జపతో నాస్తి పాతకమ్‌

ABN , First Publish Date - 2020-08-06T09:03:33+05:30 IST

కృషి (వ్యవసాయం) చేసేవానికి కరువులేదు. జపము చేసేవానికి పాపం అంటదు. మౌనధారికి కలహాలు ఉండవు. జాగ్రత్తతో ఉండేవారికి భయం

జపతో నాస్తి పాతకమ్‌

మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం

యజ్ఞానాం జపయజ్ఞోస్మిః స్థావరాణాం హిమాలయః


‘‘మహర్షులలో భృగు మహర్షి, వేదాల్లో ఏకాక్షరమగు ప్రణవం, యజ్ఞాల్లో జప యజ్ఞం (మానస యజ్ఞం), స్థిరంగా ఉండేవాని లోపల హిమవత్‌ పర్వతాన్ని నేనే అవుతున్నాను’’ అని విభూతి యోగంలో భగవానుడు చెప్పాడు. ఏదేనా భగవన్నామాన్ని లేక పవిత్రమైన మంత్రాన్ని మళ్లీ మళ్లీ స్మరించడమే ‘జపం’. అది యోగంలోని ముఖ్యాంశాల్లో ఒకటి. జీవుడికి అది ఆధ్యాత్మికాహారం. మనిషిని దేవుడితో సమానంగా మార్చే స్పర్శవేది. భగవత్‌ సాక్షాత్కార మార్గంలో మిక్కిలి ప్రయాసతో సాగే సాధకులకు ఊతకర్ర.


‘‘జపత్తేనైవదేవతా దర్శనం కరోతి, కలేనాన్యేషాం భవతి’’ అని ఉపనిషత్‌ వాక్యం. ‘భగవన్నామ జపం వల్లనే దేవతా దర్శనం కలుగును. కలియుగంలో ఇంకో మార్గం లేనే లేదు’ అని దీని అర్థం. ఒక నిర్దుష్టమైన మంత్రంతో.. సంబంధిత దేవతను స్మరిస్తూ సరైన రీతిలో జపించాలి. అప్పుడు ఏర్పడిన శబ్ద తరంగాల ప్రకంపనాలు అత్యున్నత దశలో ఆ దేవతారూపాన్ని సృజించగలవు. మనం జపించే నామానికి, మంత్రానికి, మంత్రాధి దేవతకునూ భేదము లేదు. ‘రామ’నామాన్ని జిహ్వపై నిరంతరం జపిస్తే.. ఆత్మారాముని అనుభవ పూర్వకంగా దర్శించగలం. నిష్కామ జపం చేసినవారి హృదయంలో భగవంతుడు జ్ఞానదీపం వెలిగించి, అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు.


వాచికం, ఉపాంశు, మానసం అని జపం మూడు విధాలుగా ఉంటుంది. వాచికం వైఖరీ రూపం. ఇది స్థూలం. ఉపాంశు దీనికన్నా సూక్ష్మం. శక్తిమంతం కూడా. మానస జపం ఈ రెండింటికన్నా ఎక్కువ. వాచిక జపంలో ఇష్టదేవత యొక్క కల్యాణ రూపాన్ని, మంగళకర గుణాల్ని స్మరించాలి. ఉపాంశు జపంలో పెదవులు, నాలుక కదులుతాయిగానీ.. శబ్దం ఇతరులకు వినబడదు. మానస జపం చాలా ఉత్తమం. ఇందులో ఇష్టదేవతా నామాన్ని లేక మంత్రాన్ని మనస్సునందే జపిస్తూ ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఆనందం అనే సుగంధం గుబాళిస్తుంది. తన్మయత్వం ప్రాప్తిస్తుంది. ఇది ఆ దేవత అనుగ్రహానికి శుభ సూచనగా గుర్తించాలి. ఈ జప యజ్ఞాన్ని నిష్కామంగా ఆచరిస్తే చిత్తశుద్ధికలిగి జ్ఞాననిష్ఠ లభిస్తుంది. ఇంద్రియచాపల్యం, మనశ్చాంచల్యం పోతాయి. కాల్చే శక్తి అగ్నికి సహజ స్వభావిక లక్షణమైనట్లుగా.. జపం సాధకుని పాపాలను పూర్తిగా దహించి ఇష్టదేవత తోడి పరమానందభరితమైన సంయోగాన్ని ప్రసాదిస్తుంది. జపానికి పవిత్రత, హృదయ పూర్వకభావము, ఏకాగ్రచిత్తం మాత్రమే ముఖ్యంగానీ, జప సంఖ్య ముఖ్యం కాదు.


కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకమ్‌

మౌనేన కలహం నాస్తి, నాస్తి జగరతో భయమ్‌

కృషి (వ్యవసాయం) చేసేవానికి కరువులేదు. జపము చేసేవానికి పాపం అంటదు. మౌనధారికి కలహాలు ఉండవు. జాగ్రత్తతో ఉండేవారికి భయం ఉండదని’’ దీని భావం. ‘‘స్తోత్రకోటి సమోజపః’’ అనగా కోటి స్తోత్రాలకు సమమైనది జపం. జపం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. సమస్త ప్రాయశ్చిత్తాలలో నామ జపమే శ్రేష్ఠమైనది.



 మేఘశ్యామ (ఈమని), 8332931376

Updated Date - 2020-08-06T09:03:33+05:30 IST