ నిర్వాహకులపై ఎటువంటి చర్యల్లేవు. బోర్డు తిప్పేసి నాలుగు నెలలు దాటినా నేటికీ సొసైటీ యాజమాన్యం ఆచూకీ జాడను తెలుసుకోకపోవడం, విచారణ ఎంతవరకు వచ్చిందనే దానిపై స్పష్టత లేకపోవడంపట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నాళ్లీ నాన్చుడు!

  • కోట్లు కొట్టేసిన జయలక్ష్మి సొసైటీపై చర్యలు శూన్యం
  • డిపాజిటర్ల డబ్బులు అంతేనా
  • ఏప్రిల్‌ 6న బోర్డు తిప్పేశారు
  • పరారీలో నిందితులు
  • నాలుగు నెలలైనా కానరాని పురోగతి
  • కేసు సీబీసీఐడీకి అప్పగింత

సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 8: కోట్లాది డిపాజిట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన జయలక్ష్మి సొసైటీ నిర్వాహకులపై ఎటువంటి చర్యల్లేవు. బోర్డు తిప్పేసి నాలుగు నెలలు దాటినా నేటికీ సొసైటీ యాజమాన్యం ఆచూకీ జాడను తెలుసుకోకపోవడం, విచారణ ఎంతవరకు వచ్చిందనే దానిపై స్పష్టత లేకపోవడంపట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది అక్రమాల నేపథ్యంలో బాధితుల డిమాండ్‌ మేరకు కేసును ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించారు. సత్వరంగా విచారణ నిర్వహించి సొసైటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లతోపాటు డైరెక్టర్లను అరెస్ట్‌ చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు.

జయలక్ష్మి సొసైటీ బోర్డు తిప్పేసి నాలుగు నెలలు దాటింది

కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం జంక్షన్‌లో సెంట్రల్‌ కార్యాలయంగా 1999లో ది జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌ లిమిటెడ్‌ 95 మ్యాక్స్‌ చట్టం కింద ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో 29 బ్రాంచీల ద్వారా 19,911 మంది సభ్యుల నుంచి రూ.520కోట్ల పైబడి డిపాజిట్లు సేకరించారు. అనంతరం సొసైటీ చైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ ఆర్‌బీ విశాలక్ష్మితోపాటు 11మంది డైరెక్టర్లు కోట్లాది డిపాజిట్లను దారిమళ్లించి ఏప్రిల్‌ 6న బోర్డు తిప్పేసి డిపాజిట్ల నెత్తిన శఠగోపం పెట్టారు. బాధితులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టడంతో ఈ అక్రమాలపై డిస్ట్రిక్ట్‌ సహకారశాఖ అధికారి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ రిజిస్టార్లతో విచారణకు ఆదేశించింది. ఏప్రిల్‌ 18న విచారణ ప్రారంభించిన అధికారులు సొసైటీకి చెందిన ఆర్థిక వ్యవహారాలకు చెందిన పలు రికార్డులను పరిశీలించిన తర్వాత సొసైటీలో పెద్దఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. సొసైటీ వైస్‌చైర్మన్‌ విశాలక్ష్మి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఏకంగా రూ.64కోట్ల రుణంతోపాటు ఎటువంటి పూచీకత్తు, ఆధారాలు లేకుండా బినామీల పేర్లతో మరో రూ.135కోట్లు అక్రమంగా రుణం తీసుకుని వాడేసుకున్నట్లు గుర్తించారు. మిగతా నిధుల డిపాజిట్లకు చెందిన వాటిపై స్పష్టత లేకపోవడం, అడ్డగోలుగా ఎటువంటి తనఖాల్లేకుండా విరివిగా రుణాలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. డిపాజిట్ల అక్రమాలపట్ల విశాఖకు చెందిన రావు అండ్‌ రావు, కాకినాడకు చెందిన బ్రహ్మయ్య చార్టెర్డ్‌ అకౌంటెంట్‌లు ఇచ్చిన తప్పుడు నివేదికలను విచారణ నిర్వహించిన రిజిస్ట్రార్ల బృందం గుర్తించారు. నష్టాల్లో ఉన్న సొసైటీని లాభాల్లో ఉన్నట్లు వీరిద్దరు నివేదిక ఇచ్చినట్లు గుర్తించి వీరి నుంచి వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు నివేదించారు. జయలక్ష్మి సొసైటీ పేరుపై సర్పవరం జంక్షన్‌లోఉన్న సెంట్రల్‌ కార్యాలయం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. సొసైటీ అక్రమాల బాగోతంలో డీసీసీబీలో పని చేసిన 30మంది సిబ్బందికి కూడా సొసైటీలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో  భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది.

