సాటిలేని విశ్లేషకుడు జశ్వంత్‌రావు

ABN , First Publish Date - 2020-09-09T06:53:07+05:30 IST

గత నెల 27వ తేదీన మరణించిన ‘జనశక్తి’, ‘క్లాస్ స్ట్రగుల్’ పత్రికల సంపాదకులు, తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ పోలవరపు జశ్వంత్‌రావు ఒక విశిష్టమైన వ్యక్తి...

సాటిలేని విశ్లేషకుడు జశ్వంత్‌రావు

కష్టజీవుల కోసం, ఆదివాసుల కోసం నిర్విరామంగా పని చేసిన మహోన్నతుడు డాక్టర్ జశ్వంత్. ఆదివాసీ ప్రాంతాలలో గిరిజనుల న్యాయమైన సమస్యలను కూడా పట్టించుకోని పరిస్థితులను వెల్లడిస్తూ, స్వపరిపాలన, ఆ ప్రాంతాలలోని వనరులపై సామూహిక యాజమాన్యం ఆదివాసీల పురోగమనానికి ఎంత అవసరమో ఆయన వివరించేవారు. 


గత నెల 27వ తేదీన మరణించిన ‘జనశక్తి’, ‘క్లాస్ స్ట్రగుల్’ పత్రికల సంపాదకులు, తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ పోలవరపు జశ్వంత్‌రావు ఒక విశిష్టమైన వ్యక్తి. నలభై మూడు సంవత్సరాలుగా ప్రజా ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి పని చేశాను. ముఖ్యంగా 2001లో అమరుడు మండ్ల సుబ్బారెడ్డి మరణం తర్వాత రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నాక, డాక్టర్ జశ్వంత్‌రావుతో కలిసి అనేక వేదికలను పంచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డాక్టర జశ్వంత్‌రావు రైతాంగ సమస్యలను అవగతం చేసుకోవడానికి అవసరమైన వివరాలు, వాటి పరిష్కారాంశాలను ప్రజలకు సుబోధకంగా వివరించేవారు.


ముఖ్యంగా ఉత్తరాంధ్ర వ్యవసాయాధారిత పరిశ్రమల సంక్షోభాన్ని గోగు, పత్తి పంటల రైతాంగ సంక్షోభాన్ని ఆయన ఎంతో లోతుగా విశ్లేషించేవారు. ఈ రోజుల్లో కరోనా కారణంగా వలస కార్మికులు పడుతున్న కష్టాల గురించి అనేకులు మాట్లాడుతున్నారు. వారి గురించి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, నల్గొండ, పాలమూరు జిల్లాల వలస కార్మికుల దుస్థితి గురించి ఆనాడే ఎత్తిచూపుతూ డాక్టర్ జశ్వంత్‌రావు ఎన్నోసార్లు ప్రసంగించారు, రచనలు సాగించారు. జశ్వంత్‌ కుటుంబం అంతా డాక్టర్లే. కోస్తా జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో వారి కుటుంబసభ్యులు ప్రముఖ డాక్టర్లుగా గుర్తింపు పొంది, వైద్య వృత్తిలో రాణిస్తున్నారు. అలాంటి ఉన్నత కుటుంబంలో పుట్టిన జశ్వంత్ ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన తర్వాత నమ్మిన ఆశయాలకై కష్టాల బాటలో నడవడమా, లేక వడ్డించిన విస్తరి లాంటి జీవితాన్ని అనుభవించడమా? అనే మీమాంసలో మొదటిదాన్నే ఎంచుకుని కష్టాలు, కడగండ్ల బాటలో ప్రయాణించారు. కష్టజీవుల కోసం, ఆదివాసుల కోసం నిర్విరామంగా పని చేసిన మహోన్నతుడు డాక్టర్ జశ్వంత్.


1980లలో ఒంగోలు, గుంటూరులలో మొదలై రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన రైతాంగ ఆత్మహత్యల వెనుక ఉన్న లోతైన కారణాలను విశ్లేషిస్తూ ఆయన కలం నిర్విరామంగా పని చేసింది. కేవలం శుద్ధ మానవతావాదం కింద ఈ సమస్యను పరిశీలించరాదని భావిస్తూ; మార్కెట్ శక్తులకు, ఉత్పత్తి శక్తులకు మధ్య వైరుధ్యంలో ప్రభుత్వాల మొగ్గు మార్కెట్ శక్తుల వైపు ఉండటాన్ని ఆయన ఎత్తి చూపారు. పత్తి రైతుల సంక్షోభానికి ప్రధాన కారణమైన విత్తనాలు బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉండటం రైతాంగానికే కాదు, దేశ స్వాతంత్ర్యానికి ఎంత ప్రమాదకరమో డాక్టర్ జశ్వంత్‌రావు సోదాహరణంగా వివరించారు.


అంతేగాక సముద్రతీర ప్రాంతాల్లో మడ అడవుల విధ్వంసం, తీరప్రాంత పరిరక్షణ చట్టాలను నీరుగార్చుతున్న తీరు, వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి, తరచూ సంభవిస్తున్న తుఫాన్ల వల్ల జరుగుతున్న నష్టాలకు మూలాలు ప్రభుత్వాల విధానాల్లో ఉండడం గురించి డాక్టర్ జశ్వంత్‌రావు ప్రతిభావంతంగా వివరించేవారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలు ప్రైవేటీకరించడం వల్ల జరగబోయే అనర్థాలను 1990లలోనే తన రచనల్లో తేటతెల్లం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయటం, ప్రజాతంత్ర వైద్య విధానాన్ని అమలు చేయడం కోసం ప్రజల ముందున్న ముఖ్య కర్తవ్యం అని నాటి నుంచే వివరించేవారు. 


ఆదివాసీ ప్రాంతాలలో గిరిజనుల న్యాయమైన సమస్యలను కూడా పట్టించుకోని పరిస్థితులను వివరిస్తూ, స్వపరిపాలన, ఆ ప్రాంతాలలోని వనరులపై సామూహిక యాజమాన్యం ఆదివాసీల పురోగమనానికి ఎంత అవసరమో జశ్వంత్ వివరించేవారు. ఈనాడు మన కళ్ల ముందు కనపడుతున్న కఠిన జీవిత వాస్తవాలను 40ఏళ్లుగా అనేక వేదికల మీద ఎత్తిచూపుతూ మార్మోగిన జశ్వంత్ కంఠస్వరం వివిధ సామాజిక అంశాలపై సాధికారతతో సాంద్ర, గంభీరస్వరంతో విశ్లేషించిన గొంతు ఇప్పుడు మూగబోయింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై శాస్త్రీయంగా విశ్లేషించిన ఆయన కలం ఇప్పుడు ఆగిపోయింది. తోటి కార్యకర్తల పట్ల, ముఖ్యంగా మహిళా కార్యకర్తల పట్ల అత్యంత బాధ్యతతో మెలగటం, వారి అభివృద్ధికి నిరంతరం సహకరించడం జశ్వంత్ ప్రత్యేకత. అనేక ఉద్యమ అనుభవాలను మనసులో నిక్షిప్తం చేసుకుని, డాక్టర్ జశ్వంత్ సాగించిన కృషిని స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తున్నాను.

ఎస్. ఝాన్సీ

అఖిల భారత ఖేత్ మజ్దూర్, కిసాన్ సభ జాతీయ కో కన్వీనర్

Updated Date - 2020-09-09T06:53:07+05:30 IST