Abn logo
Jan 16 2021 @ 03:37AM

జయహో!

ఇకప్రతిఘటన మొదలవుతున్నది. ఇంతకాలం దాడిని స్వీకరించడం, ఉన్న శక్తితో పోరాడడం, ఉన్న సాధనాలతో కాపాడుకోవడం, లేదంటే ఓడిపోవడం-.. ఇదే మనుషులు చేయగలిగింది. ప్రపంచం మొత్తం మీద పదికోట్ల మంది ఈ దాడిని ఎదుర్కొన్నారు. 20 లక్షల మంది చనిపోయారు. ఈ మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కొన్ని చోట్ల తగ్గినా, మరి కొన్ని చోట్ల విజృంభణలోనే ఉన్నది. దీని నుంచి ఎట్లా విముక్తం చెందాలా అని ప్రపంచమంతా ఆలోచించింది. విరుగుడును కనిపెట్టడానికి వేగంగా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలలో కొన్ని మంచి ఫలితాన్ని ఇచ్చాయి. సాగరమథనం తరువాత ఇప్పుడిక అమృతాన్ని అందరికీ పంచాలి. అది మనిషి శరీరాన్ని కంచుకోటగా మలచి, శత్రువుని నిర్వీర్యం చేయాలి. 


కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించి ఇంకా ఏడాది కూడా కాలేదు. పది నెలల కిందట నిప్పురవ్వలాగా నెమ్మది నెమ్మదిగా చిటపటలాడిన ప్రాణాంతక వ్యాధి కొవిడ్–19, అతి త్వరలోనే దావానలంగా వ్యాపించింది. అమెరికాలో యూరప్‌లో చేసినంత ప్రాణవిధ్వంసం భారతదేశంలో చేయలేదు కానీ, ఇక్కడా జరిగింది తక్కువేమీ కాదు. పైగా, మన దేశంలో లెక్కలకు నూటికి నూరుశాతం విశ్వసనీయత లేదు. కోటీ యాభైలక్షల మంది భారతదేశంలో ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సమయానికి భారత్‌లో మరణాల సంఖ్య లక్షన్నర దాటింది. ఇంకా రెండు లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకోవలసి ఉన్నది. వ్యాధి సోకిన వారందరూ గణనకు ఎక్కకపోయి ఉండవచ్చు. పూర్వ అనారోగ్యాలుండి కరోనాతో మరణించినవారిని, కోలుకున్న అనంతరం అనారోగ్యంతో మరణించిన వారిని అనేకచోట్ల కొవిడ్ మరణాల ఖాతాలో చేర్చనందున మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండి ఉండవచ్చు. ఏది ఏమయితేనేం, ప్రపంచంలో ఈ గత్తర చేసిన బీభత్సంతో పోలిస్తే, భారత్ తక్కువ ప్రాణనష్టంతోనే బయటపడిందని చెప్పాలి. కొవిడ్–19ను ఎదుర్కొనే క్రమంలో దేశం ఎదుర్కొన్న ఆర్థిక, సామాజిక సమస్యల సంగతి వేరు. ఆ నష్టం తీవ్రమైనది, లోతైనది. 


రోగనిరోధక శక్తి ఒక్కటే కరోనా సోకిన రోగులను రక్షించగా, ఉనికిలో ఉన్న వివిధ ఔషధాలు పాక్షికంగా మాత్రమే సహకరించాయి. ప్రధానంగా శ్వాసకోశ వ్యాధి అయినందున, బలహీనులకు ఒకసారి శరీరంలోకి వచ్చిన వ్యాధివైరస్, ఆయువుపట్ల మీద దాడి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే, యాంటీబాడీలను సమృద్ధం చేసే నిరోధకం కావాలి. అందుకు గాను టీకా పరిశోధనలు జరిగాయి. అనేక దేశీయ, అంతర్జాతీయ టీకా మందులు రంగం మీదికి వచ్చాయి కానీ, భారతదేశంలో దేశీయంగా రూపొందించిన కోవాగ్జిన్, దేశీయంగా తయారుచేస్తున్న కోవిషీల్డ్, అమెరికన్ కంపెనీ ఫైజర్ ఉత్పత్తి చేస్తున్న టీకామందు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. శనివారం నాడు దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా కేంద్రాలలో, 3 లక్షల మంది లక్ష్యంగా ప్రారంభిస్తున్న టీకా కార్యక్రమంలో దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండూ ఉపయోగిస్తున్నారు. కరోనా ఉత్పాతం సమయంలో కూడా తమ రాజకీయ, పాలనా విధానాల విషయంలో ఏ మాత్రం సడలింపు చూపని నరేంద్రమోదీ ప్రభుత్వం, టీకా కార్యక్రమం కూడా తన మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా ఉండేట్టు చూసుకున్నది. 


