జయహో నీలకంఠేశ్వరా!

ABN , First Publish Date - 2022-01-20T05:42:53+05:30 IST

ఎమ్మిగనూరు భక్తజన సంద్రమైంది.

జయహో నీలకంఠేశ్వరా!
ఆశేష భక్తజనం మధ్య నీలకంఠుడి రథోత్సవం

మహా రథంపై ఊరేగిన ఆది దంపతులు

ఎమ్మిగనూరు/టౌన్‌, జనవరి 19: ఎమ్మిగనూరు భక్తజన సంద్రమైంది. నీలకంఠ నామస్మరణతో పావనమైంది. బుధవారం సాయంకాలం తేరుబజారులో నీలకంఠేశ్వరుడి మహా రథోత్సవం కన్నులపండువగా సాగింది. ముందుగా వేదపండితులు ఆది దంపతులను మహా రథంపైకి చేర్చారు. సరిగ్గా 5.48 గంటలకు ఒక్కసారిగా వేలగొంతులు జయహో నీలకంఠేశ్వరా.. శంభో శంకరా అంటూ నినదించాయి. మహా రథానికి కట్టిన ఇనుక గొలుసులను భక్తులు లాగారు. రథం ముందుకు సాగింది. రథ చక్రాలు 5.53 గంటలకు మార్కండేయుడి సన్నిధానానికి చేరుకున్నాయి. అక్కడ పూజలు చేసి 6.04 గంటలకు రథాన్ని యథాస్థానానికి చేర్చారు. రథంపై నుంచే పూజారులు హారతి ఇచ్చారు. గుమ్మడికాయ బలి ఇవ్వడంతో ఈ పుణ్యకార్యం ముగిసింది. రథంపై కలశాన్ని చూస్తే పుణ్యం వస్తుందని నవ దంపతులు ఈ కార్యక్రమానిక దూర ప్రాంతాల నుంచి తరలిరావడం ఆనవాయితీ. మహారథంపై ఆదిదంపతుల ఊరేగింపు కళ్లారా చూసి పులకించాలని జిల్లా నలుమూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు.


ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ధర్మకర్త నీలకంఠప్ప నాగరాజు ఆధ్వర్యంలో ఆలయం నుంచి ఉత్సవమూర్తులను పల్లకిలో రథం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. రథం ముందు వేదపండితులు హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2022-01-20T05:42:53+05:30 IST