జాతర పోదాం.. చలో..చలో..

ABN , First Publish Date - 2021-01-18T06:57:30+05:30 IST

నగరంలో జాతరల కళ ప్రారంభమైంది.

జాతర పోదాం.. చలో..చలో..
కొమురవెల్లి ఆలయం వద్ద భక్తులు

మొదలైన జాతరల సందడి

సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు

కొమురెల్లికి భారీగా తరలిన నగరవాసులు

కోరమీసాల మలన్న వద్ద నగరానిదే సందడి

నగరంలో జాతరల కళ ప్రారంభమైంది. ఇక్కడ జరిగేవి కొన్ని అయితే, పొరుగు జిల్లాలవి మరికొన్ని. పక్క జిల్లాల జాతరలకు భారీగా తరలివెళ్లేందుకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. మెదక్‌ జిల్లా కొమురవెల్లి జాతరకు ఆదివారం లక్ష మంది దాకా నగర భక్తులు హాజరయినట్లు అంచనా. సందడంతా హైదరాబాద్‌ భక్తులదే. 

నార్సింగ్‌,  17 జనవరి (ఆంధ్రజ్యోతి): నగరవాసులు జాతరలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఏటా సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జాతరలు జరుగుతుంటాయి. వరంగల్‌లో కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ, మెదక్‌లో ఏడుపాయల దుర్గమ్మ జాతరలు జరగనున్నాయి. అలాగే, ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మేడారంలో మినీ జాతర నిర్వహించనున్నారు. సంక్రాంతి మరునాటి నుంచే నగర వాసులు కొమురవెల్లికి భారీగా తరలివెళ్తున్నారు.  గతేడాది జాతరలు ముగిసిన వెంటనే లాక్‌డౌన్‌ విధించారు. ఈసారి కరోనా కారణంగా జాతరల విషయంలో కొంత బెంగ ఉన్నా, వైరస్‌ ప్రభావం తగ్గడం, వ్యాక్సిన్‌ కూడా రావడంతో నగర వాసులు జాతరలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. 

కొమురవెల్లికి తరలివెళ్లిన హైదరాబాదీలు 

చేర్యాల, జనవరి 17 : కోరమీసాల మల్లికార్జునస్వామికి కొమురవెల్లి బోనమెత్తింది. డప్పుచప్పుళ్ల దరువుల నడుమ శివశక్తుల సిగాలు, పూనకాలు, పోతురాజుల చిందులతో కొమురవెల్లి విజయాఛల గుట్టలు హోరెత్తా యి. మల్లన్న బ్రహ్మోత్సవాలలో భాగంగా సంక్రాంతి  తర్వాత వచ్చిన మొదటి వారాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్నం వారాన్ని ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన సుమారు లక్ష మంది తరలిరావడంతో కొమరవెల్లి జనసంద్రంగా మారింది. శనివారం సాయంత్రం ఽధూళిదర్శనం చేసుకున్న భక్తు లు ఆదివారం భారీగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తిప్రపత్తులతో బోనాలు తయారు చేసి నైవేద్యాన్ని నివేదించారు. బసచేసిన ప్రాంతంలో, ఆలయ గంగరేగు చెట్టు ప్రాంతంలో, ముఖమండపంలో మల్లన్నకు చిలుకపట్నం, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని చీర, సారెలతో ఒడి బియ్యాలు పోశారు. తమ కోరికలు నేరవేర్చమని గంగరేగు చెట్టుకు ముడుపులు     కట్టారు. సంతానం కలిగించాలంటూ మహిళలు వల్లుబండ వద్ద వరం పట్టారు. 

ఎల్లమ్మ దేవతకు బోనాలు 

స్వామివారి సహోదరి అయిన ఎల్లమ్మ దేవతకు బోనాలు నివేదించారు. డప్పుచప్పుళ నడుమ సిగాలతో శివమెత్తుతూ ఎల్లమ్మతల్లి నామస్మరణతో గుట్టపైకి ఎక్కి అమ్మవారికి బోనాలు నివేదించి మొక్కులు తీర్చు కున్నారు.. బెల్లంపానకం, కల్లును నైవేద్యంగా సమర్పించి తమ పసుపు, కుంకుమలు చల్లంగా చూడమని వేడుకున్నారు. 

క్యూలైన్లలో పడిగాపులు 

భారీగా భక్తులు రావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయా యి. పట్నాల మందిరంలోని క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి 5గంటలు పట్టడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.   

నేడు పట్నం అగ్నిగుండాలు

ఆలయ తోటబావి ప్రాంగణంలో సోమవారం హైదరాబాద్‌ యాదవసంఘం ఆధ్వర్యంలో పెద్దపట్నం రచించి, అగ్నిగుండాలు దాటనున్నారు. వంటినిండా పసుపు ధరించి భక్తులు పట్నం తొక్కి అగ్నిగుండాలలో చిందేయనున్నారు. 



22 నుంచి జాతీయ పశువుల జాతర

నార్సింగ్‌,  17 జనవరి (ఆంధ్రజ్యోతి): నార్సింగ్‌ మార్కెట్‌ యార్డులో ఈనెల 22న జాతీయ పశువుల జాతర నిర్వహించనున్నారు. ఏటా సంక్రాంతి పండగ తర్వాత వచ్చే మొదటి శుక్రవారం పశువుల జాత ర(పశు సంక్రాంతి) నిర్వహిస్తారు. జాతరలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పశువులను తీసుకొచ్చి విక్రయిస్తారు. ఒక్క రోజులో రూ. 2 నుంచి రూ. 4 కోట్ల మధ్య టర్నోవర్‌ ఉంటుంది. కరోనా కారణంగా జాతర నిర్వహించాలా లేదా అన్న సందేహాలను పక్కన పెట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పశుజాతర కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నామని నార్సింగ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ మేకల ప్రవీన్‌ యాదవ్‌ తెలిపారు.   



Updated Date - 2021-01-18T06:57:30+05:30 IST