‘హిందీ’పై రంధి.. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది..!

ABN , First Publish Date - 2022-04-29T09:43:06+05:30 IST

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ మధ్య జాతీయ భాషపై జరిగిన ట్వీట్ల చర్చ రాజకీయ రంగు పులుముకుంది.

‘హిందీ’పై రంధి.. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది..!

  • జాతీయ భాష కాదన్న కన్నడ నటుడు సుదీప్‌ 
  • పాన్‌ ఇండియా స్థాయిని కోలీవుడ్‌ దాటేసిందని వ్యాఖ్య 
  • కన్నడ చిత్రాలను హిందీలోకి ఎందుకు డబ్‌ చేస్తున్నారు? 
  • ట్విటర్‌ వేదికగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ ప్రశ్న 
  • దేవగన్‌ వ్యాఖ్యలపై కన్నడ నాట తీవ్ర ఆగ్రహం 
  • సుదీప్‌కు సీఎం, కుమారస్వామి, సిద్ధరామయ్య మద్దతు 
  • పలుచోట్ల అజయ్‌ దేవగన్‌ దిష్టిబొమ్మల దహనం 
  • ఉత్తరాది నటులకు అసూయ: దర్శకుడు ఆర్జీవీ 


బెంగళూరు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ మధ్య జాతీయ భాషపై జరిగిన ట్వీట్ల చర్చ రాజకీయ రంగు పులుముకుంది. పార్టీలకు అతీతంగా కీలక రాజకీయ నేతలు సుదీ్‌పకు మద్దతు పలికారు. అజయ్‌ వ్యాఖ్యలను కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మైతో పాటు మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. అజయ్‌ దేవగన్‌ నోట బీజేపీ భాష వినబడుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందీ జాతీయ భాష కానే కాదని, దేశంలో ఉన్న అనేక భాషల్లో అదీ ఒకటి మాత్రమేనని పలువురు నేతలు స్పష్టం చేశారు.


బొమ్మై, సిద్దరామయ్య, కుమారస్వామి, డీకే మద్దతు 

వీరిద్దరి ట్వీట్లపై కన్నడనాట కలకలం రేగింది. సీఎం బొమ్మై సహా ప్రధాన ప్రతిపక్ష నేతలంతా సుదీ్‌పకు మద్దతు పలికారు. ‘‘సుదీప్‌ చెప్పింది కరెక్ట్‌. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత ఆయా ప్రాంతాల్లో భాషలకు ప్రాధాన్యం వచ్చింది. దీన్ని అందరూ అంగీకరించాలి, గౌరవించాలి’’ అని సీఎం బసవరాజ బొమ్మై గురువారం హుబ్బళ్లిలో పేర్కొన్నారు. ‘‘హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదు. దేశంలో భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి విధి. ప్రతి భాషకు దాన్ని మాట్లాడే ప్రజలు గర్వించదగిన చరిత్ర ఉంటుంది. నేను కన్నడిగుడిని అయినందుకు గర్విస్తున్నాను’’ అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత సిద్దరామయ్య ట్వీట్‌ చేశారు. ‘‘హిందీ జాతీయ భాష కాదని సుదీప్‌ చెప్పడం సరైనదే. మొదటి నుంచీ కేంద్రంలోని ‘హిందీ’ ఆధారిత రాజకీయ పార్టీలు ప్రాంతీయ భాషలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.


ఎక్కువమంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష కాదు’’ అని జేడీఎస్‌ నేత కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగమేనని వ్యాఖ్యానించారు. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే భాష, ఒకే ప్రభుత్వం అనే బీజేపీ హిందీ జాతీయ వాదానికి ప్రతినిధిగా అజయ్‌ మాట్లాడారంటూ ఎదురుదాడికి దిగారు. బీజేపీ నాటిన ఒక విత్తనం దేశాన్ని విభజించే అంశంగా మారిందని, దేశ ఐక్యతకే ముప్పుగా పరిణమించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దేశంలో 19,500 భాషలు మాట్లాడుతున్నారు. భారతదేశంపై మా ప్రేమ ప్రతి భాషలోనూ ఒకేలా కనిపిస్తుంది. ఒక భాషపై మరొకటి ఆధిపత్యం చెలాయించకుండా కాంగ్రెస్‌ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది’’ అని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అన్నారు. ‘‘భారతదేశ కరెన్సీ నోటుపైనా చాలా భాషలున్నాయి. మనం అన్ని భాషలను గౌరవించాలి. వీటిలో ఏదో ఒకటి జాతీయ భాషగా ఎందుకు? తాము ఏది మాట్లాడాలో ప్రజలనే ఎంపిక చేసుకోనివ్వండి’’ అని జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు.