మందును, దానికి అవసరమైన ప్రయోగాలను శీఘ్రంగా చేయవలసి రావడం వల్ల, తాజా దశ ప్రయోగాలు ఇంకా జరుగుతూనే ఉన్నందున టీకా కార్యక్రమం విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. ముందువరసలో నిలబడి వ్యాధితో యుద్ధం చేస్తున్న ఆరోగ్య, పారిశుద్ధ్య కార్యకర్తలకు, వయోధికులకు ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం సరి అయినదే. అయితే, వారికి కూడా ఒకేసారి ఇవ్వడం కాకుండా, నెమ్మదిగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రారంభ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది టీకా మందు స్వీకరించినవారి ప్రతిస్పందనలను పరిశీలించడం, ఎక్కడైనా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తే వాటికి చికిత్సచేయడం, మొత్తం ప్రక్రియను అధ్యయనం చేస్తూ సవరణలను ప్రతిపాదించడం చేస్తారు. ప్రజలలో టీకామందుపై అపోహలు తొలగించి, వారిని సన్నద్ధం చేయడం కూడా ముఖ్యం. దేశవ్యాప్తంగా టీకాకార్యక్రమం అవసరమైన ప్రతి ఒక్కరికీ చేరడానికి కనీసం ఆరునెలలైనా పడుతుందని అనుకుంటున్నారు.


టీకా మందు వేయడం, తక్షణ ప్రతిక్రియలను పరిశీలించడం మాత్రమే సరిపోదు. మందు వల్ల యాంటీబాడీల ఉత్పత్తి ఏ మేరకు జరుగుతున్నది, అవి ఎంతకాలం వరకు రక్షణ కల్పిస్తాయి అన్న అంశాలను కూడా పరిశీలించవలసి ఉంటుంది. ఈ వైరస్, దానివల్ల వచ్చిన వ్యాధి రెండూ కొత్తవే కాబట్టి, పూర్వానుభవం ఉండదు. కొవిడ్ వ్యాధి గ్రస్తులైనవారు కోలుకున్న అనంతరం ఏమేమీ సమస్యలను ఎదుర్కొంటున్నదీ ఇంకా పరిశీలనలోనే ఉన్నది. తొలిరోజుల్లోనే వ్యాధి సోకి కోలుకున్న వ్యక్తి గడిపిన అనంతర జీవితం అత్యధికంగా పదినెలలు మాత్రమే. ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆరోగ్యసమస్యలు మాత్రమే వారు చెప్పగలరు. వారు ఎంతకాలం తగుజాగ్రత్తలతో ఉండాలో ఇప్పటికీ చెప్పలేని స్థితి. ఒక పక్క టీకా మందు కార్యక్రమం నడుస్తుండగా, మరో వైపు వైరస్ కు సంబంధించిన కొత్త రకం రూపొందితే అదొక కష్టం. టీకా కార్యక్రమం ప్రారంభానికి ముందు రోజు కూడా 16 వేల మంది దేశంలో కొత్తగా వైరస్ బారిన పడ్డారు. కాబట్టి, వ్యాప్తిలో ఉన్న వైరస్ విషయంలో అప్రమత్తత కొనసాగవలసిందే.


ఇదొక మహా యజ్ఞం. అనేక లక్షల మంది సమన్వయంతో చేయవలసిన కార్యక్రమం. అక్కడక్కడా లోపాలు జరగవచ్చు. అత్యంత అరుదుగా ఎక్కడైనా ప్రతిక్రియలు కనిపించవచ్చు. ప్రజలు సహకరించాలి. దేశంలోని వైద్య, ఆరోగ్య వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగాలు నిర్వహిస్తున్న ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, దేశానికి ఆరోగ్యాన్ని సాధించాలి.

Advertisement
Advertisement
Advertisement