ముంచుకొస్తోంది..!

ABN , First Publish Date - 2021-12-03T06:35:16+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని అండమాన్‌ సముద్రంలో ఏర్ప డ్డ అల్పపీడనం గురువారం బలపడింది. ఇది వాయువ్య దిశలో కదులుతూ శనివారం ఉదయానికి బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

ముంచుకొస్తోంది..!
ఉప్పాడ వద్ద సముద్రం అలల ఉధృతి.. (ఇన్‌సెట్లో) తీరం వైపు దూసుకువస్తున్న అల్పపీడన ద్రోణి

  • తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా హైఅలర్ట్‌
  • నేటి నుంచి ఆదివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రమాదం
  • గంటకు 90 కి.మీ. వేగం వరకు పెనుగాలులు వీస్తాయని హెచ్చరిక జారీ
  • శనివారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌
  • కలెక్టరేట్‌సహా అన్ని ఆర్డీవో, సబ్‌కలెక్టర్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌రూమ్‌లు
  • అన్ని కీలక శాఖల్లో అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు
  • పూరిళ్లు, పెంకుటిళ్లలో ఉండే వారంతా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని దండోరా
  • అత్యవసరమైతే మినహా ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచన
  • విశాఖ మీదుగా జిల్లాకు రావలసిన పదుల సంఖ్యల్లో రైళ్లన్నీ నేడు, రేపు రద్దు

జావద్‌ తుపాను ముప్పు ముంచుకు వస్తుండడంతో జిల్లావ్యాప్తంగా అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. దీని ప్రభావం శుక్ర, శనివారాల్లో జిల్లాపై తీవ్రంగా ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా శనివారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలు కూడా బయటకు రావద్దని పేర్కొన్నారు. కలెక్టరేట్‌తోపాటు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేశారు. అన్ని కీలక శాఖ అధికారులు, సిబ్బందికి సెలవులు సైతం రద్దు చేశారు. కాగా తుపాను నేపథ్యంలో విశాఖ నుంచి జిల్లా మీదుగా ప్రయాణించాల్సిన కీలక రైళ్లన్నింటిని రైల్వే శాఖ రెండు రోజులు రద్దు చేసింది. రైతులు వరి కోయవద్దని ఇప్పటికే గ్రామాల్లో దండోరా వేయించారు. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని అండమాన్‌ సముద్రంలో ఏర్ప డ్డ అల్పపీడనం గురువారం బలపడింది. ఇది వాయువ్య దిశలో కదులుతూ శనివారం ఉదయానికి బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇది ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాన్ని తాకనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు బలమైన ఈదురుగాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి జిల్లా తీరప్రాంతం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయని అంచనా. ఇది మరింత బలపడి శనివారం ఉదయం నుంచి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో భారీగాలులు వీయనున్నట్టు హెచ్చరికలు జారీ అయ్యాయి. అదే సమయంలో శుక్ర, శనివారాల్లో జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులను రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో తుపాను ముప్పుపై గురువారం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని, మత్స్యకార గ్రామాల్లో తక్షణం దండోరా వేయించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారిని తక్షణం తీరానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం రాత్రి నుంచి పెనుగాలుల తీవ్రత పెరిగే అవ కాశం ఉన్నందున ప్రమాదాలు సంభవించకుండా పూరిళ్లు, పెంకుటిళ్లలో నివశిస్తున్నవారంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం ఎక్కడికక్కడ ఆర్డీవోలు తీరప్రాంత మండలాల తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల సమయం లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండవద్దని, ఈ మేరకు ప్రజలను హెచ్చరిం చేలా కింది స్థాయి సిబ్బందికి సమాచారం అందించారు. భారీ వర్షాల ముప్పు నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉన్నందున ప్రసవ తేదీకి దగ్గరలో ఉన్న గర్భవతులను సమీప ప్రభు త్వ ఆసుపత్రులకు తరలించాలని అటు వైద్య ఆరోగ్యశాఖ మండలాల వారీగా వైద్య సిబ్బందిని అప్ర మత్తం చేసింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీవ్రత పొంచి ఉన్నందున చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలి రహదార్లకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. దీంతో ఆర్‌అండ్‌బీ, ఫైర్‌, ట్రాన్స్‌కో అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో రవాణా అవరోధాలను తొలగించేందుకు జేసీబీలు, పవర్‌ కట్టర్లు, రంపా లు, ట్రాక్టర్లను సంబంధిత శాఖలు సిద్ధంగా చేశాయి. అటు ప్రజలు కూడా పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. విద్యుత్‌ అంతరాయాల వల్ల తాగునీటి సరఫరాకు అటంకం కలగకుండా పంచాయతీలు, మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలు జనరేటర్లు సిద్ధంచేశాయి. తుపాను సంబంధిత సహాయ చర్యలు, పర్యవేక్షణ కోసం రెవెన్యూ, అగ్నిమా పక, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, రోడ్లు, భవనాలు, పోలీస్‌ తదితర శాఖల ఉద్యోగులు, సిబ్బందికి కలెక్టర్‌ సెలవులు రద్దు చేశారు. అత్యవసర విఽధుల కోసం అంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే శనివారం తుపాను తీవ్రత మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త గా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ నుంచి జిల్లా మీదుగా వెళ్లే పదుల సంఖ్యలో రైళ్లను శుక్ర, శనివారాలు రద్దుచేస్తున్నట్టు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది. మరోపక్క తాజా తుపాను ముప్పుతో అన్నదాతల గుండెల్లో మళ్లీ రైళ్లు పరిగెడుతున్నాయి. మళ్లీ పొంచి ఉన్న తుపానుతో తాము రోడ్డున పడతామనే భయం వెన్నాడుతోంది.

Updated Date - 2021-12-03T06:35:16+05:30 IST