అజయ్‌ క్షమాపణ చెప్పాలి: కన్నడ సంఘాలు 

అజయ్‌ దేవగన్‌ చేసిన ట్వీట్‌ కన్నడ నాట ప్రకంపనలు సృష్టిస్తోంది. కన్నడ సంఘాలు గురువా రం రాష్ట్రవ్యాప్తంగా అజయ్‌ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. అజయ్‌ తక్షణం సుదీ్‌పకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి.


బాలీవుడ్‌ నటుల్లో అభద్రత: ఆర్జీవీ

దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లు రాబడుతుండటం తో బాలీవుడ్‌ నటులు అభద్రత, అసూయతో ఉన్నారని ప్ర ముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ‘‘కేజీఎఫ్‌-2 రూ.50కోట్ల ఓపెనింగ్‌ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్‌ చేయడంతో దక్షిణాది నటులపై ఉత్తరాది నటులు అసూయతో ఉన్నారనేది కాదనలేని నిజం. ఇకపై బాలీవు డ్‌ చిత్రాల కలెక్షన్లు ఎలా ఉంటాయో చూద్దాం. ‘రన్‌వే 34’ కలెక్షన్లతో బంగారం బాలీవుడ్‌లో ఉందో, కన్నడలో ఉందో తేలిపోతుంది’’ అని వర్మ ట్వీట్‌ చేశారు. 


వివాదం ఇలా మొదలైంది..

దక్షిణాది సినిమాలు బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతున్నాయని, హిందీలోకి డబ్‌ అయి బాలీవుడ్‌ సినిమాల కంటే ఎక్కువగా వసూళ్లు రాబడుతున్నాయని ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న కిచ్చా సుదీప్‌ వ్యాఖ్యానించారు. ‘‘కన్నడ చిత్ర పరిశ్రమ పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలు నిర్మిస్తోందని కొందరు అంటున్నారు. అయితే అందులో నిజం లేదు. పాన్‌ ఇండియా కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను అలరించేలా మనం చిత్రాలు తెరకెక్కిస్తున్నాం. ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు. హిందీ వారే ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రాలు రూపొందిస్తున్నారు. వాటిని దక్షిణాది భాషల్లో డబ్‌ చేసి విడుదల చేస్తున్నా విజయాన్ని అందుకోలేకపోతున్నారు’’ అని సుదీప్‌ చేసిన వ్యాఖ్యలపై అజయ్‌ దేవగణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సోదరా... మీ ఉద్దేశం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు మీరెందుకు మీ చిత్రాలను హిందీలో డబ్‌ చేస్తున్నారు? జాతీయ భాషగా హిందీ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ అదే ఉంటుంది. జనగణమన’ అంటూ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. దీనిపై సుదీప్‌ స్పందించారు. తాను మాట్లాడిన మాటలు అనువాదం లోపాల కారణంగా తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.


‘‘అజయ్‌ సర్‌... మీరు హిందీలో చేసిన ట్వీట్‌ నాకు అర్థమైంది. మేం హిందీని గౌరవించాం. నేర్చుకున్నాం. అందుకే మీరు హిందీలో చేసిన ట్వీట్‌ను నేను చదవగలిగా. నేను ఎవరినీ కించపరిచేలా అలా అనలేదు. అదే నా సమాధానాలను కన్నడలో రాస్తే పరిస్థితి ఏమిటి సర్‌? మన దేశ భాషలన్నింటిపైనా నాకు గౌరవం ఉంది. త్వరలో మిమ్మల్ని కలిసి, అసలు ఏం జరిగిందో వివరిస్తాను. ఎవరినీ బాధపెట్టడం, రెచ్చగొట్టడం, ఇలాంటి చర్చను ప్రారంభించడం నా ఉద్దేశం కాదు’’ అని సుదీప్‌ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-04-29T09:43:06+05:30 IST