సురక్షితంగా క్యాంప్‌కు చేరుకున్న జవాన్ రాకేశ్

ABN , First Publish Date - 2021-04-09T00:46:05+05:30 IST

మావోయిస్టులకు బంధీగా చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ను క్షేమంగా విడిచిపెట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలోని

సురక్షితంగా క్యాంప్‌కు చేరుకున్న జవాన్ రాకేశ్

బీజాపూర్: మావోయిస్టులకు బంధీగా చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ను క్షేమంగా విడిచిపెట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో రాకేశ్వర్‌సింగ్‌ను మావోలు వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆయన్ను బీజాపూర్‌లోని సీఆర్‌ఫీఎఫ్ క్యాంపుకు తరలించారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు బంధీగా పట్టుకున్నారు. జవాన్ క్షేమంగా ఉన్నాడని, చర్చలకు ప్రతినిధి బృందాన్ని పంపితే విడుదల చేస్తామని మావోలు అధికారిక ప్రకటన చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనూహ్యంగా మావోయిస్టులు రాకేశ్వర్‌సింగ్‌ను వదిలిపెట్టారు.


రాకేశ్వర్‌ క్షేమంగా ఉన్నాడని రెండు రోజుల కిందట మావోయిస్టులు ఓ ఫొటోను విడదల చేశారు. అయితే ఆ ఫొటో పాతదని జవాన్ కుటుంబసభ్యులు ప్రకటించారు. తక్షణం రాకేశ్ క్షేమ సమాచారం చెప్పాలని వేడుకున్నారు. ఈ లోపు మావోయిస్టులపై దెబ్బకు దెబ్బ తీయాలని కసితో ఉన్న సీఆర్‌ఫీఎఫ్ అధికారులు అందుకోసం పెద్ద ఎత్తున దాడికి ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పరిస్థితులను తేలిక పరిచేందుకు రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టు వదిలివేసినట్లుగా అంచానా వేస్తున్నారు. రాకేశ్వర్‌సింగ్‌ను విడిపించేందుకు నలుగురు స్థానిక జర్నలిస్టులను మావోయిస్టుల వద్దకు బస్తర్ ఐజీ  పంపారు. జవాన్‌కు విముక్తి కల్పించినట్టు ఐజీకి జర్నలిస్టులు సమాచారమిచ్చారు. 



Updated Date - 2021-04-09T00:46:05+05:30 IST