పత్తా లేకుండా పోయిన యాజమాన్యం

జయలక్ష్మి సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆంజనేయులు, విశాలక్ష్మిలతోపాటు 11మంది డైరెక్లర్ల ఆచూకీని నేటికీ పోలీసులు కనుక్కోకపోవడంపట్ల బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఈ కేసు దర్యాప్తు కోసం కాకినాడ డీఎస్పీ ఆధ్వర్యంలో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. సహకారశాఖ అధికారులు, పోలీసుశాఖ అధికారులతో కాకుండా బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా సీబీసీఐడీకి ఈ కేసును అప్పగించాలన్న బాధితుల డిమాండ్‌కి తలొగ్గిన ప్రభుత్వం జూన్‌ 30న సీబీసీఐడీకి జయలక్ష్మి కేసు విచారణ బాధ్యతలను అప్పగించింది. ఈ కేసుకు చెందిన అన్ని ఫైల్స్‌, ఆధారాలను పోలీసులు, అధికారులు తీసుకెళ్లి విశాఖలోని కార్యాలయానికి అందించారు. 

తాత్కాలిక కమిటీ ఏర్పాటు

కోట్లాది నిధులతో పరారైన జయలక్ష్మి సొసైటీ మూతపడడంతో కార్యకలాపాల నిర్వహణకోసం, అధికారులకు సమాచారం అందించేందుకు వీలుగా అక్ర మాలకు పాల్పడిన పాత పాలకవర్గాన్ని రద్దు చేసి నూతనంగా జయలక్ష్మి సొసైటీకి తాత్కాలిక కమిటీని జూలై 22న మహాజన సభలో సభ్యులు ఎన్నుకున్నారు. రాష్ట్ర సహకారశాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు ఆదేశాల మేరకు జిల్లా సహకార శాఖ అధికారి బీకే దుర్గాప్రసాద్‌ పర్యవేక్షణలో సమావేశం ఏర్పాటు చేశారు. సొ సైటీ తాత్కాలిక కమిటీ అధ్యక్షులుగా వీఎస్‌వీ సుబ్బారావుతోపాటు పదిమందిని ఎన్నుకున్నారు. ఈ కమిటీ నెలరోజులపాటు తమ కార్యకలాపాలు నిర్వహిం చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. తర్వాత మళ్లీ కార్యవర్గం కాలం పొడిగించేందుకు ఈనెల రెండోవారంలో మరోసారి మహాజనసభ ఏర్పాటుకు చర్య లు తీసుకుంటున్నట్లు జయలక్ష్మి సొసైటీ తాత్కాలిక చైర్మన్‌ సుబ్బారావు తెలిపారు. రిజిస్ట్రార్‌నుంచి నివేదిక కొద్దిరోజుల్లో వచ్చే అవకాశం ఉందని, ఆ నివేదికను సహకారశాఖ అధికారులు సొసైటీ తాత్కాలిక కమిటీకి అందించే అవకా శం ఉంది. జనరల్‌ బాడీలో నివేదికను పెట్టి సభ్యులకు వివరించిన అనంతరం ట్రిబ్యునల్‌లో కేసు నమోదు చేసేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.

Updated Date - 2022-08-09T06:34:40+05:30 IST